మెనోపాజ్.. మహిళల జీవితాల్లో జరిగే ఒక సహజమైన జీవ ప్రక్రియ! అయినప్పటికీ.. ఇప్పటికీ 66 శాతం మంది భారతీయ మహిళలు.. మెనోపాజ్ గురించి చర్చించడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో చర్చించేందుకూ మొహమాట పడుతున్నారు. ఫలితంగా.. అనేక శారీరక, భావోద్వేగ, మానసికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ సంస్థ అబాట్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మెనోపాజ్ విషయంలో సరైన కమ్యూనికేషన్ లేకపోతే.. వారికి అవసరమైన సంరక్షణ, చికిత్స పొందలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరిమెనోపాజ్, మెనోపాజ్ వరకు దారితీసే దశ.. సాధారణంగా నాలుగేండ్లపాటు ఉంటుంది. ఈ కాలంలో మహిళల్లో ముఖ్యమైన హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ స్థాయులలో క్షీణత కనిపిస్తుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్.. మహిళల్లో అనేక ప్రభావాలను కలిగిస్తుంది. రుతు చక్రాన్ని నియంత్రించడంలో, రొమ్ము కణజాలం పెరుగుదలను ప్రోత్సహించడంలో, ఎముకల సాంద్రతను నియంత్రించడంలో సాయపడుతుంది. అలాంటి అతిముఖ్యమైన హార్మోన్ ఉత్పత్తిలో క్షీణత మొదలవ్వడం.. మహిళల్లో అనేక అనారోగ్య లక్షణాలను కలిగిస్తుంది.
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు.. మహిళల్లో గట్ బ్యాక్టీరియా పనితీరును ప్రభావితం చేస్తాయి. ఫలితంగా.. ఈ దశలో 30 నుంచి 60 శాతం మంది స్త్రీలు కడుపుబ్బరం, పొత్తికడుపులో అసౌకర్యంతో ఇబ్బందిపడతారు. ఈ సమయంలో ఫైబర్, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండే సమతుల ఆహారం
తీసుకోవడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మెనోపాజ్ దశకు వచ్చిన మహిళల్లో కనిపించే మరో లక్షణం.. చర్మం ముడతలు పడటం, జుట్టు రాలడం. ఈస్ట్రోజెన్‌లో క్షీణత.. కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు బ్లూ బెర్రీ, ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్లూబెర్రీలలో విటమిన్ సి, విటమిన్ కె మెండుగా లభిస్తాయి. ఇవి చర్మ సంరక్షణకు సాయపడుతాయి.
మెనోపాజ్ దశలో.. మహిళలను హృదయ సంబంధిత వ్యాధులు కూడా ఇబ్బంది పెడుతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్.. కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెనోపాజ్ సమయంలో ఈ హార్మోన్ తగ్గడంతో.. మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.