Sukumar | సుకుమార్.. తొలుత ఆయనో లెక్కల మాస్టార్! ఆ తర్వాతే సినీ డైరెక్టర్! అందుకే.. అంత సులభంగా అర్థంకాని సమీకరణాలతో చిత్రాన్ని అల్లేస్తారు. కన్ఫ్యూజన్లోనే.. క్లారిటీని వెతుక్కోమంటారు. ఎమోషన్స్ అర్థం కావాలంటే.. వాటి వెనకున్న ఈక్వేషన్స్ తెలుసుకోమంటారు. మొత్తంగా.. తనే ఓ పజిల్లా కనిపిస్తూ, తనని పూరించాలనే ఉత్సాహాన్ని ప్రేక్షకుల్లో నింపుతారు. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ చిత్రాన్ని, ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ చెప్పిన సంగతులు..
మంచి రిలాక్స్ మూడ్‌లో కనిపిస్తున్నారు. రెండేళ్ల శ్రమకు విజయం రూపంలో గొప్ప ప్రతిఫలం దక్కిందనుకుంటున్నారా?
‘పుష్ప’ విడుదల తేదీ ప్రకటించిన సమయంలో చాలా వర్క్ మిగిలిపోయి ఉంది. ఐదు భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలతోపాటు కొన్ని ముఖ్యమైన పనులు బ్యాలెన్స్‌గా ఉండిపోయాయి. కేవలం 25 రోజుల్లో వాటిని పూర్తి చేయాల్సి రావడంతో ఒత్తిడి ఎక్కువైనట్లు అనిపించింది. ఆగమేఘాల మీద పనులన్నీ చక్కబెట్టాం. ప్రేక్షకులు ఈ సినిమాకు అందించిన అపూర్వ విజయం మా టీమ్ అందరిలో నూతనోత్సాహాన్ని నింపింది.
ఇంతకీ ‘పుష్ప-2’లో ఏం చూపించబోతున్నారు?
రెండో భాగంలో పుష్పరాజ్ తాలూకు అంతఃసంఘర్షణకు ఓ భావోద్వేగభరితమైన ముగింపు ఉంటుంది. ఇంటిపేరు లేకపోవడం వల్ల పుష్పరాజ్ పడే వేదన తీరిపోయి అతని పాత్రకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. పుష్పరాజ్ ప్రస్థానం ఇంకా ఉన్నతమైన దశకు చేరుకుంటుంది.
ఈ సినిమాకు ఎర్రచందనం నేపథ్యాన్ని తీసుకోవడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలేమిటి?
బన్నీని ఓ శక్తివంతమైన మాస్ పాత్రలో చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘ఆర్య-2’ నుంచే ఆ ఆలోచన ఉంది. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లోనే బన్నీ.. నేను కలిసి చాలా ఐడియాస్ డిస్కస్ చేసుకునేవాళ్లం. ఎర్రచందనం అక్రమ రవాణా 70వ దశకం నుంచే జరుగుతున్నది. అయితే 90 దశకం తర్వాతే వాటి గురించి సామాన్య ప్రజలు తెలుసుకున్నారు. ముఖ్యంగా చిత్తూరు ఎన్కౌంటర్ ఘటన తర్వాత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ఈ కాన్సెప్ట్ మీద ముందస్తుగా ఏమైనా పరిశోధన చేశారా?
దాదాపు ఆరు నెలల పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పరిశోధన చేశా. తొలుత వెబ్‌సిరీస్‌గా తీద్దా మనుకున్నాం. కథ ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో సినిమాగా అయితే బాగుంటుందని అనిపించింది.
‘తగ్గేదేలే..’ డైలాగ్‌తోపాటు అందులో బన్నీ మేనరిజమ్ కూడా బాగా పాపులర్ అయింది. అసలు ఈ డైలాగ్ ఎలా పుట్టింది?
కమర్షియల్ ఫార్మాట్లో బలమైన పాత్రను తీర్చిదిద్దుతున్నప్పుడు ప్రేక్షకులకు గుర్తుండిపోయే మేనరిజమ్ ఉండాలనుకున్నాం. బాడీలాంగ్వేజ్‌తో కలిపి ఏదైనా విషయం చెబితే త్వరగా రిజిస్టర్ అవుతుంది. ‘నీ సినిమాలో పంచ్ డైలాగ్‌లు ఉండవు.. అందుకే నువ్వు తీసిన సినిమాలు వెంటనే గుర్తుకురావు. ఇందులో అలాంటి డైలాగ్ కోసం ప్రయత్నించు’ అని బన్నీ ఇచ్చిన సలహాతో ‘తగ్గేదేలా..’ అనే మేనరిజమ్ పెట్టాం.
తొలిరోజు వసూళ్లలో రికార్డని చెబుతున్నారు?
నైజాంలో తొలిరోజు రూ. 11.44 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇది సరికొత్త రికార్డ్ అని మా నిర్మాతలు చెప్పారు. హిందీలో ఎక్కువ పబ్లిసిటీ చేయకున్నా భారీ వసూళ్లు సాధిస్తున్నది. ‘హిందీలో ఎందుకు ప్రమోషన్ చేయలేద’ని రాజమౌళిగారు మందలించారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమా ఇది కాదని రాజమౌళిగారితో చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ‘ఏ సినిమా అయితే ఏంటి? నువ్వు పాన్ఇండియా సినిమా అనుకుంటే పాన్ ఇండియా అయిపోతుంది.. ప్రమోషన్ బాగా చేయండి’ అని రాజమౌళిగారు సలహా ఇచ్చారు. బన్నీకి వున్న మార్కెట్ వల్ల హిందీలో తొలిరోజు రూ.4 కోట్ల వసూళ్లు వచ్చాయి.
‘పుష్ప-2’లో కొత్త పాత్రల్ని ఏమైనా సృష్టిస్తున్నారా?
ప్రస్తుతానికైతే తొలిభాగంలో ఉన్న పాత్రలే కొనసాగుతాయి. ఏమైనా మార్పులతో కొత్త పాత్రలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ‘పుష్ప-2’ చిత్రీకరణ ఫిబ్రవరిలో ఆరంభిస్తాం. వచ్చే ఏడాది అక్టోబర్‌లో గానీ, డిసెంబర్లో ఇదే తేదీకి విడుదల చేయాలనుకుంటున్నాం. రెండో భాగానికి సంబంధించి రెండు సీన్స్ మాత్రమే తీశాం.
‘రంగస్థలం’ సినిమా ప్రభావంతోనే ‘పుష్ప’ చిత్రానికి శ్రీకారం చుట్టారనుకోవచ్చా?
నాది పూర్తి పల్లెటూరి నేపథ్యం. 30 ఏండ్లపాటు ఊరిలోనే ఉన్నా. మట్టి పిసకడం, గేదెల్ని కడగడం, పేడ తీయడం, కావడితో నీళ్లు తీసుకురావడం వంటి పనులన్నీ తెలుసు. గ్రామం తాలూకు మట్టివాసనలు నాలో ఎప్పటికీ పోవు. అందుకే ‘పుష్ప’ కథను నేను అనుకున్న విధంగా తెరకెక్కించగలిగా.
‘పుష్ప’ ప్రయాణంలో వ్యక్తిగతంగా ఏమైనా మార్పు వచ్చిందా?
ప్రతి సినిమా పూర్తయిన వెంటనే శ్మశాన వైరాగ్యం అలుముకుంటుంది. ‘ఇదే చివరిది.. ఇక సినిమాలు చేయొద్దు’ అనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా నేను అదే స్థితిలో ఉన్నా. ఎందుకంటే ఓ సినిమాతో ఎమోషనల్ ట్రావెల్ చేయడం అంత సులభం కాదు. ఏడుపు సన్నివేశాలు చెప్పేటప్పుడు దర్శకుడిలో కూడా అదే ఉద్వేగం పండాలి. నాకు కూడా బాధ కలగాలి. అలా కాకుంటే సీన్ తీయలేను. ‘పుష్ప’ సినిమా కోసం ప్రతిరోజూ నాలుగుగంటల ప్రయాణం చేసేవాళ్లం. అడవిలో షూటింగ్ కాబట్టి చాలా ఇబ్బందులు ఉండేవి. పొద్దున్నే మూడింటికి లేచి షూటింగ్‌కు బయలుదేరడం.. తిరిగి ఎప్పుడో హోటల్‌కు చేరుకోవడం.. ఇలాంటి కష్టాల్ని తలుచుకుంటే మళ్లీ సినిమా చేయొద్దనిపిస్తుంది.
ఓ దర్శకుడిగా బాక్సాఫీస్ లెక్కలకు మీరు ఎంత వరకు ప్రాధాన్యమిస్తారు?
బాక్సాఫీస్ లెక్కల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటా. ఏదైనా పని చేయడానికి డబ్బు అవసరమైందంటే అది వ్యాపారం కిందే లెక్క. సినిమా కోసం డబ్బులు వెచ్చిస్తున్నారు కాబట్టి వ్యాపారం కిందకే వస్తుంది. బిజినెస్ అంటే లెక్కల గురించి తప్పకుండా పట్టించుకోవాలి. కెరీర్ తొలినాళ్లలో నాకూ ప్రపంచాన్ని ఉద్ధరించాలనే ఆశలుండేవి. ‘అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు?’ అంటూ మథనపడేవాడిని. ఆ సమయంలో మా గురువుగారొకరు సలహా ఇచ్చారు. ‘నీకు అంత ఆవేశం ఉంటే ఓ పేపర్ తీసుకొని కవిత రాసుకో. దానికి ఏం ఖర్చు ఉండదు. సినిమా తీయడం ఎందుకు? నీకు ప్రపంచాన్ని ఉద్ధరించాలనే సంకల్పం కలిగినప్పుడు ఓ కవిత రాసుకొని తృప్తి చెందు’ అని చెప్పారు. ఆయన మాటలతో నేను బాగా రియలైజ్ అయ్యాను.
మీరు లెక్కల మాస్టర్ అయిఉండి మనుషుల మధ్య భావోద్వేగాల కెమిస్ట్రీని బాగా ఆవిష్కరిస్తారనే పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తున్నది?
అంకెలకు హృదయం ఉండదా? మీరే చెప్పండి?. నాలుగు.. నాకన్నా మూడంకెలు పైనున్నాయని ఫీలవుతుంటుంది. నా దృష్టిలో ప్రతి అంకెకు ఓ హృదయం ఉంటుంది. సినిమాలకు కూడా అవే లెక్కలు వర్తిస్తాయి.
తొలుత సమంత ప్రత్యేక గీతం ఒప్పుకోలేదు. ‘అలాంటి పాటలు నాకు కరెక్ట్ కాదేమో!’ అని అనుమానం వ్యక్తం చేసింది. నేనే తనను కన్విన్స్ చేశాను. ప్రస్తుతం అగ్ర కథానాయికలు కూడా ప్రత్యేక గీతాలు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పా. ‘ప్రేక్షకులు ఓ సరికొత్త సమంతను చూస్తారు.. కెరీర్లో ఓ విభిన్నమైన ప్రయత్నంగా మిగిలిపోతుంద’ని చెప్పడంతో సమంత అంగీకరించింది.
✍ కళాధర్ రావు జూలపల్లి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
మిగిలిన రాష్ట్రాల్లో పుష్ప కలెక్షన్స్ ఎలా ఉన్నాయి.. బన్నీ హిట్ కొట్టాడా..?
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
నైజాంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పుష్ప.. ఏం రికార్డులు సామీ..!
Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Pushpa Not Released | అక్కడ రిలీజ్ కాని ‘పుష్ప ‘..కారణమిదే !