ప్లాస్టిక్ పోవాలి. పర్యావరణం బాగుండాలని నినాదాలు చేశాం. శ్రమదానాలు చేశాం. వ్యాసరచన పోటీలు పెట్టాం. అయినా పోలేదు. ప్రజల అవసరాలను, పరిస్థితులను సరిగా అర్థం చేసుకుని పనిచేస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం కష్టమేం కాదంటున్నారు ముంబైకర్లు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారానే ఈ కాలుష్యాన్ని అరికట్టగలమని వాళ్లు నిరూపిస్తున్నారు. ఈ మేరకు ప్రాజెక్ట్ ముంబయి అనే సంస్థ ముందుకొచ్చింది. కొన్ని కార్పొరేట్ సంస్థలతో కలిసి ముంబయి ప్లాస్టిక్ రీసైకిల్ థాన్ అనేక కార్యక్రమం చేపట్టింది. ‘పనికిరాని ప్లాస్టిక్‌ని పడేయకుండా మాకివ్వండి. ఆ ప్లాస్టిక్‌ని మీకు ఉపయోగపడేట్టుగా మార్చేస్తాం’ అంటూ ప్రచారం చేసింది. ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు బల్లలు (గార్డెన్ బెంచ్) తయారు చేశారు సంస్థ నిర్వాహకులు.
వీటిని దారికి ఇరువైపులా, ఉద్యానవనాల్లో ప్రజల వినియోగార్థం ఉంచుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన టైల్స్‌తో పార్కుల్లో, పాఠశాలల్లో నడకదారి నిర్మిస్తున్నారు. ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి, పార్కింగ్ ఏరియాల్లో కూడా ఈ టైల్స్‌ని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు పెన్నులు దాచుకునే బాక్సులు, పెన్ స్టాండ్లు, డస్ట్బిన్లు.. ఇలా ఎన్నో రకాల వస్తువులు తయారు చేసి ఇస్తున్నారు. ‘ప్లాస్టిక్ వాడొద్దంటే ప్రజలు మానరు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు పేదలు, మధ్యతరగతి వాళ్లు అందుకోలేనంత ధర. అందుకే పాస్టిక్ని మట్టిలో చేరనివ్వకుండా ఈ ప్రయత్నం కొనసాగిస్తున్నామ’ని చెబుతున్నారు ప్రాజెక్ట్ ముంబయి నిర్వాహకులు.