వెటరన్ అయినా.. వేడితగ్గని బ్యూటీ మలైకా అరోరా! 52 ఏళ్ల వయసులోనూ అందంతోపాటు ఫిట్‌నెస్‌లోనూ ‘తగ్గేదేలే!’ అంటున్నది. సినిమాలకన్నా.. వ్యక్తిగత విషయాలపైనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, విడాకులు, డేటింగ్, ఇండిపెండెన్స్ లాంటి అంశాలపై ఏదో ఒక చర్చకు తెరలేపుతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడపిల్లలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని తప్పు చేయొద్దని సలహా ఇచ్చింది. తన జీవితంలోనూ ఎన్నో మధురానుభూతులు ఉన్నాయనీ, చిన్న వయసులోనే తన కొడుకు అర్హాన్ పుట్టడం, తన జీవితంలోనే అద్భుతమైన అనుభవమనీ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి-జీవితానికి సంబంధించి సలహా ఇస్తూ.. “పెళ్లికి ముందు మహిళలు జీవితం గురించి తెలుసుకోవాలి. ఆర్థికంగా, భావోద్వేగంగా స్వతంత్రంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లిపీటలెక్కాలి” అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.
పెళ్లి, రిలేషన్షిప్స్ బ్రేకప్స్పైనా స్పందించింది. “నా పెళ్లి, రిలేషన్షిప్స్ నిలవకపోయాయని.. ప్రేమ-పెళ్లి అనే కాన్సెప్ట్ మొత్తం తప్పని నేను అనుకోవడం లేదు. అవి నాకు సరిపోలేదేమో.. అంతే!” అంటూ వెల్లడించింది. అయినా తనకు ప్రేమపై నమ్మకం ఏమాత్రం తగ్గలేదంటూ ప్రేమపై తన అభిప్రాయాన్ని పంచుకున్నది. తన వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించీ చెబుతూ.. “నేను పెళ్లిని నమ్ముతాను. నేనుకూడా పెళ్లిచేసుకున్నాను. ఆ తర్వాత విడిపోయాను. అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగాను. రిలేషన్షిప్స్లోనూ ఉన్నాను. అవి బ్రేకప్ అయినప్పుడు కూడా నేను దృఢంగానే ఉన్నాను. ఎందుకంటే, నాకు ఇప్పటికీ నా జీవితం అంటే ఇష్టం. నాకు ‘ప్రేమ’ అంటే ఇష్టం. ప్రేమను పొందడం, ప్రేమను పంచడం కూడా ఇష్టమే!” అంటూ తన మనసులోని భావాలను బయటపెట్టింది.
అయితే, తాను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదనీ, ప్రస్తుతం చాలా సంతృప్తిగా ఉన్నాననీ చెప్పుకొచ్చింది. మలైకా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాన్ ఖాన్‌ను 1998లో పెళ్లి చేసుకున్నది మలైకా. వీరికి ‘అర్హాన్ ఖాన్’ అనే కొడుకు ఉన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అర్బాన్తో విడాకులు తీసుకున్నది. ఆ తర్వాత తనకన్నా 12 ఏండ్లు చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో కొన్ని రోజులు డేటింగ్ చేసింది. అతనితోనూ బ్రేకప్ కాగా.. ప్రస్తుతం హర్ష్ మెహతాతో డేట్ చేస్తున్నదని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు చాలారోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మలైకా.. ప్రస్తుతం అడపాదడపా స్క్రీన్‌పై కనిపిస్తూనే ఉన్నది. ఇటీవలే ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ నటించిన ‘థమ్మా’ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.