టానిక్ తాగడం ఇబ్బంది. మందులు మింగడం నరకం. కానీ, చల్లచల్లగా తీయతీయగా ఏదైనా పానీయం అందిస్తే మాత్రం .. క్షణాల్లో ఖాళీ చేసేస్తాం. కాబట్టే, సకల పోషకాలనూ రంగరించి స్మూతీలను తయారు చేస్తున్నారు వకుళ శర్మ. ‘పల్ప్ బ్రూ’ ఆమె కలల పంట. అమ్మతనపు అనుభవం, టెక్నాలజీ, సహజ జిజ్ఞాస.. ఈ మూడూ ఆమెను ఆంత్రప్రెన్యూర్‌గా మార్చాయి.
2017లో పండంటి ఆడ పిల్లకు జన్మ నిచ్చింది వకుళ. ఆ పచ్చి బాలింత మందూమాకులతో తన శరీరాన్ని ట్యాబ్లెట్ల కుప్పగా మార్చుకోవడానికి ఇష్టపడలేదు. పోషకాల కోసం ప్రత్యామ్నాయం ఆలోచించింది. సహజసిద్ధమైన పోషణకు పెండ్లికి ముందు తాగిన స్మూతీలే గుర్తుకొచ్చాయి. అప్పట్లో ఇంట్లోనే ఆకుకూరలు, కాయగూరలతో రోజుకో స్మూతీ చేసుకుని తాగేది. మాతృత్వం తర్వాత కూడా.. తన శరీరానికి ఎలాంటి పోషణ అవసరమో, అవన్నీ ఏ పండ్లలో దొరుకుతాయో తెలుసుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మొదలుపెట్టింది వకుళ. అనూహ్యంగా ఆరు నెలల్లో బరువు తగ్గింది. కీళ్ల నొప్పులు మాయం అయ్యాయి. చర్మం ప్రకాశవంతమైంది. ముఖం కాంతివంతంగా మారింది. జుట్టు నిగనిగ లాడింది. ఆ మార్పును చూసి బంధుమిత్రులు ఆశ్చర్య పోయారు. పాపను చూడ్డానికి వచ్చేవారికంతా తనే స్మూతీలు చేసిచ్చేది. ఆ రుచులు తెగ నచ్చడంతో.. పార్టీలకు, ఫంక్షన్లకు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు.
పడకగదినే.. ప్రయోగశాలగా
వ్యాపార ఆలోచన అమలు చేసేందుకు పాప పడకగదినే ప్రయోగశాలగా మలుచుకుంది వకుళ. కూరగాయలు, పండ్లు, ఎండు ఫలాలు ముందేసుకుని.. మరింత రుచి కోసం, ఇంకొంత నాణ్యత కోసం రకరకాల ప్రయోగాలు చేసింది. పోషక విలువల పట్ల అవగాహన పెంచుకోవడానికి ‘డిప్లొమా ఇన్ న్యూట్రిషన్’ చదివింది. వ్యాపార అనుమతులు సంపాదించడానికి చంటి బిడ్డను వెంటేసుకొని తిరగాల్సి వచ్చేది. అయినా వెనకడుగు వేయకుండా ‘పల్ప్ బ్రూ’ స్టార్టప్‌కు ప్రాణం పోసింది. మొదట్లో చాలా ఫ్లేవర్స్ ప్రవేశపెట్టింది. ప్రచారం కోసం పెద్ద పెద్ద అడ్వర్టయిజింగ్ కంపెనీలకు డబ్బులు సమర్పించుకుంది. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని బ్రాండింగ్ బాధ్యతలూ భుజాన వేసుకుంది. అపజయాలు పలకరించినా కలత చెందలేదు.
‘జ్యూస్‌లు చేసుకుంటున్నాం కదా. మళ్లీ నువ్వు చేసేది ఏముంది?’, ‘ఇప్పటికే స్మూతీలు బాటిల్స్‌లో
అమ్ముతున్నారు? నీదే ఎందుకు కొనాలి?’ .. ఇలా అనేక ప్రశ్నలు. మరొకరైతే ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. వకుళ శర్మ మాత్రం ప్రతి ప్రశ్ననూ ఓ సవాలుగా తీసుకున్నది.
తొలిసారిగా..
దేశంలోనే మొదటిసారిగా బ్లాస్ట్ ఫ్రీజింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది వకుళ. తాజాగా సేకరించిన పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ శుభ్రం చేసి.. ఫ్రెష్‌గా కట్ చేసి, ప్యాకింగ్ చేసి, ఫ్రీజర్‌లో పెడుతుంది. ఆర్డర్‌ను బట్టి డెలివరీ చేస్తుంది. ఇంట్లో ప్యాక్ ఓపెన్ చేసి, మిక్సీ పట్టి తాగేయడమే. దీనివల్ల తాజాదనం ఉంటుంది. పండ్లు, కూరగాయల్లోని పోషకాలు ఒంటికి అందుతాయి. ముందుగానే గ్రైండ్ చేసి, ప్యాక్ చేసి, ఫ్రీజర్‌లో పెట్టడం వల్ల సహజసిద్ధంగా లభించే పోషకాలు ఆవిరైపోతాయి. సీజన్‌ను బట్టి కొత్త స్మూతీలు తయారుచేస్తుంది వకుళ. డీటాక్స్, ప్రొటీన్, స్కిన్ అండ్ ఎయిర్, వెయిట్‌లాస్.. ఇలా పాతిక కేటగిరీలు లభిస్తాయి. ‘మనిషికి ఆరోగ్యం తర్వాతే.. ఎన్ని సంపదలైనా. కాబట్టే, ఈ వ్యాపారంలోకి వచ్చా’ అంటుంది వకుళ.
ఫండింగ్‌కు వీహబ్ హామీ
నేనొక స్పోర్ట్స్ పర్సన్‌ని. బీటెక్ తర్వాత ఐటీ జాబ్ చేశాను. ఆర్కి టెక్చర్లోనూ ప్రావీణ్యం ఉండటంతో మా వారితో కలిసి పని చేశాను. ‘పల్ప్ బ్రూ’తో సొంతంగా వ్యాపారం ప్రారంభించాను. ప్రస్తుతం ఈ కామర్స్ సైట్స్‌తో పాటు మా సొంత వెబ్సైట్ ద్వారా అమ్ముతున్నాం. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ స్మూతీలు విక్ర యిస్తున్నాం. తాజ్ హోటల్స్‌కు సంబంధించిన కేఫ్‌లలో ‘పల్ప్ బ్రూ’ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. నా స్నేహితురాలి ద్వారా వీహబ్‌ను సంప్రదించాను. చాలా మద్దతు ఇచ్చారు. కొత్త వ్యాపార ప్రణాళికలు చెప్పారు. నన్ను సరికొత్త మార్గంలో నడుపుతున్నది వీహబ్. ఫండింగ్‌కు కూడా ఎంపికయ్యాను.
– వకుళ శర్మ, సీయీవో
pulpbrew.com