వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు సహజంగానే వస్తుంది. కానీ ఈమధ్య నడివయసులోనూ అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి సంబంధమైన ఈ రుగ్మతకు ధ్యానమే చక్కటి పరిష్కారమని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- హైదరాబాద్ పరిశోధకులు వెల్లడించారు. కోల్కతాలోని అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగంతో కలిసి ఐఐఐటీ-హెచ్ ఓ అధ్యయనాన్ని జరిపింది. ‘మేం ఓ నిర్ణీత వ్యవధిని ఎంచుకుని.. అధ్యయనంలో పాల్గొన్న వారిని బృందాలుగా విడదీశాం. రోజూ తప్పనిసరిగా ధ్యానం చేయాల్సిందిగా చెప్పాం. తర్వాత వాళ్లపై రకరకాల పరీక్షలు చేశాం. అప్పటివరకు ఉన్న మతిమరుపు లక్షణాలు తగ్గడం గమనించాం. అల్జీమర్స్ రోగుల్లోనూ రుగ్మత తీవ్రత బాగా తగ్గింది’ అని ప్రకటించారు పరిశోధకులు.