మనం ఉండే ఈ భూమి మనదే. మన ఇల్లు ఇక్కడే ఉంటుంది. మన స్కూలు ఇక్కడే ఉంటుంది. మనం ఆడుకునే చోటూ ఇక్కడే ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్లంతా ఈ నేల మీదే నివసిస్తారు. మనం పుట్టిందీ, గిట్టాక కలిసిపోయేదీ ఈ మట్టిలోనే. ఇంతటి అనుబంధం, బతుకు అవసరం ఉన్న ఈ మట్టి మనకెంతో అపురూపం కదా!! కానీ దాన్ని ఎంతవరకూ కాపాడుకుంటున్నాం. అది బాగుండేందుకు మనవంతు ఏం సాయం చేస్తున్నాం… అని ఆలోచించుకుంటే చాలా మంది ఏమీలేదనే చెబుతారు. చదువుకుంటు న్నామనో,ఉద్యోగాల్లో బిజీగా ఉన్నామనో అంటారు. కానీ, ఈ నేలను కాపాడటానికి 88 ఏండ్ల ముదిమి వయసులోనూ అలుపులేని పోరాటం చేస్తున్నారు అల్మిత్రా పటేల్. నగరాలు, పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ బిల్లు రూపకల్పనలో ఆమెది కీలకపాత్ర.
మట్టి బాగుంటే మనం బాగుంటాం. నేల మీద వ్యర్థాలు పేరుకుపోయి ఎందుకూ పనికిరాకుండా పోతే దాని మీద మనిషి మనుగడే లేకుండా పోతుంది. అందుకే తన వంతుగా దేశంలో పేరుకుపోతున్న ఘన వ్యర్థాల నిర్వహణకు తోడ్పడుతున్నారు మహారాష్ట్రకు చెందిన అల్మిత్రా పటేల్. పర్యావరణవేత్తగా ఆమె ఎందరికో సుపరిచితురాలు. పౌర హక్కులు, పర్యావరణ సమస్యలమీద ఆమె 1970 సంవత్సరం నుంచీ పోరాడుతున్నారు. ఆసియా సింహాల పరిరక్షణకు, చెట్ల సంరక్షణకు, ఉల్సూర్ సరస్సును కాపాడటానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా గృహాలు నిర్మించడానికి సంబంధించి ఎన్నో సూచనలు చేసి, ఆ అంశం మీద ఏండ్ల నుంచీ పనిచేస్తున్నారు. మున్సిపాలిటీల్లో రోడ్ల వెంట, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం మీద ఆమె 1996లో సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి గొప్ప స్పందన లభించింది.
అల్‌మిత్ర తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి పౌరహక్కుల కార్యకర్తగా పనిచేశారు. సమాజం, పర్యావరణాల పట్ల ప్రేమ ఆమెకు తల్లిదండ్రుల నుంచే వచ్చింది. అందుకే చిన్నతనం నుంచీ వాటికి సంబంధించిన సమస్యల మీద అవగాహన ఎక్కువగానే ఉండేది. ఆ రోజుల్లో తొలిసారి సైన్స్ పాఠాలు చదివిన ఆడపిల్ల ఆమే. 1959లోనే అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని, అక్కడ చదువు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు పైగా ఉద్యోగ జీవితంలో ఉన్నారు. బెంగళూరులో స్థిరపడ్డారు. దాదాపు పాతికేండ్ల క్రితం సంగతి. అప్పట్లో నగర శివారులోని ఖాళీ స్థలంలో టన్నుల కొద్దీ చెత్తను తెచ్చి పోయడం ప్రారంభించారు మున్సిపాలిటీ వాళ్లు. దీంతో కుక్కలు ఆ ప్రాంతంలో గుంపులుగా చేరాయి. అటు నుంచి వచ్చేపోయే వాళ్లను కరవడం, పశువుల్ని చంపడంలాంటివి చేయడం మొదలుపెట్టాయి. దాని పరిష్కారానికి మార్గాలు సూచించే పనిలో పడ్డారు అల్‌మిత్ర. మరో పక్క అదే సమయంలో చెన్నైకి చెందిన కెప్టెన్ ఎస్. వెల్లు నగరాల పరిశుభ్రత మీద పనిచేయడం మొదలు పెట్టారు.
1994 సెప్టెంబరులో సూరత్ నగరంలో ప్లేగు ప్రబలింది. కాలువల్లో చేరిన చెత్త వాటిని పొంగేలా చేయడమే కాదు, ఎలుకల బొరియల్లోకీ చేరి వాటిని బయటకు రప్పించింది. ఈ గందరగోళానికి చెత్త నిర్వహణ సరిగ్గా లేకపోవడమే కారణమని తేల్చారు నిపుణులు. ఈ పరిణామంతో, అదే ఏడాది కెప్టెన్ వెల్లుతో కలిసి క్లీన్ ఇండియా- 30 రోజులు 30 నగరాలు క్యాంపెయిన్‌లో ప్రధాన పాత్ర పోషిస్తూ పాల్గొన్నారు. అప్పుడు అన్ని నగరాల్లోనూ బెంగళూరులాంటి పరిస్థితే కనిపించింది అల్మిత్రకు. దీంతో ఆచరణ సాధ్యమైన పరిష్కార మార్గాల అన్వేషణలో పడ్డారు. ఇదిలాగే కొనసాగితే ప్రజారోగ్యం చెత్తకుప్పల పాలవుతుందని ఆందోళన పడసాగారు. ఆ ఆవేదనతోనే… 1996లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్)ను దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం సీరియస్‌గా తీసుకోవడమే కాదు, దానికి సంబంధించి కమిటీనీ నియమించింది. ఆ కమిటీలో అల్‌మిత్ర సభ్యురాలిగా చేరారు. దీని ఫలితంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం-2000 రూపొందింది. మరింత వివరంగా, పకడ్బందీగా 2016లో మరో చట్టాన్నీ తీసుకువచ్చారు. ఈ రెండిటి రూపకల్పనలో కీలకపాత్ర పోషించారామె.
ఇల్లు మొదలు పల్లె వరకూ, పట్టణాలూ నగరాల్లో నేడు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రక్రియలో అల్‌మిత్ర భాగస్వామ్యం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే క్లీన్ ఇండియా గురించి ఆలోచించి, అందుకోసం పనిచేసిన ఆమె నేడు స్వచ్ఛ భారత్ మిషన్ కోసం నిపుణురాలిగా సలహాలు అందిస్తున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సుప్రీం కోర్టు ఏర్పరచిన కమిటీకి పనిచేసి ఎన్నో విలువైన సూచనలు చేశారు. పొరుగుదేశం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 2005లో ఏర్పాటు చేసిన తొలి కంపోస్ట్ ప్లాంట్‌కు సంబంధించి గౌరవ సలహాదారుగానూ పనిచేశారు. చెత్త నిర్వహణకు సంబంధించి లెక్కకుమిక్కిలి అంతర్జాతీయ స్థాయి సెమినార్లలో పాల్గొన్నారు. ‘అల్మిత్రా పటేల్- వేస్ట్ వారియర్’ పేరిట ఆమె జీవితం మీద శాస్త్రవేత్త, పద్మశ్రీ శరత్ పాండురంగ కాలే పుస్తకాన్ని రాశారు. అందులో పర్యావరణంతో ఆమెకున్న అనుబంధం, ఆమె తల్లిదండ్రులు, ఆలోచనా విధానాలు, పోరాటాల్లాంటి అన్ని అంశాలను సంక్షిప్తం చేశారు. ఏమో అదే రేపు మరో పర్యావరణ వేత్త పుట్టుకకు విత్తనం కావచ్చేమో! ఎవరికి తెలుసు!!