విదేశాల నుంచి దిగుమతైన ఆహార పదార్థాల్లో ఒకటి రోజ్మేరీ. పాశ్చాత్య వంటలకు మరింత రుచిని జోడించేందుకు దీనిని జతచేస్తారు. అయితే రుచికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు రోజ్మేరీ ప్రసిద్ధి చెందింది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తి పెంచడంలోనూ సాయపడుతుంది. రోజ్మేరీ వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రోజ్మేరీ మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికి, వృద్ధుల్లో అల్జీమర్స్ ప్రభావాన్ని తగ్గించడానికి రోజ్మేరీ ఉపయోగపడుతుంది. రోజ్మేరీ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, దీనివల్ల మెదడుకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. తద్వారా మానసిక స్పష్టత మెరుగుపడుతుంది.
రోజ్మేరీ ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి తగ్గడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన స్పష్టత మెరుగుపడతాయి. రోజ్మేరీలోని 1, 8-సినియోల్ అనే సమ్మేళనం ఎసిటైల్కోలిన్ విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచుతుంది. రోజ్మేరీలోని యాంటి ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి మెదడు కణాలను రక్షిస్తాయి. ఈ యాంటి ఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయట.
రోజ్మేరీ ఆకుల వాసనే ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ అందిస్తుంది. ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాలుగైదు నిమిషాలు ఈ వాసన పీల్చడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు, రోజ్మేరీ ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగుతాయి. కడుపుబ్బరం, ఊబకాయం తగ్గుతాయి.
రోజ్మేరీ ఆకుల్లో సి-విటమిన్ గణనీయంగా లభిస్తుంది. దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నోటిపూత రాదు. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.