రక్షాబంధన్.. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు,రక్షణకూ ప్రతీక! అన్నాచెల్లెళ్లు – అక్కాత మ్ముళ్ల మధ్య అనురాగాలు- అనుబంధాలను పెంచే పండుగ! కుటుంబం మొత్తం.. సంతోషాల సాగరంలో ఓలలాడే వేడుక! కానీ, ఇదే పండుగ.. మరో కోణంలో ప్రకృతిని కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ప్లాస్టిక్ రాఖీల వాడకంతో.. భూమాత కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నది. దీన్ని నివారించాలంటే.. ‘ఎకో-ఫ్రెండ్లీ రాఖీ’లతో సోదరులతో పాటు ప్రకృతికీ రక్షణగా నిలవాల్సిన అవసరం ఉన్నది.
గతంలో పూర్తిగా సాంప్రదాయ రాఖీలనే కట్టేవారు. వీటిని సహజమైన పత్తి నూలు దారాలతో తయారుచేసేవారు. చందనం, కుంకుమపువ్వు, పసుపుతో చేసిన రంగులనే ఉపయోగించేవారు. కాబట్టి ఇవి చాలా మృదువుగా, సురక్షితంగా ఉండేవి. వీటిని ఎన్ని రోజులు ధరించినా ఎలాంటి హానీ కలిగేది కాదు. పైగా.. చందనం, కుంకుమ పువ్వు, పసుపులో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలోనూ విరివిగా ఉపయోగించే ఈ పదార్థాలు.. రాఖీ కట్టుకున్న వ్యక్తికి రక్షణగా నిలిచేవి. కానీ, ప్రస్తుతం సింథటిక్ రంగులు, రసాయనాల జిగురుతో తయారైన రాఖీలే వస్తున్నాయి.
ఇవి.. రక్షణకు బదులుగా ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తున్నాయి. పిల్లలకు చర్మంపై దద్దుర్లు, అలెర్జీలను కలిగిస్తున్నాయి. సాయంత్రానికి బయట పడేసినా.. పర్యావరణానికి పెనుభారంగా మారుతున్నాయి. ఒక అంచనా ప్రకారం.. ఏటా రాఖీ పౌర్ణమి సందర్భంగా మనదేశంలో 60 కోట్లకు పైగా ప్లాస్టిక్ రాఖీలు చెత్తలో కలిసిపోతున్నాయి. వీటిలో ఉండే ప్లాస్టిక్ దారాలు, రసాయన రంగులు.. నేల, నీటిని కలుషితం చేస్తున్నాయి. కాబట్టి, సోదరులతోపాటు భూమాతకూ రక్షణగా నిలిచే ఎకో-ఫ్రెండ్లీ రాఖీలను వాడటం ఎంతో మంచిది. ఇవి భూమిపై ఎలాంటి చెత్తనూ మిగిల్చకుండా.. సులభంగా మట్టిలో కలిసిపోతాయి.
గతంలో మాదిరి పత్తి నూలు, కాగితం, జనపనార, బంకమట్టితోనూ ఎకో-ఫ్రెండ్లీ రాఖీలు ముస్తాబవుతున్నాయి. పైగా.. వాటిలో రకరకాల మొక్కల విత్తనాలతో వస్తున్నాయి. పండుగ తర్వాత వీటిని కుండీల్లో నాటితే.. అందమైన మొక్కలుగా పెరుగుతాయి. కేవలం పండుగతోనే కాకుండా, అన్నాచెల్లెళ్ల మధ్య బంధం.. మొక్కలా పెరిగి, మానులా ఎదుగుతుంది. అంతేకాదు.. ఇలాంటి రాఖీలను గ్రామీణ మహిళలు, చేతివృత్తి కళాకారులే తయారుచేస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల వారి ఉపాధికీ చేయూత
ఇచ్చిన వాళ్లమవుతాం. సంప్రదాయ కళలను బతికిస్తున్న
వాళ్లమవుతాం.
మట్టి, జనప దారంతో తయారయ్యే ఎకో-ఫ్రెండ్లీ రాఖీలు కట్టడానికి నమోషీగా ఫీలవుతారా? ఖర్చులో ‘తగ్గేదేలే!’ అంటారా? అయితే, ప్రకృతికి హాని.. మీ స్టేటస్కు భంగం కలగకుండా.. బంగారు, వెండి రాఖీలను కొనుగోలు చేయండి. ఇవి బయట పడేసేవి కాదు కాబట్టి.. ప్రకృతికి ఎలాంటి హానీ కలిగించవు. పైగా.. ధరించినవారి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బంగారం, వెండి రాఖీలను ధరించడం వల్ల హార్మోన్ల సమస్యల నుంచి బయటపడొచ్చు. త్రిదోషాలను అదుపుచేయడంలో ‘వెండి’ ముందుంటుందని ఆయుర్వేద నిపుణుల మాట. ఇక వెండిని ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పైగా.. కొన్ని ప్రత్యేకమైన రాఖీలను పండుగ తర్వాత పెండెంట్లు, బ్రాస్లెట్లుగానూ ఉపయోగించుకోవచ్చు.