Pavitra Nayak | చక్కని చిరునవ్వుతో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది కన్నడ నటి పవిత్ర నాయక్. ‘స్టార్ మా’ వారి ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్‌తో కథానాయికగా పరిచయం కానున్నది పవిత్ర. తెలుగు భాష తనకు ప్రాణమని, తెలుగుదనం అంటే వల్లమాలిన అభిమానమని చెబుతున్నదీ అందాల బొమ్మ.
మాది బెంగళూరు. చిన్నప్పటినుంచీ పాటలు, డ్యాన్స్ నా హాబీలు. నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంజినీరింగ్ సమయంలో.. అప్పటికే యాక్టింగ్ కోర్స్ చేస్తున్న మా అన్నయ్య ద్వారా కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. మొదట వద్దనుకున్నా. కానీ, అమ్మానాన్న ఒప్పించారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ప్రోత్సహించారు. అలా వెండితెరకు పరిచయం అయ్యాను.
ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఐదేండ్లు అవుతున్నది. నాలుగు సినిమాల్లో, మూడు సీరియల్స్‌లో నటించా. ఒక సినిమా విడుదలైంది. మిగతా మూడు సిద్ధంగా ఉన్నాయి. మొదటి అవకాశం వచ్చినప్పుడు వద్దని చెప్పినా, ఇప్పుడు నటనే నా కెరీర్‌గా మారింది. ఇష్టంతోపాటు గౌరవం కూడా పెరిగింది. భిన్నమైన పాత్రలు చేసి అందరినీ అలరించాలని ఉంది. కన్నడ కస్తూరినే అయినా, దాదాపు అన్ని దక్షిణాది భాషలూ అర్థం చేసుకోగలను. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఆసక్తి. ముఖ్యంగా కొత్త భాషలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. దాదాపు రెండేండ్లుగా తెలుగులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ఇప్పుడు కుదిరింది. ఈ సీరియల్ గురించి చెప్పగానే సంతోషంగా ఒప్పేసుకున్నా. ఇది స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ?’ సీరియల్‌కు రీమేక్. చదువుకునే రోజుల్లో ఆ సీరియల్‌ని బాగా ఇష్టపడేదాన్ని. మొదటి ఎపిసోడ్ నుంచి చివరిదాకా చూశాను. సీరియల్లో నా పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. కోపం, సంతోషం, దుఃఖం.. ఇలా ఏ భావం కలిగినా వెంటనే వేడివేడి బజ్జీలు వేసుకుని తినే అల్లరి అమ్మాయిగా కనిపించబోతున్నా.
కన్నడ సీరియల్ ‘పారు’తో నాకు మంచి గుర్తింపు లభించింది. ఎక్కడికి వెళ్లినా ఆ సీరియల్లో నా పాత్ర ‘జనని’ పేరుతోనే పిలుస్తారు అభిమానులు. నాకు సినిమాలంటే ప్రాణం. అన్ని భాషల చిత్రాలూ చూస్తాను. ఈ తరం హీరోలందర్నీ అభిమానిస్తాను. ఎవరికివారు ప్రతిభను నిరూపించుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ప్రస్తుతానికి ప్రేమ ఆలోచనకు దూరం. ఇప్పట్లో పెండ్లి చేసుకునే ఉద్దేశమూ లేదు. సమయం వచ్చినప్పుడు అవే జరిగిపోతాయని నమ్ముతాను.
హైదరాబాద్ వాతావరణం చాలా బాగుంది. కాకపోతే, బెంగళూరుతో పోలిస్తే ఎండలు ఎక్కువ. ఇక్కడ మనుషులు ఇట్టే కలిసిపోతారు. ఇలాంటి స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇక, నాకు బాగా ఇష్టమైన ప్రదేశాలు సకలేశపుర, శివమొగ్గ. ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో అక్కడ గడపడానికి ప్రాధాన్యం ఇస్తాను.
… ప్రవళిక వేముల
“Bhavana Lasya | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోల ద్వారా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది”
“ఆర్.నారాయణ మూర్తి వల్లే సినిమాల్లోకి వచ్చా : అభిషేకం సీరియల్ ఫేమ్ ప్రణయ్”
“టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”