ఏడు పదుల వయసు దాటాక కృష్ణారామా అనుకోవడం మనవాళ్ల సంప్రదాయం. ఎనభై దాటాక.. తారక మంత్రం పఠించడమూ భారంగా అనిపిస్తుంది. ఈ పెద్దావిడ మాత్రం తొంభైమూడేండ్ల వయసులోనూ తన అభిరుచిని ఆస్వాదిస్తున్నారు. చిరు ప్రాయంలో మొదలైన పఠనాభిలాషను నేటికీ (85 ఏండ్లుగా) కొనసాగిస్తూ… అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల కాళోజీ పురస్కారం అందుకున్న రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మాతృమూర్తి నెల్లుట్ల శకుంతలాదేవి పరిచయం ఇది.
ఇల్లాలు విద్యావంతురాలు అయితే.. ఇంటిల్లిపాదీ విద్యాధికులు అవుతారు. ఆ మాటకు నిదర్శనమే శకుంతలా దేవి. ఆమె పుట్టిన పది రోజులకే తల్లిని కోల్పోయారు. దీంతో పాలకుర్తి మండలం బమ్మెరలోని మేనమామ ఇంట పెరిగారు. పోతన వంశస్తురాలైన శకుంతలా దేవి ఏకసంథాగ్రాహి. ఆ కాలంలో ఆడపిల్లను బయటికి పంపించకపోవడంతో బడి ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. కానీ, ఇంటి దగ్గరే తెలుగు, ఉర్దూ భాషల్లో చదువు చెప్పించారు. ఎనిమిదేండ్ల వయసు నుంచే కథలు, పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన శకుంతలాదేవి తర్వాతి కాలంలో ఇతిహాసాలు, ప్రముఖ రచయితల సాహిత్యం చదువుతూ తన జిజ్ఞాసను కొనసాగించారు. తన కూతుళ్లను కూడా బాగా చదవమని ప్రోత్సహించేవారు. అకడమిక్ పుస్తకాలు మాత్రమే కాదు… పిల్లల వయసుకు తగ్గట్టుగా.. ఫలానా పుస్తకం చదవమంటూ ఇచ్చేవారు. అలా కూతుళ్లనూ విద్యావంతులుగా తీర్చిదిద్దారు.
వయసు మీద పడటంతో శకుంతలాదేవికి కంటి చూపు కొద్దిగా మందగించింది. చిన్న అక్షరాలు చదవడం కష్టంగా మారడంతో కూతుళ్లతో తాను చదవాలనుకున్న వాటిని పెద్దగా రాయించుకొని చదువుతూ ఉంటారు. చిన్న అక్షరాలు ఉన్నా.. ఇప్పటికీ రోజూ దినపత్రిక చదవడం ఆమె దినచర్యలో భాగం. గోవింద నామాలు, విష్ణు సహస్ర నామాలు, ముకుంద నామాలు, కృష్ణ శతకం, సుమతి శతకం నోటికి పాడుతూ.. కాలక్షేపం చేస్తుంటారు.
– చిలగాని విజయ్‌కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్
అమ్మ శకుంతలాదేవి, నాన్న రాంచందర్ రావు ఇద్దరికీ పుస్తక పఠనం అంటే ఆసక్తి. అమ్మ కారణంగానే మాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. మా వయసు పెరిగే కొద్దీ… అవసరమైన పుస్తకాలు స్వయంగా కొనిచ్చేది. నేను 1992 నుంచి కరోనా సమయం వరకు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా పని చేశాను. మా చెల్లి రమాదేవి కార్టునిస్టుగా, రచయిత్రిగా అందరికీ సుపరిచితమే. ఇటీవలే ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారం అందుకుంది.
మేం ఈ స్థాయికి రావడానికి మా అమ్మ అందించిన ప్రోత్సాహమే కారణం. ఇప్పటికీ ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటుంది. ప్రతి రోజూ అమ్మ చదివిన తర్వాతే పేపర్ మా చేతికి వస్తుంది. సప్తగిరి మాస పత్రిక, బాలల భారత దేశం, నవలలు చదువుతుంది. కొన్ని ముఖ్యమైన వాటిని మేం పేపర్‌పై రాసి ఇస్తే చదువుకుంటుంది. తల్లులకు పుస్తక పఠనంపై ఆసక్తి ఉంటే.. పిల్లలకు కూడా అది అలవడుతుంది. అది మాకు అమ్మ వల్ల లభించిన అదృష్టంగా భావిస్తున్నాం.
– సంధ్య
(శకుంతలదేవి పెద్ద కూతురు)