Rashi Khanna | దక్షిణాది చిత్ర పరిశ్రమలో రాశీ ఖన్నా శైలి ప్రత్యేకం. అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించే ఆ సౌందర్య రాశి.. మనసుకు హత్తుకొనే పాత్రలతో తెలుగువారికి దగ్గరైంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించి ఓటీటీలోనూ తనకు సాటిలేదని చాటుకుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ కబుర్లతో మొదలుపెట్టి.. తన తదుపరి చిత్రాల వరకూ బోలెడు విషయాలు పంచుకుంది.
‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’ వెబ్ సిరీస్‌కు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. నేను పోషించిన ఆలియా చోక్సీ క్యారెక్టర్ మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదో విచిత్రమైన పాత్ర. ప్రేమలో ద్వేషం ఉంటుంది. కాఠిన్యంలో సున్నితత్వం తొంగిచూస్తుంది. ఆ పాత్రకు ఓకే చెప్పాక.. కొంచెం రిస్క్ చేస్తున్నానేమో అనిపించింది. అందుకు తగిన ప్రతిఫలం దక్కింది.
రుద్ర విజయాన్ని మా ఇంట్లోనూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నేను ఓటీటీలను ఎంచుకోవడానికి కారణం.. నా దగ్గరికి వచ్చిన వైవిధ్యమైన పాత్రలే. ఇక్కడ అందరూ ‘నువ్వు పక్కింటి అమ్మాయిలా ఉంటావు’ అంటున్నారు. ఎలాంటి ఆడిషన్స్ లేకుండా కొత్త తరహా క్యారెక్టర్లు వస్తున్నాయి. నేను ఏదైనా ప్రాజెక్టుకు సంతకం చేశానంటే.. వందశాతం న్యాయం చేస్తా. నటిగా నా భవిష్యత్‌కు అవే పునాదులు.
ప్రతి సినిమా నాకు ఒక కొత్త విషయాన్ని నేర్పుతుంది. ఆ పాఠం నటనకు సంబంధించినదే కానవసరం లేదు. నలుగురితో ఎలా నడుచుకోవాలి? ఎలా కలిసిపోవాలి? ఎదుటివారి మనో
భావాలను ఎలా అర్థం చేసుకోవాలి?.. ఇవన్నీ సెట్స్ మీదే నేర్చుకున్నాను. నటిగా పరిపూర్ణత సాధిస్తూనే.. వ్యక్తిత్వాన్నీ పరిపూర్ణంగా తీర్చిదిద్దుకున్నా.
సినిమాల్లో మూస పద్ధతులను బ్రేక్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పటికే ఆ తరహా స్క్రిప్ట్‌లకు దూరంగా ఉంటున్నా. హీరోయిన్ అంటే.. డ్యూయెట్స్ కోసమో, రొమాంటిక్ సీన్స్ కోసమో సృష్టించిన గ్లామర్ బొమ్మ కాకూడదు. స్క్రిప్ట్‌లో బలం ఉంటే.. ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. నిడివి పది నిమిషాలు ఉన్నా సరే.. ప్రభావవంతంగా ఉండాలి.
దక్షిణ భారతంలో నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాది సినిమాలను కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నా. అన్నట్టు, నా తదుపరి చిత్రం షాహిద్
కపూర్‌తో ఉంటుంది.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘యోధ’ షూటింగ్లో బిజీగా ఉన్నా. ఈ చిత్రంలో నన్ను మీరంతా తప్పక ఇష్టపడతారు. నాతో ప్రేమలో పడతారు కూడా! నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను. డిగ్రీ కాగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోనే ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చింది. అనంతరం, అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్‌తో నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను. ఆ తర్వాత నా ప్రయాణమంతా మీకు తెలిసిందే.
బాలీవుడ్‌తో పోలిస్తే.. దక్షిణాది పరిశ్రమలో సినిమా మేకింగ్ కాస్తంత భిన్నం. అక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్‌కు, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తారు. దక్షిణాది సినిమాలను సంప్రదాయాలకు అనుగుణంగా తీస్తారని బాలీవుడ్లో టాక్. కానీ, ఇప్పుడు అలాంటి పరిమితులేమీ లేవు. ఒకవైపు సంస్కృతిని కాపాడుకుంటూనే దేశం గర్వించే కమర్షియల్ సినిమాలూ తీస్తున్నారు. ఒక రకంగా దక్షిణాది చిత్రాలే చాలా రిచ్‌గా ఉంటున్నాయి. కమర్షియల్ సినిమాలు నటీనటులను కొంత దూరం మాత్రమే తీసుకెళ్తాయి. కానీ, ప్రయోగాత్మకమైన పాత్రలతోనే కళాకారులకు పరిపూర్ణత వస్తుంది.
నేను ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదివాను. ఆంగ్ల సాహిత్యం అంటే ఇష్టం. ప్రపంచ ప్రసిద్ధ రచనలన్నీ ఇప్పటికే చదివేశాను. ఆ సాహితీ పరిజ్ఞానం వల్ల కావచ్చు, పాత్రలను అర్థం చేసుకోగలను. మనసులోనే విశ్లేషించుకోగలను. అడపాదడపా కవిత్వమూ రాస్తుంటాను. చాలా రోజుల క్రితం నేను రాసిన ఓ కవితలో నాలుగు పంక్తులు.. ‘నేనంటే నా జీన్స్ కొలతలు కాదు. నేనంటే వేయింగ్ మెషీన్ మీద అంకెలు కాదు. నేనంటే నా డిజైనర్ చిరునవ్వులూ కాదు. నేనంటే నా మనోబలం!’
Read More :
Raashii Khanna | గ్లామర్‌తో సెగలు పుట్టిస్తున్న రాశి ఖన్నా..
“Rashi Khanna: పెళ్లిపై నోరు విప్పిన రాశీ ఖన్నా.. వరుడు ఎలా ఉండాలంటే!”
ఆ షాట్ తర్వాత బాగా ఏడ్చేశా.. ఎమోషన్ అయిన రాశీ ఖన్నా”
“Rashi Khanna: సెగలు పుట్టిస్తున్న ఢిల్లీ బ్యూటీ..”