కొద్దిపాటి పొలం. అరకొర రాబడి. అప్పుల తిప్పలు. ‘కుటుంబం గట్టెక్కడం ఎలా? పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేది ఎలా?’ అనే ఆ ఇల్లాలి తపన నుంచే ఓ బిజినెస్ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒరుగుల వ్యాపారం మొదలైంది. ఏడాదంతా కొనసాగకపోతేనేం! ఒక్క సీజన్లోనే లక్షల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఓ నలభైమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరింది రావిలాల అనూష. థ్యాంక్స్ టు వీ హబ్.
జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45. వీహబ్ ఆవరణ. ఎక్కడో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు నుంచి వచ్చిందో వివాహిత. ఆమెకు తోడుగా భర్త రామకృష్ణ. బిక్కుబిక్కు మంటూనే ఆ అద్దాలమేడలోకి అడుగుపెట్టారు. సాదర స్వాగతం లభించింది.
‘ఏం చెయ్యాలనుకుంటున్నారు?’
‘ఒరుగులతో వ్యాపారం మేడమ్..’
‘ఒరుగులంటే?’
‘మామిడికాయ పొడి మేడమ్’
‘ఓహ్.. ఆమ్చూర్! ఓకే ఓకే.. ఎలా చేస్తారు? మీకు మేమెలా సాయం చెయ్యగలం?’
‘మామిడి పిందె దశ నుంచి కాయగా మారుతున్నప్పుడు పుల్లని మామిడికాయలను తెంపి, పైన పొట్టు తీసి.. సన్న ముక్కలుగా తరిగి, ఎండ బెడతాం మేడమ్. వాటినే ఒరుగులు అంటారు. వాటిని పప్పు, కూరల్లో వాడుకోవచ్చు. ఉత్తరాదిలో చింతపండుకు బదులుగా వాడతారు. పప్పులో వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వాటిని పొడి చేసుకునే యంత్ర సామగ్రి కావాలి. మాకంటూ ఓ సొంత బ్రాండ్ ఉండాలని ఆశ’ అంటూ వ్యాపార ఆలోచనను వివరంగా చెప్పింది అనూష. లాంచ్‌ప్యాడ్ ఈవెంట్‌కు అనూషను ఎంపిక చేసి, ఇన్వెస్టర్ల ముందు కూర్చోబెట్టింది వీహబ్. మదుపర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. వీహబ్ రంగంలోకి దిగి ఆర్థికంగా సాయం అందించింది. లక్షల రూపాయల రుణం ఇప్పించింది. అలా ‘కృషి ఒరుగులు’ వ్యాపారం మొదలైంది.
రూ.15వేల పెట్టుబడితో..
అనూషది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ వరకు చదువుకుంది. పెండ్లయింది. ఇద్దరు పిల్లలు. ఉన్న ఎకరన్నర భూమే వారికి ఆధారం. ఆ పొలంలోనే పత్తి ఒకసారి, మిరప ఒకసారి వేసేవారు. అయినా ఆశించిన లాభాలు ఉండేవి కాదు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో మామిడి రైతులు కూడా ఇబ్బందిపడేవారు. ఈదురుగాలులకు కాయలు మొత్తం రాలిపోయి, చెట్లకిందనే కుళ్లిపోయేవి. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చిన వ్యాపారులు చాలా తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసేవారు. ఆ కాయలతో ఒరుగులు చేస్తారని, వాటితో పచ్చళ్లు పెట్టుకోవచ్చని, కూరల్లో విరివిగా వాడుకోవచ్చని అనూష తెలుసుకుంది. ఆమెకు ఆ వ్యాపార ఆలోచన బాగా నచ్చింది. వెంటనే, రూ.15 వేల పెట్టుబడితో నాలుగు చెట్ల నుంచి 2 టన్నుల మామిడి కాయలు సేకరించింది. ముక్కలుగా కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మగా లక్ష రూపాయల ఆదాయం వచ్చింది. ఇదేదో బాగుందని.. అనూష కుటుంబం మొత్తం ఒరుగులనే ఉపాధిగా మార్చుకుంది. ఈ క్రమంలో అనూష వ్యాపార విస్తరణకు ఖమ్మం డీఆర్డీఓ అధికారులను సంప్రదించింది. హైదరాబాద్‌లో వీహబ్ అనే వ్యవస్థ ఒకటుందని, అక్కడికి వెళ్లడమే సరైన మార్గమని చెప్పడంతో.. భర్తతో కలిసి హైదరాబాద్ బస్సు ఎక్కింది. వీహబ్ సహకారంతో ఐదేండ్ల నుంచీ ఏటా 50 క్వింటాళ్ల ఒరుగులు తయారు చేస్తున్నారు ఆ దంపతులు.
‘కృషి’ పేరుతో ..
వీహబ్ ఇచ్చిన పెట్టుబడితో కారం, పసుపు మిషన్లు కొనుగోలు చేశాం. వాటి ద్వారానే ఒరుగులను పొడిచేసి అమ్ముతున్నాం. మాకంటూ ఓ బ్రాండ్ ఉండాలనే ఉద్దేశంతో ‘కృషి’ పేరుతో వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా పొడిచేసే మిషన్ల కోసం ఎదురుచూస్తున్నాం. లేబుల్ ప్రింట్, ప్యాకింగ్ చేయాలి. వాటికి కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. పెట్టుబడి సమకూరితే.. వచ్చే ఏడాది ఆరంభం నుంచే ‘కృషి ఒరుగులు’ పేరుతో ఆమ్చూర్ పొడి మార్కెట్లోకి తీసుకొస్తాం. నేను వ్యాపారం మొదలుపెట్టిన తొలి రోజుల్లో అవరోధాలు సృష్టించినవారే.. ఇప్పుడు నా ఆలోచనను అనుసరిస్తున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏం ఉంటుంది? బిజినెస్ చెయ్యాలనే ఆలోచన ఉంటే.. తప్పకుండా వీహబ్‌కు వెళ్లండి. నా వ్యాపార ప్రయాణంలో మావారు రామకృష్ణ సాయం మర్చిపోలేనిది.
– ఆర్.అనూష, ఆంత్రప్రెన్యూర్