తేలికపాటి ఒత్తిడి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ స్టెరాయిడ్ హార్మోన్.. రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తూ.. వైరస్లపై పోరాడటాన్ని ప్రేరేపిస్తుంది.
‘మరక మంచిదే!’ అని అదేదో యాడ్లో చెప్పినట్టు.. ‘ఒత్తిడి’ కూడా అప్పుడప్పుడూ మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మరీ తీవ్రంగా కాకుండా.. తక్కువ స్థాయిలో ఉండే ఒత్తిడితో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
తక్కువ స్థాయిలో ఉండే ఒత్తిడి.. మీ రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడుతుందట. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. చివరికి మిమ్మల్ని తెలివైన, ఆరోగ్యకరమైన వ్యక్తిగా నిలుపుతుంది.
కొన్ని సందర్భాల్లో ఆనందంగా ఉన్నప్పటికీ కొంచెం ఒత్తిడికి గురవుతుంటారు. బాగా కావాల్సిన వారిని చాలారోజుల తర్వాత కలుసుకోబోతున్నప్పుడు, ప్రమోషన్ సందర్భంగా బాధ్యతలు పెరిగినప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల పల్స్ వేగం పెరుగుతుంది. పాజిటివ్ హార్మోన్ల ఉత్పత్తి కూడా అధికమవుతుందట. ఇక వ్యాయామం చేసేటప్పుడు కలిగే యూస్ట్రెస్ కూడా ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.
చిన్న మొత్తంలో ఒత్తిడికి గురికావడం వల్ల న్యూరోట్రోఫిన్ల ఉత్పత్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. మెదడు న్యూరాన్ల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంతోపాటు స్వల్పకాలికంగా ఏకాగ్రతనూ పెంచుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒక నిర్దిష్ట స్థాయి ఆందోళన, ఒత్తిడి.. విద్యార్థులు పరీక్ష కోసం మరింత ప్రభావవంతంగా సిద్ధం కావడానికి ప్రేరేపిస్తుందని అంటున్నారు.