రాజమౌళి సినిమాలో.. విలన్‌ను టార్గెట్ చేసిన ‘ఈగ’ను తెగ ఎంజాయ్ చేశాం! ఆ ‘ఈగ’కు మేమేం తక్కువ కాదంటున్నాయి దోమలు. నలుగురిలో ఒకరిని టార్గెట్ చేయడం వాటికి సరదా! రక్తం రుచి నచ్చితే.. ఎంత అదరగొట్టినా అవి బెదరవు. మన శరీరం నుంచి వెలువడే వాసనలు దోమలకు స్వాగత గీతికలు అవుతాయి.
అపరిశుభ్రతే వాటికి మన శరీరంపై దాడిచేసేలా ప్రోత్సహిస్తాయి. అందుకే, ఒకేచోట నలుగురు ఉన్నా.. దోమలు అందరినీ ఒకేలా కుట్టవు. ఒకరిద్దరిపైనే తెగ
దాడి చేస్తుంటాయి.
ఒక్కొక్కరి నుంచి వచ్చే చెమటను బట్టి వారి చర్మం వాసన ఒక్కోరకంగా ఉంటుంది. వీటిని బట్టికూడా దోమలు ఆకర్షితమవుతాయి. శరీరం ఎక్కువగా చెమట పడితే.. చర్మంపై ఉండే బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. అది కార్బాక్సిలిక్ యాసిడ్‌ను విడుదల చేస్తుంది. ఈ యాసిడ్ దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి, వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసిన తర్వాత స్నానం చేయడం అవసరం. దీనివల్ల శరీరం శుభ్రపడి, చెమట వాసన తగ్గి.. దోమలు దరిచేరే అవకాశాలు తగ్గుతాయి.
వాటికి నచ్చిన బ్లడ్‌గ్రూప్ ఉన్నవారినే దోమలు ఎక్కువగా కుడతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎంటమాలజీ నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఓ పాజిటివ్, ఓ నెగటివ్ బ్లడ్‌గ్రూప్ వ్యక్తులనే దోమలు ఎక్కువగా కుడతాయట. ఆ తర్వాతి స్థానం.. ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తులది. ఈ మూడు బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారితో పోలిస్తే.. మిగతా వారికి దోమల బెడద కాస్త తక్కువగానే ఉంటుందట. అందుకే.. ఓ, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు దోమల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
‘చలి’తోపాటే దోమలూ విజృంభిస్తాయి. చర్మాన్ని సూదుల్లా గుచ్చి.. రక్తాన్ని పీల్చేస్తుంటాయి. లేనిపోని అనారోగ్యాలకు గురిచేస్తుంటాయి. దోమల్లో 3,500 కన్నా ఎక్కువ జాతులున్నా.. కేవలం ఆడ దోమలు మాత్రమే మనిషిని కుడతాయి. ఎందుకంటే.. ఆడ దోమల్లో గుడ్లు ఎదగాలంటే.. ప్రోటీన్లు అవసరం అవుతాయి. అవి మనిషి రక్తం నుంచే లభిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దోమలు కొందరినే టార్గెట్ చేసి వారినే ఎక్కువగా కుడుతుంటాయి. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనిషి మనిషికీ శరీరతత్వంలో కొన్నిమార్పులు కనిపిస్తాయి. శరీరం నుంచి వెలువడే వాసనలు, ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉంటాయి. వీటితోపాటు వాళ్లు వేసుకునే దుస్తుల రంగులను బట్టికూడా దోమలు మనుషులను టార్గెట్‌గా చేసుకుంటాయని సెయింట్ లూయీస్ (అమెరికా)లోని టైసన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చెబుతున్నారు. కొన్నిజాతుల దోమలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాయట! వాటి ప్రవర్తన కూడా చాలా వింతగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. మనిషి చర్మం.. కొన్ని రసాయనాలతో కూడిన ప్రత్యేకమైన కాక్టెయిల్ను వాయు రూపంలో అతి స్వల్పంగా బయటికి విడుదల చేస్తుందట. ఈ కాక్టెయిల్ వాసన భిన్నంగా ఉన్నవారి వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితం అవుతుంటాయట.
మనిషి శ్వాస ద్వారా బయటికి వదిలే కార్బన్ డయాక్సైడ్ కణాలు.. దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిద్వారా 30 అడుగుల దూరం నుంచే.. దోమలు మనిషి జాడను గుర్తిస్తాయి. అంతేకాదు.. కార్బన్ డయాక్సైడ్ విడుదలయ్యే రేటును బట్టికూడా ఆకర్షణ ఆధారపడి ఉంటుందట. గర్భిణులు, వ్యాయామాలు ఎక్కువగా చేసేవారు, జీవక్రియ రేట్లు అధికంగా ఉండేవారి నుంచి ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంటుంది. అందుకే.. వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంటుంది.
ఓ అధ్యయనం ప్రకారం.. నారింజ, ఎరుపు రంగుల తరంగ దైర్ఘ్యాలకు దోమలు ఎక్కువ ఆకర్షితం అవుతుంటాయని తేలింది. దోమలకు స్పష్టమైన చూపు ఉండదనీ, అందుకే కొన్ని ప్రత్యేక రంగులను మాత్రమే అవి గుర్తించగలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, లేత రంగుల దుస్తులను ధరిస్తే.. దోమల బెడద నుంచి తప్పించు
కోవచ్చని సూచిస్తున్నారు.
దోమలు వేడి వాతావరణాన్ని ఇష్టపడతాయి. మనిషి శరీర ఉష్ణోగ్రతను బట్టికూడా వారిని కుట్టాలా? వద్దా? అనేది దోమలు నిర్ణయించుకుంటాయట. ఇక సువాసనలు వెదజల్లే సబ్బులు వాడేవాళ్లను కూడా దోమలు ఎక్కువగా కుడుతాయి. ఆ సబ్బుల్లోని సువాసనల ప్రభావం.. చర్మంపై చాలాసేపటి వరకు ఉంటుంది. అది దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందుకే.. చలికాలంలో అలాంటి సబ్బులను వాడకుండా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.