వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మానవాళికి ప్రాణసంకటంగా మారనున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ఏటా ఏడు లక్షలకు పైగా అదనపు అకాల మరణాలకూ కారణం కానున్నాయి.
ఈ విషయాన్ని ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ జర్నల్లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడించింది. అర్జెంటీనాలోని పోంటిఫికల్ క్యాథలిక్ విశ్వవిద్యాలయం, లాటిన్ అమెరికాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా, 2000-2022 మధ్య.. 156 దేశాల నుంచి డేటాను విశ్లేషించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 2050 వరకు ప్రపంచవ్యాప్తంగా శారీరక కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేయవచ్చో అంచనా వేశారు. ఆ సమయం వరకూ అధిక సంఖ్యలో శారీరక చురుకుదనం లోపించి..
ఉష్ణమండల ప్రాంతాలలో అదనపు అకాల మరణాలు సంభవిస్తాయని వెల్లడించారు. ఆయా దేశాల్లో ఉత్పాదకత నష్టాలు కూడా వస్తాయని అంచనా వేశారు. మనుషుల్లో శారీరక చురుకుదనం లోపించడం ఇప్పటికే ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉన్నది. వ్యాయామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడంలో ప్రతి ముగ్గురు పెద్దలలో ఒకరు విఫలమవుతున్నారని పరిశోధకులు తెలిపారు.
ఇక రాబోయే రోజుల్లో వాతావరణంలో జరిగే మార్పులు.. మన దైనందిన జీవనశైలితోపాటు ఆరోగ్యంపైనా అనేక రకాలుగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అధిక వేడి కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చి.. కార్డియోమెటబాలిక్ వ్యాధులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయట. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా ప్రజలు బయట తిరగడానికి, వ్యాయామం చేయడానికి ఇబ్బంది పడతారు. నడక, సైక్లింగ్ వంటి
సాధారణ పనులు తగ్గిపోతాయి. క్రీడలు, ఇతర బహిరంగ కార్యకలాపాలు పరిమితం అవుతాయి. ఇలా శారీరక శ్రమ తగ్గడం వల్ల పరోక్షంగా అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ప్రజలు ఇంటికే పరిమితం కావడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు అధికమవుతాయి. టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన కూడా పెరగవచ్చు.
ఈ క్రమంలో శారీరకంగా చురుగ్గా ఉండటాన్ని జీవనశైలి ఎంపికగా చూడొద్దని అంటున్నారు. వాతావరణానికి అనుగుణంగా ఏర్పడిన ఒక ఆవశ్యకతగా పరిగణించాలని సూచిస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ‘అర్బన్ ఫారెస్ట్స్’ పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చనీ, వ్యాయామం, కఠినమైన పనులను తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లోనే ముగించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. నీడలతో కూడిన నడక దారులు, చల్లని ఇండోర్ వ్యాయామశాలలను పెంచుకోవాలి. మొత్తానికి వాతావరణ మార్పు అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. అది మన భవిష్యత్తు తరాల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం కూడా! కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు.