తెలుగు వారికి సంక్రాంతి మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి సందడి భోగి నుంచే మొదలవుతుంది. ఈ రోజున సూర్యోదయ సమయంలో ఇంటిముందు కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు.
వీటి మధ్యలో, ఇంటి ద్వారాల రెండు వైపులా ఆవు పేడతో చేసిన ముద్దలను వివిధ రకాల పువ్వులతో అలంకరించి పెడతారు. వీటినే గొబ్బెమ్మలు అంటారు. గొబ్బెమ్మ అనే పదం గోపెమ్మ నుంచి వచ్చిందని అంటారు. అంటే ఇది కృష్ణభక్తి సంప్రదాయానికి సంబంధించింది అన్నమాట. ఇప్పుడు అసలే కనిపించదు కానీ, ఒకప్పుడు బాలికలు ఈ గొబ్బెమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంగా తిరుగుతూ గొబ్బి పదాలను ఆలపించేవాళ్లు.
తెలుగు లోగిళ్లలో గొబ్బెమ్మలను ఉంచడం దాదాపు ఎనిమిది వందల ఏండ్ల కింది నుంచే ఉన్నట్టు తెలుస్తున్నది. వినుకొండ వల్లభుడి రచనగా చెప్పే ‘క్రీడాభిరామం’లో గొబ్బెమ్మల ప్రస్తావన ఉన్నది. ఇది 14- 15 శతాబ్దాల సంధికాలంలో రాసిన కావ్యం. ఇందులో 1289 1323 మధ్య పాలించిన కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడి రోజుల్లోనే ఓరుగల్లులో ఇండ్ల ముందు గొబ్బెమ్మలను కొలువు దీర్చినట్టు ఇందులో పేర్కొన్నాడు. వీటిని ‘గోమయ పిండములు’ (ఆవు పేడతో చేసిన ముద్దలు)గా ప్రస్తావించాడు. పాల్కురికి సోమనాథుడు రాసిన ‘పండితారాధ్య చరిత్ర’లో గొబ్బి పదాల ప్రస్తావన ఉన్నది. అప్పటికే ప్రజల నోళ్లలో ఉన్న గొబ్బి పదాలను 15వ శతాబ్దానికి చెందిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో వాడుకున్నాడు. తిరుమల గిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వరుడికి… బృందావనంలో యమునాతీరంలో విహరించిన శ్రీకృష్ణుడికి అభేదం చూపుతూ ‘కొలని దోపరికి గొబ్బిళ్లో యదు/ కులము స్వామికిని గొబ్బిళ్లో’ అని నుతించాడు. బాలకృష్ణుని లీలా విశేషాలను చాటుతూ సాగే ఈ పాట అత్యంత ప్రసిద్ధి చెందిన అన్నమయ్య సంకీర్తనల్లో ఒకటి.
చీరల దొంగే వస్త్ర ప్రదాత
‘కొలని దోపరి’ అంటే కొలనులో స్నానాలు చేయడానికి వచ్చిన గోపికల చీరలను ఎత్తుకెళ్లిన కృష్ణుడు అని అర్థం. మామూలు అర్థంలో చీరలు ఎత్తుకెళ్లిన అనే అర్థమే ఉన్నప్పటికీ… ఆధ్యాత్మికంగా దీనికి విశేషార్థం ఉంటుంది. మరో విశేషం ఏంటంటే కొలను దగ్గరి చీరల్ని దోచుకున్న కృష్ణుడు కౌరవ సభలో అవమానం పాలైన ద్రౌపదికి చీరలిచ్చి మానం కాపాడాడు. అలాంటి యదు యాదవ కుల వల్లభుడికి గొబ్బిళ్లో అని అన్నమయ్య కీర్తన. గొబ్బిళ్లు అంటే రంగవల్లుల్లో కొలువుదీర్చే గొబ్బెమ్మలే అయినప్పటికీ.. నమస్కారం అనే అర్థం కూడా ఉన్నది. ఈ సంకీర్తనలో ప్రయోగించిన గొబ్బిళ్లు పదానికి నమస్కారం అనే అర్థాన్నే తీసుకోవాలి.
గోవర్ధన గిరిధారి
ఇంద్రుడి ఆదేశంతో బృందావనంలో మేఘాలు రాళ్లవాన కురిపించి ఆగమాగం చేసినప్పుడు గోపజనులు, గోవులు, ఆవుదూడలు, ఇతర ప్రాణులను కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగుగా పట్టి కాపాడాడు. దీన్నే అన్నమయ్య ‘కొండ గొడుగుగా గోవుల గాచిన/ కొండుక శిశువుకు గొబ్బిళ్లో’ అని ప్రస్తావించాడు. ‘కొండుక’ శిశువు అంటే చిన్న బిడ్డడు అని అర్థం. అంతేకాదు గోకులం, బృందావనంలో ఉన్నప్పుడు కంసుడి ఆదేశంతో ఎంతోమంది దైత్యులు (రాక్షసులు) చిన్నికృష్ణుడిని చంపడానికి ప్రయత్నించారు. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైనవాళ్లను దేవకీసుతుడు అణచివేశాడు. ఈ సందర్భాలను అన్నమయ్య ‘దుండగంపు దైత్యుల కెల్లను తల/ గుండు గండనికి గొబ్బిళ్లో’ అని పేర్కొన్నాడు. దుండగాలకు తెగబడ్డ దైత్యులకు తలగుండు బాధ మిగిల్చిన గండడు శూరుడిగా కృష్ణుడిని పదకవితా పితామహుడు ప్రశంసించాడు. తలగుండు అంటే తలమీద పెట్టిన గుండు అని అర్థం.
కంసుడు, శిశుపాలురకు కష్టాలు
శిశుపాలుడు చేది పాలకుడు. కృష్ణుడికి మేనత్త కొడుకు. కానీ నిరంతరం కృష్ణుడిని ద్వేషిస్తాడు. వంద తప్పుల వరకు కాచిన కన్నయ్య ఆ తర్వాత శిశుపాలుడిని సంహరిస్తాడు. ఇక మేనమామ కంసుడి సంగతి సరేసరి. ‘పాప విధుల శిశుపాలుని తిట్ల/ కోపగానికిని గొబ్బిళ్లో’ శిశుపాలుడు తనను తిట్టినందుకు కోపించిన వాడిగా కృష్ణుడికి అన్నమయ్య వందనాలు సమర్పించాడు. ఆ తర్వాత కంసుడిని చంపిన వైనాన్ని
‘యేపున కంసుని యిడుమల బెట్టిన/ గోపబాలునికి గొబ్బిళ్లో’ అని కృష్ణుడి అవతార విశేషాన్ని ప్రస్తావించాడు. కంసుణ్ని ఒక్కసారిగా చంపకుండా కృష్ణుడు తాను ఎక్కడున్నది తెలియకుండా వేచి ఉండేలా కష్టపెట్టి మరీ చంపేశాడు. యిడుములు (ఇడుములు) అంటే కష్టాలు అని అర్థం.
వెండి బంగారాల వేంకటగిరి
దేవతలు అద్భుతమైన శక్తులు కలిగిన వాళ్లు. వారిని తరిమివేసిన ఘనులు రాక్షసులు. అంతటి పరాక్రమం కలిగిన రాక్షసులను విష్ణువు వివిధ అవతారాలు ధరించి అంతం చేశాడు. దీన్నే అన్నమయ్య ‘దండి వైరులను తరిమిన దనుజుల/ గుండె దిగులునకు గొబ్బిళ్లో’ అని ప్రయోగించాడు. ‘దండి వైరులు’ అంటే దేవతలు. దనుజులు అంటే రాక్షసులు. వారి గుండెల్లో దిగులు భయం, దడ పుట్టించినవాడు శ్రీమహావిష్ణువు. ఆపన్నులను రక్షించే శ్రీమహావిష్ణువు తిరుమల గిరుల్లో శ్రీవేంకటేశ్వరుడి రూపంలో కొలువుదీరి భక్తులకు కొంగుబంగారంగా నిలిచాడు. దీన్నే ‘వెండిపైడి యగు వేంకటగిరిపై/ కొండలయ్యకును గొబ్బిళ్లో’ అని అన్నమయ్య కొలిచాడు. స్వామిని నమ్ముకున్న వారికి వేంకటగిరి (తిరుమల) వెండి, బంగారాలతో సమానం. అక్కడ వెలసిన కొండలయ్య (వేంకటేశ్వరుడు)కు గొబ్బిళ్లు అంటున్నాడు అన్నమయ్య. అలతి అలతి పదాలతో అచ్చ తెలుగు ఆచారానికి చక్కటి పాటలో పట్టం కట్టిన అన్నమయ్యకు గొబ్బిళ్లు!
కొలని దోపరికి గొబ్బిళ్లో యదు
కులము స్వామికిని గొబ్బిళ్లో
కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్లో
దుండగంపు దైత్యులకెల్లను తల
గుండు గండనికి గొబ్బిళ్లో
పాప విధుల శిశుపాలుని తిట్ల
కోపగానికిని గొబ్బిళ్లో
యేపున గంసుని యిడుమల బెట్టిన
గోపబాలునికి గొబ్బిళ్లో
దండివైరులను తరిమిన దనుజుల
గుండె దిగులునకు గొబ్బిళ్లో
వెండి పైడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్లో
-చింతలపల్లి హర్షవర్ధన్