బరువు తగ్గడానికి ఇప్పుడు చాలామంది ‘కీటో డైట్’ పాటిస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కొవ్వు ఉండే ఈ ఆహారంతో మహిళల్లో ‘బ్రెస్ట్ క్యాన్సర్’ ముప్పు పెరిగే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం తేల్చింది. ఎలుకలపై చేసిన ఈ పరిశోధన ద్వారా.. పలు ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. అమెరికాలోని ఉటా యూనివర్సిటీకి చెందిన హంట్స్మ్యాన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు.. ఎలుకలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ‘క్యాన్సర్ అండ్ మెటబాలిజం’ అనే జర్నల్లో ప్రచురించారు. ఊబకాయం వల్ల శరీరంలో పెరిగే అధిక కొవ్వులే (లిపిడ్స్) క్యాన్సర్ కణతులు పెరగడానికి కారణం అవుతాయని ఈ సందర్భంగా వారు గుర్తించారు.
ఈ ఫలితాలు బ్రెస్ట్ క్యాన్సర్కు మాత్రమే కాకుండా.. అండాశయ, పెద్దపేగు క్యాన్సర్లకూ వర్తించే అవకాశం ఉన్నదని అధ్యయనం వెల్లడించింది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఉంటే.. కీటో ఆహారానికి దూరంగా ఉండాలని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ రోగులు, ఊబకాయ బాధితులు ఆహార ప్రణాళికను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఊబకాయం, రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న వ్యక్తులకు కొన్ని సలహాలు, సూచనలు కూడా అందించారు. లిపిడ్ స్థాయులను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలనీ, వైద్య పర్యవేక్షణ లేకుండా ‘కీటో’ వంటి తీవ్రమైన ఆహారాలను నివారించాలని చెబుతున్నారు. జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమతుల, సంపూర్ణ ఆహార విధానాలను ఎంచుకోవాలని అంటున్నారు.