Gandhi Jayanti | సత్యం, అహింస మహాత్ముడు ధరించిన అస్ర్తాలు. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ బాపూ సంధించిన శస్ర్తాలు. పడమటి పొగరును తూర్పున అస్తమింపజేసిన మేరునగం మన గాంధీ. జాతియావత్తూ జాతిపిత వెంట నడిచిన క్షణం.. రెండు శతాబ్దాల స్వరాజ్య సమరం తుది అంకానికి చేరుకుంది. ఆనాడు వంటింటికే పరిమితమైన మహిళా లోకం.. బాపూ పిలుపు అందుకొని గడప దాటింది. గాంధీ వెంట దండికి తరలింది. ఉప్పు వండింది. మహాత్మాగాంధీ ఏం చెబితే అది.. ఎంత చెబితే అంత! అదే నాటి స్త్రీజాతి పంథా!!
సహాయ నిరాకరణలో ఓ అడుగు ముందున్నా.. మద్యపాన నిషేధంలో పది అడుగులు దూసుకుపోయినా… స్వాతంత్య్ర పోరాటంలో పురుషాధిక్యతకు సమాంతరంగా మహిళల సమర్థతా ప్రస్ఫుటించింది. ఇదంతా.. స్త్రీ శక్తిని బాపూ నమ్మబట్టే! మహాత్ముణ్నీ స్త్రీ జాతి అంతగా గౌరవించడం వల్లే!! నేటి గాంధీ జయంతి వేళ.. నాటి మేటి స్మృతులను మరోసారి అవలోకిద్దాం!
స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆకాంక్షించిన మహాత్ముడి గొంతు మహిళల సమానత్వానికీ నినదించింది. ఉద్యమాల్లో స్త్రీల భాగస్వామ్యానికి ఆయన ఆలోచనలు ఊతకర్రగా నిలిచాయి. పరబంధనాల నుంచీ దేశాన్ని విముక్తం చేయడమే కాదు, ఆమెకూ అసలైన స్వాతంత్య్రాన్ని అందించాలని సంకల్పించిన మహనీయుడాయన. విలువైన ఆలోచనలు, విశాల దృక్పథాల మేలిమి మేళవింపైన గాంధీ మహాత్ముడికి స్త్రీ జాతి నిత్యం నివాళి అర్పిస్తూనే ఉంటుంది.
మహిళలు పురుషులు అన్న లింగభేదాన్ని మహాత్ముడు నిరసించేవారు. ఇద్దరూ సర్వసమానులేనని నమ్మేవారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని ఆయన ప్రోత్సహించారు. అసలు పోరాటంలో మహిళలు ఎలా పనిచేస్తారన్నది ఆయనకు తొలిసారి దక్షిణాఫ్రికాలో ఎదురైన అనుభవం ద్వారా అర్థమైంది. ఆఫ్రికాలో గాంధీ ఉన్న సమయంలో… అంటే 1913 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది.
నల్లజాతీయుల పెండ్లిండ్లన్నింటినీ రిజిస్టర్ చేయించుకోవాలనీ, అలా చేయించుకోనివి అక్రమమైన వాటికింద జమకడతామనీ చెప్పింది. దీనికి ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ చట్టాన్ని ఆడవాళ్లంతా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అప్పుడు జరిగిన పోరాటానికి తొలి వరుసలో ఉన్నదీ మహిళలే. తొలిసారి ఉద్యమంలో భాగంగా భారతీయ స్త్రీలు జైలుకు వెళ్లిన ఘటన అది. గాంధీ ఈ ఉద్యమాలకి వెన్నుదన్నుగా ఉన్నారు. మహిళా శక్తిని ఆయన దగ్గరి నుంచి పరిశీలించిన మొదటి ఘటన అది.
స్వాతంత్య్ర పోరాటంలో జరిగిన అనేక ఉద్యమాల్లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందులో భాగంగా సారాయి దుకాణాల మూసివేతకు నేషనల్ కాంగ్రెస్ పనిచేస్తున్నది. అయితే అది అంత ఫలవంతం కాలేదు. దానికి సంబంధించిన కార్యకర్తలంతా మగవాళ్లనీ, సగం సగం మనసుతో వాళ్లు చేస్తున్న పోరాటం వల్లే అది అనుకున్న ఫలితాన్ని సాధించలేదనీ గాంధీ గమనించారు. అందుకే, మహిళల్ని ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేయాలని భావించారు. అదే విషయమై పిలుపునిచ్చారు. అటు నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి, అంటే 1930 ప్రాంతంలో ఖాదీ వస్ర్తాలే కట్టుకోవాలన్న చరఖా ఉద్యమంతో పాటు, మద్యపాన నిషేధమూ పూర్తిగా మహిళలకే అప్పగించారు. సరోజిని నాయుడు, హంస మెహతా, కమలాదేవి చటోపాధ్యాయలాంటి వాళ్లు వేల మంది మహిళల్ని అనేక బృందాలుగా ఏర్పరిచారు. వీళ్లంతా నారింజ రంగు చీరలు కట్టుకుని రోడ్లెక్కారు. మద్యపానానికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం విజయవంతంగా సాగింది. కలకత్తా, ముంబయిలాంటి మహానగరాల్లోనూ మద్యం దుకాణాలు మూతబడ్డాయి. మహిళాశక్తి మీద ఆయన అంచనా తప్పు కాదని నిరూపించిన పెద్ద సంఘటన ఇది.
గాంధీ గురించి ఎక్కడ చదివినా, ఆయన ప్రసంగాలను పరిశీలించినా… శీలం, నడవడి, ధీరత, అంకిత భావం, విశ్వాసం లాంటి వాటి గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తుండేవారు. శారీరక దార్డ్యం కన్నా మనసుకు సంబంధించిన ఇవే… మనిషిని అసలైన బలవంతుడిగా చేస్తాయని నమ్ముతారాయన. మహిళల విషయంలోనూ ఆయన అవే విలువల్ని ప్రామాణికంగా చెప్పేవారు. పురాణ స్త్రీ లైన సీత, ద్రౌపది, దమయంతిల గురించి గాంధీ ఎక్కువగా ప్రస్తావించేవారు. సీత సచ్చీలతే… రావణుడిని నిలువరించి, రాముడికి జయాన్ని చేకూర్చిందని అనేవారు. రకరకాల పనుల్ని ఒంటిచేత్తో చక్కబెడుతూ, క్లిష్ట సమయంలో కూడా చలించని ధీరత కలిగిన ద్రౌపదిని ఆయన గొప్ప వ్యక్తిగా అభివర్ణించేవారు.
దమయంతి పాత్రనూ అపరిమిత విశ్వాసానికి, ప్రేమకు మారుపేరుగా భావించేవారు. నలుడి విషయంలో దమయంతి చూపిన ఔదార్యం, ప్రేమ, విశ్వాసాలు… మహిళల గొప్ప స్వభావానికి అద్దాలు అనేవారు. ధీరోదాత్తల కథలు ఆయన్ని అమితంగా ఆకట్టుకునేవి. ‘మహిళలను బలహీన వర్గంగా లెక్కవేయడం అంటే వాళ్లను అవమానించడమే. మగవాళ్లు మహిళలకు చేస్తున్న అన్యాయాల్లో ఇదీ ఒకటి. శక్తి అనేదాన్ని నైతిక బలంగా తీసుకుంటే… అప్పుడు తప్పకుండా పురుషుల కన్నా మహిళలే బలవంతులవుతారు’ అని ఎప్పుడూ చెప్పేవారు.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి