నటీనటులు: Allu Arjun, Rashmika Mandanna, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులు
కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
దర్శకత్వం: Sukumar
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు కాలదోషం ఉండదు. అందులో Allu Arjun – Sukumar ద్వయం కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘Arya’ ‘Arya-2’ చిత్రాలు తెలుగు సినీరంగంలో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ Pushpa చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు. కథాంశాల ఎంపికలో ఇంటిలిజెన్స్, వాటిని తెరపై తీసుకురావడంలో ఇంటెన్సిటీని కనబరిచే దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా కోసం ఎర్రచందనం అక్రమ రవాణా ఇతివృత్తాన్ని ఎంచుకోవడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
పాన్ ఇండియా మూవీగా లార్జ్స్కేల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్ భాగం కావడం…సునీల్ తొలిసారి ప్రతినాయకుడిగా కనిపించడం కూడా ప్రత్యేకతగా నిలిచింది. ‘పుష్ప’ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ దాదాపు రెండేళ్ల సమయాన్ని వెచ్చించారు. లాక్డౌన్ కష్టాలు చుట్టుముట్టినా చెక్కుచెదరని సంకల్పంతో సినిమాను అనుకున్న విధంగా తీర్చిదిద్దారు. దక్షిణాదితో పాటు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న ‘పుష్ప’ ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు అందుకుందో తెలుసుకుందాం..
పుష్ప అలియాస్ పుష్పరాజ్ (Allu Arjun) ఎర్రచందనం అక్రమ రవాణా కోసం పనిచేసే కూలి. సరుకును పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తరలించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఎర్రచందనం సిండికేట్‌లో భాగమైన కొండారెడ్డి ( Ajay Ghosh) బ్రదర్స్ వద్ద పుష్ప తొలుత కూలీగా చేరతాడు. అనతికాలంలోనే తనదైన శక్తియుక్తులతో కొండారెడ్డి సిండికేట్‌లో భాగస్వామిగా మారతాడు. ఈ క్రమంలో ఎర్రచందనం మాఫియా కార్యకలాపాలు ఏ స్థాయిలో విస్తరించాయో…అక్కడ జరిగే భారీ వ్యాపార లావాదేవీల్లోని మోసాలేమిటో తెలుసుకుంటాడు. రవాణా సిండికేట్‌ను నియంత్రించే మంగళం శ్రీను (Sunil) ను కూడా ధిక్కరించి సొంతగా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తాడు. తమ సిండికేట్లకే సవాలు విసిరే స్థాయికి పుష్ప ఎదగడం కొండారెడ్డి బ్రదర్స్, మంగళం శ్రీనుకు కంటగింపుగా మారుతుంది. ఈ నేపథ్యంలో వారితో పుష్ప వైరం ఎలా సాగింది? శ్రీవల్లి (రష్మిక మందన్న)తో అతని ప్రేమాయణం ఎటువంటి మలుపులు తిరిగింది? కొత్తగా వచ్చిన ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) పుష్పను అడ్డుకునేందుకు ఏం చేశాడు? అందుకు పుష్ప ప్రతీకారమేమిటి? అన్నదే మిగతా కథ..
కథల ఎంపికలో దర్శకుడు సుకుమార్ పంథా వేరుగా ఉంటుంది. కమర్షియల్ ఇతివృత్తాలకు కూడా తనదైన శైలి అభిరుచుల్ని మేళవించి సరికొత్తగా ప్రజెంట్ చేస్తుంటాడు. ఈ సినిమా కోసం ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోవడంలోనే ఆయన తొలి విజయం సాధించారు. ఓ సాధారణ కూలీ తనదైన శక్తియుక్తులతో ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనే పాయింట్‌ను కమర్షియల్ పంథాలో ఉద్వేగభరితంగా ఆవిష్కరించాడు. ఎవరికీ తలొగ్గని పుష్ప మనస్తత్వం..సరుకును చెక్‌పోస్ట్‌లు దాటించే క్రమంలో పుష్ప ప్రదర్శించే తెలివితేటలతో ఆరంభ సన్నివేశాలు ఆసక్తిని పంచాయి. ఆ తర్వాత మాఫియా సిండికేట్‌లోని కొండారెడ్డి బ్రదర్స్, మంగళం శ్రీను నేపథ్యాల్ని పరిచయం చేస్తూ కథ సాగుతుంది. వీరిద్దరితో కలిసి పుష్ప చేసే ప్రయాణం… సిండికేట్‌లో కుట్రలు కుతంత్రాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠగా అనిపిస్తాయి.
కథ ఇలా సాగుతుంటే మరోవైపు పుష్ప వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణను హృదయాన్ని తడిమేలా తెరపై తీసుకొచ్చారు. తండ్రి పేరు చెప్పుకోలేక పుష్ప మానసిక సంఘర్షణకు లోనుకావడం..సవతి తల్లి కొడుకుల ఛీత్కారాలతో పుష్ప మనోవేదన భావోద్వేగభరితంగా అనిపిస్తుంది. పుష్ప పాత్ర చిత్రణలోని ఈ రెండు కోణాల్ని దర్శకుడు సుకుమార్ ఎక్కడా పట్టు తప్పకుండా డీల్ చేశాడు. రెండొందల కోట్ల విలువైన సరుకు పోలీసులకు చిక్కకుండా పుష్ప వేసిన ఎత్తుగడ…వాగు ద్వారా ఎర్రచందనం దుంగల్ని తరలించిన వైనం ఆకట్టుకునేలా సాగింది. ప్రీ ఇంటర్వెల్లో ఈ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. ఇక ద్వితీయార్థంలో పుష్ప మాఫియా సిండికేట్‌ను శాసించే వ్యక్తిగా ఎదిగే వైనాన్ని చూపించారు.
సెకండాఫ్ మొత్తం సిండికేట్ మాఫియా ఎత్తుకుపై ఎత్తులు..మధ్యలో శ్రీవల్లితో పుష్ప ప్రేమాయణంతో సాగుతుంది. అయితే ప్రథమార్థంలో ఉన్న ఉద్వేగాలు, కథాగమనంలోని వేగం ద్వితీయార్థంలో కాస్త కొరవడినట్లుగా అనిపిస్తుంది. పుష్ప-శ్రీవల్లి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సున్నితమైన హాస్యంతో ఆకట్టుకున్నాయి. ైక్లెమాక్స్‌కు ముందు ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ ఎంట్రీతో కథలో ఊపు వస్తుంది. అయితే పుష్ప , భన్వర్‌సింగ్ షెకావత్ మధ్య హోరాహోరిగా పోరు నడుస్తుందని భావించగా..వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. ైక్లెమాక్స్ ఎపిసోడ్‌ను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదనే భావన కలుగుతుంది. అయితే పుష్ప-భన్వర్‌సింగ్ షెకావత్ మధ్య రెండో పార్ట్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తిని క్రియేట్ చేస్తూ కథను ఎండ్ చేయడం ఆసక్తిని పెంచేలా ఉంది.
ఈ సినిమా కథలో అనేక పాత్రలు ఉన్నప్పటికీ దర్శకుడు సుకుమార్ బన్నీ పాత్ర చిత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా బన్నీని వినూత్నంగా ప్రజెంట్ చేయాలనే సుకుమార్ తపన ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. బన్నీ పాత్రను తీర్చిదిద్దిన విధానం, కథాగమనంలో పుష్ప పరివర్తనను ఆశ్చర్యపోయేలా ఆవిష్కరించాడు సుకుమార్. ఇప్పటివరకు సుకుమార్ తీసిన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ బాగా దట్టించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. తన పంథాకు కాస్త భిన్నంగా సుకుమార్ ఈ సినిమా విషయంలో కమర్షియాలిటీకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఆయన కెరీర్లోనే ఈ పాత్ర ఉత్తమంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు బాగున్నాయి. చిత్తూరు ప్రాంతీయుడు మాట్లాడినట్లుగానే ఆయన యాస ప్రామాణికంగా అనిపించింది. శ్రీవల్లిగా రష్మిక మందన్న డీగ్లామర్ పాత్రలో మెప్పించింది. విలన్‌గా సునీల్ గెటప్, మేకప్‌లో భయానకం కనిపించినా.. విలనీ మాత్రం ఆశించిన మేరకు పండలేదనిపిస్తుంది. అయితే నటుడిగా ఆయన్ని కొత్త కోణంలో చూడొచ్చు.
దాక్షాయణిగా అనసూయ ఫర్వాలేదనిపించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పతాక ఘట్టాల్లో ఎంట్రీ ఇచ్చారు కాబట్టి..ఆయన పాత్రను ద్వితీయార్థంలోనే మొత్తంగా చూడొచ్చు. సమంత ఐటెంసాంగ్ బాగుంది. ఇక సుకుమార్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ అంటే పాటల పండగలా ఉంటుంది. ఈ సినిమాలోని పాటలన్నీ బాగున్నాయి. చూపే బంగారమాయెనే చక్కటి మెలోడీగా ఆకట్టుకుంది. ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ మాస్ బీట్తో మెప్పించింది. ఈ సినిమాలో కళా దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దర్శకుడు సుకుమార్ ఊహా ప్రపంచాన్ని ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ-మౌనిక తమ సెట్‌వర్క్ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. సాంకేతిక అంశాల్లో ప్రతిదీ ఉన్నతంగా అనిపిస్తుంది. కెమెరా అడవి అందాల్ని, సహజత్వాన్ని ఒడిసిపట్టింది. యాక్షన్ సన్నివేశాలు రొమాంచితంగా అనిపించాయి. చక్కటి ఎలివేషన్స్‌తో అభిమానుల్ని ఆకట్టుకునేలా సాగాయి. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణ విలువలు అత్యున్నత ప్రమాణాలతో కనిపిస్తాయి. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతుంది.
‘రంగస్థలం’ తర్వాత దర్శకుడు సుకుమార్ చేసిన మరో వినూత్నమైన ప్రయత్నం ‘పుష్ప’. ఇందులో సుకుమార్ మాస్ విశ్వరూపాన్ని చూడొచ్చు. ఈ సినిమా విషయంలో సుకుమార్ గురి తప్పలేదు. నిర్మాణం నుంచే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశముంది. లాంగ్‌రన్‌లో కూడా ‘పుష్ప’కు తిరుగులేదనిపిస్తుంది.