పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి. బతుకమ్మ ఆడి ఆడి అలసిన పిల్లలకు అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు. ప్రసాదం అంటే పది మందితో కలిసి పంచుకునేది. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడిన జగన్మాత ఆకలితో అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానిన బియ్యంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి.. మెత్తని పిండిగా చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లాగా చిన్న ఉండలుగా చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారు. ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకే నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడతారు.