రింగుల జుట్టుతో రంగుల ప్రపంచపు రారాణిగా వెలుగొందింది తాప్సీ పన్ను. అయితే, తన గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆ కర్లీ హెయిర్.. కొన్ని సందర్భాల్లో తనకే చిక్కులు తెచ్చిపెట్టిందని చెబుతున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన రింగుల జుట్టు కారణంగా అనేక అవకాశాలు కోల్పోయానని వాపోయింది. “సినిమాల్లోకి అడుగుపెట్టిన మొదట్లో.. నాకు స్టోరీ చెప్పడానికి వచ్చిన దర్శకులంతా నా జుట్టును సరిచేసుకోవాలని చెప్పేవారు. కేవలం స్ట్రెయిట్ హెయిర్‌తోనే గ్లామర్, స్టయిలిష్ లుక్ వస్తుందని ఆ దర్శకులు అనుకునేవారు.
ఇక రింగుల జుట్టు అంటే.. ‘రెబల్ రూల్స్’ అని భావించేవారు. కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలు.. నెగెటివ్ పాత్రలకే పనికొస్తారనీ, సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయిగా కనిపించలేరనీ చెప్పేవారు” అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నది. అందుకే, సినిమా అవకాశాల కోసం మొదట్లో తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవడానికి అంగీకరించిందట. అయితే, ఆ తర్వాత సినిమాలతోపాటు ప్రకటనల్లోనూ తన జుట్టును సరిచేయించుకోవాలని చెప్పేవారట. “నాతో యాడ్స్ చేయడానికి పెద్దపెద్ద బ్రాండ్స్ ఆసక్తి చూపించేవి. కానీ, నా రింగుల జుట్టును మార్చుకోవాలని చెప్పేవి. అలా, నేను సినిమాలతోపాటు చాలా యాడ్స్ కూడా రిజెక్ట్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన చిన్ననాటి ముచ్చట్లనూ పంచుకుంటూ.. “బాల్యంలో కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు చాలా తక్కువగా ఉండేవారు. అందుకే, ఇలా ఉండటం అసాధారణమనే భావనలో ఉండేదాన్ని. అయితే, సరైన అవగాహన లేక రింగుల జుట్టుతో ఇబ్బందులు పడ్డా. చివరికి నా జుట్టును అర్థం చేసుకుని.. సరైన ఉత్పత్తులు వాడుతూ, సంరక్షించుకున్నా!” అంటూ గుర్తుచేసుకున్నది. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తాప్సీ. వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టి.. అక్కడా వరుస హిట్స్ అందుకున్నది. పలు వెబ్ సిరీస్‌లలోనూ మెరిసింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. చివరిసారిగా అక్షయ్ కుమార్ సరసన ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రంలో కనిపించింది.