నాదం ఝుమ్మంది.. ఆమె పాదం సయ్యంది. 170 గంటలపాటు నిరంతరాయంగా నాట్యం పల్లవించింది. ఆ నృత్యకారిణి భరతనాట్య అభినయ వేదం.. ఆహూతులను అలరించడమే కాదు.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 20 ఏండ్ల రెమోనా ఎవెట్టే పెరీరా.. 170 గంటల భరతనాట్య ప్రదర్శన చేసి అద్భుతాన్ని ఆవిష్కరించింది. బీఏ ఫైనలియర్ చదువుతున్న ఆమె ఈనెల 21 నుంచి 28 వరకు భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది.
ఈ సంప్రదాయ భారతీయ నృత్యరీతిని నిరంతరాయంగా ఇంత సుదీర్ఘ సమయం ప్రదర్శించిన ప్రపంచంలోనే మొదటివ్యక్తిగా పెరీరా రికార్డు సృష్టించింది. ప్రతి మూడు గంటలకు పదిహేను నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ.. ఈ ఘనత సాధించింది. మూడేండ్ల చిరుప్రాయంలోనే నృత్య శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది రెమోనా. ప్రముఖ నాట్యగురువు శ్రీవిద్య మురళీధర్ దగ్గర భరతనాట్యం అభ్యసించింది.
2019లో అరంగేట్రం చేసిన ఆమె.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రదర్శనలిచ్చింది. ఈ మారథాన్ నాట్య ప్రదర్శనలో రెమోనా అలసిన వేళ.. ఆమె సహవిద్యార్థులు, నృత్యప్రియులు చప్పట్లతో ‘రెమో.. రెమో’ అంటూ ఆమెను ఉత్సాహపరిచారు. 2023లో, మహారాష్ట్రలోని లాతూర్‌లోని దయానంద్ కళాశాలలో 16 ఏళ్ల సృష్టి సుధీర్ జగ్తాప్ అనే యువతి 127 గంటలు నృత్యం చేసి గిన్నిస్వరల్డ్ రికార్డును సృష్టించింది. ఆమె.. కథక్ నృత్యాన్ని ప్రదర్శించింది. సృష్టి రికార్డును ఇప్పుడు రెమోనా తిరగరాసి.. అందరి మన్ననలూ అందుకున్నది.