భారతీయ నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం వల్ల గుండెజబ్బులున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వస్తున్నది. వాయుకాలుష్యం ఇతరులకంటే గుండె జబ్బులున్నవారికి మరింత ప్రాణాంతకమని అమెరికా పరిశోధకులు గుర్తించారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థలతో కలిసి ఇంటర్మౌంటెన్ హెల్త్ సంస్థకు చెందిన పరిశోధకులు వాయు కాలుష్యం వల్ల ఆరోగ్య దుష్ప్రభావాలపై అధ్యయనం నిర్వహించారు. క్యూబిక్ మీటర్ గాలిలో 7 నుంచి 20 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలు ఉన్న ఢిల్లీ మరికొన్ని నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు.
గాలి కాలుష్యం 2.5 పీఎం స్థాయిలో ఉన్న ప్రాంతాల్లోని సాధారణ ప్రజలు, గుండె జబ్బుతో బాధపడే వారి నుంచి రక్త నమూనాలను సేకరించి అధ్యయనం చేశారు. వాయు కాలుష్యం వల్ల గుండె జబ్బు బాధితుల రక్త నమూనాల్లో అనేక అనారోగ్యకారకమైన మార్పులు గుర్తించారు. గుండె జబ్బులు ఉన్నవాళ్ల రక్త నమూనాల్లో ఇన్ఫ్లమేటరీ బయోమేకర్స్ (CCL27, IL-18) చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది. గుండె జబ్బులు లేనివాళ్లలో ఏ మార్పూ కనిపించలేదు. హృద్రోగులు వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం చెబుతున్నది. ఎంత జాగ్రత్తగా ఉంటే గుండెకు అంత మంచిది.