క్రుధ్యన్తం న ప్రతి క్రుద్ధే దాకృష్ట కుశలం వదేత్
(నారద పరివ్రాజక ఉపనిషత్తు 3-43)
‘కోపించువానిని కోపించరాదు. నిందించువానికి కుశలం పలకాలి’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. కోపగ్రస్తుణ్ని కోపిస్తే… అతని కోపం పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాకాకుండా కోపానికి కోపమే సమాధానం అంటే చిక్కులు తప్పవు. ఈ కింది వృత్తాంతం చూడండి.
ఒకసారి శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారం వెళ్లారు. చీకటి పడింది. కీకారణ్యంలో ఎటూ పోలేరు. ఆ రాత్రి ఇద్దరు నిద్రిస్తే ఒకరు కాపలా ఉండాలనుకున్నారు. సాత్యకి గస్తీ తిరగసాగాడు. అంతలో ఒక రాక్షసుడు వేగంగా వచ్చి వారిపై పడబోయాడు. సాత్యకి గదాదండంతో ఎదుర్కొన్నాడు. రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకి కోపం పెరిగింది. రాక్షసుడి శరీరమూ విపరీతంగా పెరిగింది. సాత్యకిని పైకెత్తి, గిరగిరా తిప్పి పడేసి వెళ్లిపోయాడు.
కాసేపటి తర్వాత బలరాముడు కాపలా కాస్తుండగా అదే రాక్షసుడు మళ్లీ అటుగా వచ్చాడు. బలరాముడు హలాయుధంతో దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసంతో శరీరాన్ని పెంచాడు. బలరాముడికి కోపం అమాంతం పెరిగింది. రాక్షసుడి శరీరమూ భీకరంగా పెరిగింది. వాడు బలరాముడిని సైతం మట్టి కరిపించి, వెళ్లిపోయాడు.
ఇంతలో శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. కాపలా కాయసాగాడు. కాసేపటికి అదే రాక్షసుడు అటుగా వచ్చాడు. కసిగా కృష్ణుడిపై దూకాడు. తప్పించుకున్న కృష్ణుడు చిరునవ్వు చిందించాడు. రాక్షసుడు పట్టుకోబోతే.. ఒడుపుగా తప్పించుకొని మల్లయుద్ధానికి దిగాడు. రాక్షసుడి శరీరం సగం తగ్గిపోయింది. అతడు కవ్విస్తున్నా కృష్ణుడి మందహాసం చెదరలేదు. రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. గుప్పిట్లో పట్టేంత చిన్నవాడయ్యాడు. కృష్ణుడు వాణ్ని అరచేత్తో పట్టి ఉత్తరీయం కొసకు మూటలా కట్టేశాడు.
తెల్లవారింది. సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. మందహాస వదనుడైన కృష్ణుణ్ని చూశారు. ‘హమ్మయ్య! రాక్షసుడు కనిపించలేదా!’ అన్నారు. ‘వీడేనా రాక్షసుడు!’ అంటూ ఉత్తరీయం అంచున మూట విప్పాడు కృష్ణుడు. అందులోంచి ఊడిపడ్డాడు పిడికెడంత రాక్షసుడు. బలరాముడు, సాత్యకి ‘వీడే! అప్పుడేమో బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా పోరాడే కొద్దీ పెరిగిపోయాడు’ అన్నారు. ‘ఈ రాక్షసుడే క్రోధం. దానికి విరుగుడు శాంతం. మీరేమో రెచ్చిపోయారు. పరాజితులయ్యారు’ అన్నాడు కృష్ణుడు. పై ఉపనిషత్ వాక్యానికి సరిగ్గా సరిపోయింది కదూ ఈ ఉదంతం. కోపగ్రస్తుణ్ని శాంతంతోనే జయించాలి. మనలోని క్రోధాన్ని కూడా ఆలోచనతో అధిగమించాలి.