జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే.. ఆరోగ్యపరంగా పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. నిద్ర, శారీరక శ్రమ, కూరగాయల వినియోగం ద్వారా.. గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. సిడ్నీ విశ్వవిద్యాలయం తాజాగా చేపట్టిన ఓ అధ్యయనం.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా 63 ఏళ్ల సగటు వయసు కలిగిన 53,242 మందిని.. ఎనిమిదేళ్లపాటు అధ్యయనం చేసింది. కేవలం 11 నిమిషాలు అదనంగా నిద్రపోవడం, నాలుగున్నర నిమిషాల శారీరక శ్రమ చేయడం, రోజుకు పావు కప్పు అదనంగా కూరగాయలు తీసుకోవడం వల్ల.. గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యం లాంటి ప్రమాదాలు 10 శాతం తగ్గుతాయని పరిశోధకులు తేల్చారు. సరైన సమయానికి నిద్రపోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
ప్రతిరోజూ 8 నుంచి 9 గంటల నాణ్యమైన రాత్రినిద్ర.. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక ఆరోగ్యం కోసం నిత్యం జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదని సిడ్నీ యూనివర్సిటీ అధ్యయనకారులు చెబుతున్నారు. బదులుగా.. రోజుకు కనీసం 30 నిమిషాల వేగవంతమైన నడక, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ అలవాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేస్తుంది. వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, షాపింగ్ బ్యాగులు మోయడం.. ఇలా నిత్య జీవితంలోని పనులతోనూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.
మరో ముఖ్యమైన అంశం.. ఆహారం. ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తాయి. గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలను పూర్తిగా తగ్గిస్తాయి. అంతేకాకుండా.. ప్రాసెస్ చేసిన మాంసాలు, చక్కెర పానీయాలు పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఈ సూచనలు పాటిస్తే.. గుండె ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుండె కండరాలు బలంగా తయారవుతాయి. మెదడుకు రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఈ నియమాలు కనీసం ఎనిమిదేళ్లపాటు పాటిస్తే.. శరీర అంతర్గత వ్యవస్థలు ఆరోగ్యంగా మారుతాయని పరిశోధకులు చెబుతున్నారు.