e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిందగీ బావితరాల కోసం..

బావితరాల కోసం..

ఆ మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో దారుణమైన నీటి కరువు వచ్చింది. జనం బిందెడు నీళ్ల కోసం చంపుకొనే దుస్థితి ఏర్పడింది. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపింది సర్కారు. ఏకే47 గన్స్‌తో ఆర్మీ పహరా నడుమ ఒక మనిషి రోజుకు సగటున 20 లీటర్ల నీటిని మాత్రమే పట్టుకొనేలా చట్టం చేశారు. ముందుచూపు లేని మందబుద్ధే దీనికంతా కారణం. మన భావితరాలకు ఆ దౌర్భాగ్యం రాకూడదన్నదే హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ కల్పనా రమేశ్‌ ఉద్దేశం.

గచ్చిబౌలిలోని దిలావర్‌ షా బేగం మజీద్‌ పక్కన.. అసఫ్‌జాహీ పాలకులు తవ్వించిన 200 ఏండ్లనాటి బావి ఒకటి హఠాత్తుగా మాయమైంది. మళ్లీ ఏడాది క్రితం నుంచీ కనిపిస్తున్నది. చుట్టూ పదిహేను వందల అడుగుల లోతువరకూ బోర్లు వేయడంతో నీరు అడుగంటి పోయింది. దీంతో ఈ బావిని డంప్‌ యార్డ్‌లా వాడుకొన్నారు స్థానికులు. చెత్తా చెదారంతో నింపేశారు. ఆ చారిత్రక బావి ప్రాధాన్యాన్ని గుర్తించారు కల్పన. స్థానికులతో మాట్లాడి చెత్తంతా తీయించారు. బావికి పూర్వ వైభవం తెచ్చారు. అక్కడితో ఆగిపోలేదామె. నిపుణులను పిలిపించి, గతంలో ఉన్నట్టుగానే పాత్‌ వే నిర్మించారు.

- Advertisement -

రెండేండ్ల క్రితం వరకూ కొండాపూర్‌లోని మజీద్‌బండ వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. అక్కడ మురికి కూపాన్ని తలపించే కోడికుంట చెరువుండేది. ఆ దుర్గంధం కారణంగా చుట్టుపక్కలకు ఎవరూ వచ్చేవారు కాదు. అదే చెరువు ఇప్పుడు, పక్షుల కిలకిల రావాలతో అందమైన పూల మొక్కలతో కళకళలాడుతున్నది.

..ఏదో అద్భుతం జరిగి, ఈ జలాశయాలు ఇంత అందంగా మారిపోలేదు. ఈ సౌందర్యీకరణ వెనుక కల్పనా రమేశ్‌ రెండున్నరేండ్ల కష్టం ఉంది. ‘చెరువును పరిరక్షించుకొందాం’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. చుట్టుపక్కల ప్రజలను ఓపికగా ఒప్పించారు.

భూగర్భ జలాలు పెరిగేలా..
కల్పన వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌. లక్షల జీతం వదులుకొని భవిష్యత్‌ తరాలకోసం జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తరిగిపోతున్న జలసంపదను పది కాలాలపాటు నిలువ చేసేందుకు సాహె (సొసైటీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎండీవర్‌) – రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ ఛత్రం కింద పదేండ్లనుంచి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

‘బ్లూ హైదరాబాద్‌’ పేరుతో క్యాంపెయిన్లు చేపడుతున్నారు. ఇండ్లు, కార్యాలయాలకు వాననీటి సంరక్షణ గుంతలను డిజైన్‌ చేసి ఇస్తున్నారు. వాననీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కాలనీలు, ఇళ్లు సందర్శించి ప్రజల్లోనూ విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

బావులకు బతుకునిస్తూ..
గత అక్టోబర్‌లో వచ్చిన వర్షాలకు మూడుసార్లు గచ్చిబౌలి బావి నిండుకుండను తలపించింది. దీంతో భూగర్భజలాలు వృద్ధి చెందాయి. పక్కనే ఉన్న పిల్లబావి పూర్తిగా పాడైపోవడంతో ఆ స్థానంలో థియేటర్‌ ఏర్పాటు చేశారు. బావి చుట్టూ సొంత నిధులతో రక్షణ కంచె నిర్మించారు కల్పనా రమేశ్‌. కోకాపేట గోశాలవద్ద ఉన్న బావికి సెట్రీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో పూర్వ వైభవం తెచ్చారు. ప్రస్తుతం, ఆ బావి ఇరవై అడుగుల లోతుతో, స్వచ్ఛంగా కళకళలాడుతున్నది. రీచార్జ్‌ కోసం చుట్టూ కందకం తవ్వించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వట్టివేరు మొక్కలను తెప్పించి చుట్టుపక్కల నాటించారు. నార్సింగిలోని మరో మూడు బావులకు, కొండాపూర్‌లోని ఇంకో పురాతన బావికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. దీంతోపాటుగా పాడైన బోర్లూ బాగు చేయిస్తున్నారు.

98 బ్లాక్స్‌గా..
తనకున్న అవగాహన మేరకు హైదరాబాద్‌ మహానగరాన్ని 98 బ్లాక్స్‌గా విభజించారు కల్పనా రమేశ్‌. ఒక్కో బ్లాక్‌ పరిధిలోని చెరువులు, బావులు, బోర్లకు జీవకళ తెచ్చేందుకు ప్రజలను భాగస్వాములను చేయాలన్నది ఆమె ఆలోచన. ఆయా బ్లాకుల్లోని ప్రజలంతా ప్రతి ఇంటికీ ఎన్నో కొన్ని ఇంకుడు గుంతలను నిర్మించాలని సూచిస్తున్నారు కల్పన. వాటివల్ల వాననీటిని తిరిగి వినియోగించుకోవచ్చు. భూగర్భ జలాల నిల్వలను సమతూకం చేయవచ్చు కూడా. కల్పన జల సంరక్షణ ఉద్యమం ఆమె ఇంటినుంచే మొదలైంది. గచ్చిబౌలి రోలింగ్‌ హిల్స్‌లోని కల్పన నివాసంలో పదకొండు ఏండ్లుగా మోటర్‌ సాయంతో బోరునీటిని తోడిన సందర్భం ఒక్కటికూడా లేదు. వర్షపునీటిని ఒడిసిపట్టి, వడపోసి తాగునీటికి, మిద్దెపంటకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ‘మనం నీళ్లను రక్షిస్తేనే నీళ్లు మనల్ని రక్షిస్తాయి. రేపటి తరాల కోసం మనం పోగేయాల్సింది ఆస్తులు కాదు, నీళ్లు’ అంటారామె.

ప్రధాని అభినందనలు

కల్పనా రమేశ్‌ను ఎన్నో అవార్డులు వరించాయి. కేంద్ర జలశక్తి డైరెక్టర్లు సైతం కల్పన సలహాలు, సూచనలు తీసుకొంటారు. వాననీటి సంరక్షణకోసం కల్పన చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాని సోషల్‌ మీడియా అకౌంట్ల నిర్వహణకు అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారామె. ‘నేను పుట్టింది బెంగళూరులో. నా భర్త రమేశ్‌ లోకనాథన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశాను. 20 ఏండ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడిదే నా సొంత సిటీ. ప్రతి వర్షపు చినుకును ఒడిసిపట్టి, భూమిలో దాచిపెట్టి, భావితరాలకు అందించడమే నా లక్ష్యం. ఈ జలయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అని పిలుపునిస్తున్నారు కల్పనా రమేశ్‌.

… డప్పు రవి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana