Lagacharla Jyothi | ‘జై భీమ్’ సినిమాలో సినతల్లి గుర్తుందా? అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి, అక్రమ కేసులు పెట్టి, ఠాణాలో వేసి చితకబాదుతుంటే.. న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మరిచిపోలేం కదా! తన భర్తను పోలీసులు అరెస్టు చేయడంపై లగచర్ల గిరిజన బిడ్డ, నిండు గర్భిణి పాత్లావత్ జ్యోతి ఇప్పుడు
అలాంటి పోరాటమే చేస్తున్నది!
భూముల కోసం ప్రభుత్వ పెద్దల వేధింపులు! ఇవ్వబోమని తిరగబడితే పోలీసు కేసులు! అర్ధరాత్రి లైట్లు తీసేసి మరీ ఇండ్లపై దాడులు! చూలాలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించిన ఖాకీలు! బాధితులు అధికారులను ప్రశ్నించడమే నేరమైంది కానీ.. ఈ దౌర్జన్యాలు తప్పులు కూడా కావట! ఇలాంటి సర్కారు ప్రాయోజిత దాష్టీకాల మధ్య నిబ్బరంగా నిలబడింది జ్యోతి. భర్త ప్రవీణ్‌ను పట్టుకెళ్లినా తెగువగా కొట్లాడుతున్నది. ముసలి అవ్వల్ని, గిరిజన తల్లుల్ని చెయ్యిపట్టుకుని పట్నంలో మీడియా ముందుకొచ్చింది. లగచర్ల గుండెకోతను వెల్లడించింది. 11 నెలలుగా తాము చేస్తున్న ఆందోళనను వివరించింది. తమ ఊరికి, తమవారికి న్యాయం జరిగేవరకు ఢిల్లీ దాకైనా వెళ్తానంటున్నది. పోలీసులు ఎత్తుకెళ్లిన తమవారి కోసం తల్లడిల్లుతున్న గూడెం గుండెకూ, గిరిజన తల్లులకు జ్యోతి భరోసా ఇస్తున్నది.
‘సర్కారైతే ఏంది? పేదల్ని బొందపెట్టేది ప్రభుత్వమైతే ఏంది?
మా భూమిని గుంజుకుంటమంటే ఎట్లిస్తం? ఎట్ల ఊకుంటం?
ఈ భూమినే మేమంతా నమ్ముకున్నది! మా బతుకుదెరువు ఇదే!
రేపు నాకు పుట్టబోయే బిడ్డకూ ఈ భూమే కదా ఆధారం?’
ఇది పేగుబంధం.. ఇది నేలబంధం!’
ఆమె ఒక్కో మాట.. ఒక చెర్నాకోలా! ఒక్కో ప్రశ్న.. ఓ కొడవలి!
గుర్తుంచుకోండి.. ఆమె పేరు పాత్లావత్ జ్యోతి!
నవంబర్ 11వ తేదీ.. పగటి పూటంతా గంభీరంగా ఉన్న ఆ పల్లెలో రాత్రి రాజ్యం వీరంగం చేసింది. అర్ధరాత్రి దాటింది. లగచర్ల సమీపంలోని నాలుగు తండాల గిరిజనులంతా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో పెచ్చర్లగడ్డ తండాలో కరెంటు పోయింది. ఆ దొంగల రాత్రి.. పదేసి జతల బూట్లు కవాతు చేస్తున్నట్టు అలికిడి మొదలైంది. తన కడుపులో ఉన్న శిశువు గుండె చప్పుడును శ్రద్ధగా వింటున్న జ్యోతి మనసులో అలజడి రేగింది. తమ ఇంటిని సమీపించిన బూట్ల చప్పుడు గుమ్మం దగ్గర ఆగిందనిపించింది. అంతలోనే ‘దడేల్ దడేల్..’ అని తలుపులు కొట్టిండ్రు ఎవరో? ఏదో ఆపద ఇంటిమీదికి వచ్చిపడ్డదని భయం భయంగానే పక్కనుంచి లేచింది. లేని ధైర్యం తెచ్చుకొని ‘ఆజ్ రాత్ తలప్ మారె ఖును’ అంటూ తలుపు తీసింది. ఆ తర్వాత…
ఐదారుగురు పోలీసులు ఒక్కసారిగా ఆ ఇంట్లోకి దూరారు. మద్యం మత్తులో ఊగిపోతున్న ఓ కానిస్టేబుల్ కోపంగా ‘ఎక్కడే వాడు.. ప్రవీణ్‌గాడు ఏడే..’ అంటూ రెచ్చిపోయాడు. బిడ్డ సంరక్షణ కోసం పొట్టను పొందికగా అదిమి పట్టుకున్న ఆ కాబోయే తల్లిని పక్కకు తోసేసి.. ఆమె పెనిమిటి ప్రవీణ్‌ను పట్టుకున్నారు. కట్టుబట్టలతో బయటికి లాక్కెళ్లారు. ‘అయ్యో! అయ్యో!’ అని మొత్తుకుంటూ గుమ్మం బయ టికి వచ్చింది జ్యోతి. ఆ ఇంటిని దాదాపు 30 మంది పోలీసులు చుట్టుముట్టారు. ‘బాప్.. బాప్ మార్ దానినే చోడదో..’ అని కాళ్లపై పడి వేడుకుంటున్నా ఖాకీలు కనికరించలేదు. ‘ఏయ్.. లెవ్వే! లెగు’ అని ఆమెను నెట్టుకుంటూ ముందుకు కదిలారు. ‘మే పెటేటి చూ.. హమేన్ కుని చేని బాపు.. చోడదో బాపు’ (నేను గర్భవతినయ్యా.. ఇడ్సిపెట్టండయ్యా) అంటూ కాళ్లావేళ్లాపడ్డా.. కర్కశంగా వ్యవహరించారు. ప్రవీణ్‌ను పోలీసు వ్యాన్‌లో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఏడు నెలల గర్భిణి ఆ వ్యాన్ వెంట పరుగులు తీసింది. అయినా
కనికరం చూపలేదు. తమవారి అరెస్టును అడ్డుకున్న గిరిజన మహిళలపై పోలీసుల లాఠీలు కఠినంగా విరుచుకుపడ్డాయి.
ఆ రాత్రంతా జ్యోతికి కంటి మీద కునుకు లేదు. కట్టుకున్నోడి జాడ లేదు. ఆమె మనసు కకావికలమైంది. పెనిమిటిని ఎక్కడికి తీసుకుపోయినరో, ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మూడో జాము శాపంగా గడిచింది. భారంగా తెల్లారింది. రాత్రంతా పొగిలి పొగిలి ఏడ్చిన జ్యోతి.. పొద్దు పొడవడంతోనే పరిగికి పయనం కట్టింది. భర్త జాడ కోసం తన జీవితంలో ఎన్నడూ ఎరుగని పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. భర్త కోసం వేయి కండ్లతో స్టేషనంతా పరికించి చూసింది. అంతటా వెతికింది. ఓ మూలన గదిలో ప్రవీణ్ కనిపించాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే మనిషి నడవలేని స్థితిలో కనిపించాడు. జ్యోతి గుండె పగిలినంత పనైంది. నల్లగా కమిలిపోయిన భర్త చేతులను చూస్తూ ‘యే బాపు భగవాన్.. కాయిందో తొనే’ అంటూ విలవిల్లాడిపోయింది. ‘ఏం నేరం చేశాడని నా భర్తను చిత్రహింసలకు గురిచేశారు!’ అంటూ బోరున విలపించింది. ఆమె ఆవేదన చూసి అక్కడికి వచ్చిన గిరిబిడ్డలూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రవీణ్ శరీరమంతా గాయాలు. కౌకు దెబ్బలకు అతని ఒళ్లంతా హూనమైంది.
ప్రవీణ్, జ్యోతి బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. అతనే తన సర్వస్వం అనుకుంది. అతనే తన ధైర్యం అని భావించింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించాలని మూడేండ్ల కింద పాల ఆటో కొన్నాడు ప్రవీణ్. కేంద్రాల నుంచి పాలు తీసుకెళ్లి కంపెనీకి పోసేవాడు. కష్టపడే మనిషి అనిపించుకున్నాడు. తమ బిడ్డను బాగా చూసుకుంటాడనే నమ్మకం కలిగించాడు. పెద్దల అంగీకారంతో గత ఫిబ్రవరిలో జ్యోతి, ప్రవీణ్‌ల పెండ్లి ఘనంగా జరిగింది. మూడు నెలలు తిరక్కుండానే.. జ్యోతి నెల తప్పింది. ఇప్పుడు ఆమెకు ఏడో నెల. చక్కగా సాగుతున్న సంసారం. అర్థం చేసుకునే మొగుడు. నాలుగు రోజుల కిందటి వరకు వాళ్ల జీవితంలో సరదాలు తప్ప మరే కష్టమూ లేదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి పాలు సేకరించి కంపెనీకి ఇచ్చొచ్చేవాడు ప్రవీణ్. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని మురిపెంగా ఎదురుచూసేది జ్యోతి. సరదాగా పొలానికి వెళ్లి, మేకలు కాసుకుంటూ, ఆవులు, గేదెలు మేపుకొంటూ, చేనుకు నీళ్లు పెడుతూ ఆడుతూపాడుతూ పనిచేసుకునేవాళ్లు. ఇలా నవ్వుల తోటలో ఆనందాలు పూయించుకున్నారు.
ఈ చిన్న జీవితంలోనే స్వర్గాన్ని వెతుక్కున్న ప్రవీణ్ మనసులో ఒకవైపు ‘ఫార్మా సిటీ’ బుగులు తొలుస్తూనే ఉంది. ఎటుచూసినా పచ్చని పొలాలు. ఆ సారవంతమైన భూములే లగచర్ల, చుట్టుపక్కల తండాల్లోని గిరిజనులకు జీవనాధారం. ఆ బంగారు భూములపై ఫార్మా బూచోడి కన్నుపడ్డది. సొంత నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నమ్మబలికి.. అల్లుడి కోసం సాంతం ముంచేయాలనే ప్రయత్నం చేశాడు. మందీమార్బలాన్ని పంపి.. సంతకాల కోసం సతాయిస్తుంటే నెలలుగా గిరిజన రైతులంతా ఏదో ఒక రూపంలో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. గర్భిణి అయిన భార్య కలత చెందుతుందని ఈ విషయాలేవీ ఆమెకు చెప్పలేదు ప్రవీణ్. ఈ నెల 11న ఉదయం ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ వస్తున్నాడని తెలిసింది. నిరసనకు సిద్ధమయ్యారు అక్కడి రైతులు. వారిలో ఒకడిగా వెళ్లాడు ప్రవీణ్. తోపులాట జరుగుతుంటే.. ఎక్కడో దూరంగా ఉండి చూశాడు. వీడియోలో ప్రవీణ్ ఉన్నాడని పోలీసులు అర్ధరాత్రి అతనిపై దమనకాండకు దిగారు. ఆ రోజు రాత్రి ప్రవీణ్ సహా మరికొందరిని ప్రత్యేక సెల్‌లలో వేసి, పోలీసులు చిత్రహింసలు పెట్టారట. అవన్నీ భార్యకు చెబితే తనెంతలా కుమిలిపోతుందోనని ఆ బాధనూ తనలోనే దాచుకున్నాడు ప్రవీణ్. ‘నీ భర్తను ప్రత్యేక సెల్లో వేశారు. నానా హింసలు పెట్టార’ని ఇతర రైతులు చెబితే కానీ జ్యోతికి తెలియలేదు. అప్పట్నుంచి జ్యోతి కుమిలిపోతూనే ఉంది. భర్తను పూటకో స్టేషన్ తిప్పుతుండటంతో ఎక్కడున్నాడో తెలియక క్షణమొక యుగంగా కాలం గడిపింది.
‘జై భీమ్’ సినిమాలో సినతల్లిలా జ్యోతి కూడా తన భర్తను విడిపించుకునేందుకు పోరాటం చేస్తున్నది. రెండ్రోజులు తన భర్త ఎక్కడ ఉన్నాడో? ఎక్కడికి తీసుకెళ్తున్నారో? తెలియక ఆమె గుండె బరువెక్కింది. ఏ స్టేషన్‌కు తరలిస్తున్నారో కనీసం పోలీసులు చెప్పడం లేదు. ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు కానీ, ఆ ఎఫ్ఐఆర్ కాపీని కనీసం కుటుంబ సభ్యులెవరికీ ఇవ్వలేదు. ఎప్పుడెక్కడికి పంపుతున్నారో చెప్పలేదు. అక్కడ అధికార పార్టీ నేతలను ఎదిరించి న్యాయం చేసేవారు లేక లగచర్ల బాధితులంతా హైదరాబాద్‌కు పయనమై.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తమ గోడును వెలిబుచ్చారు. వారి గోసను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వారిని తెలంగాణ భవన్‌కు పిలిపించారు. వారితో మాట్లాడారు. ఆ ఆడకూతురు కష్టాన్ని మీడియాకు తానే స్వయంగా వివరించారు. ఈ గిరిజన బిడ్డల్లో భర్త జాడ కోసం ఎదురుచూస్తున్న జ్యోతి మాత్రమే కాదు.. మరెందరో ఉన్నారు. మనవడి కోసం నానమ్మ, కొడుకుల కోసం తల్లులు ఇలా ఎందరో.. పోలీసులు ఎత్తుకెళ్లిన తమవారి చూపు కోసం తల్లడిల్లుతున్నారు. మీడియా సాక్షిగా, కేసీఆర్ మాటగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు కేటీఆర్. తమ లీగల్ టీమ్‌ను రంగంలోకి దించి, వారిని బెయిల్‌పై తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే జ్యోతికి వైద్యపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాట నిలబెట్టుకున్నారు. తన భర్త విడుదలయ్యే దాకా పోరాటం ఆపేది లేదంటున్న జ్యోతికి మనమూ సంఘీభావం చెబుదాం.
‘అన్నా ఏ ప్రభుత్వమైనా రైతులతో రాజకీయం చేయొద్దన్నా. నా భర్తను అకారణంగా జైల్లో వేసి కొడుతున్నరు. ఈ సమయంలో ఏ ఆడకూతురికైనా పెనిమిటి దగ్గరుంటే ధైర్యం ఉంటది. ఏ నేరం చేయకుండా మా ఆయన్ను తీసుకెళ్లారు. చిత్రవధ చేస్తున్నరు. ఆయన దగ్గరలేకుంటే భయమైతుందన్నా! కడుపులో ఉన్న నా బిడ్డ ఆగమైతదని బుగులైతున్నది. ఓ ఆడపిల్ల ఘోష పట్టించుకునే నాథుడు లేడా! ప్రభుత్వం స్పందించి నా భర్తను ఇడిసిపెట్టకపోతే.. న్యాయం కోసం ఢిల్లీ దాకా పోతా. ఎవ్వరినైనా కలుస్తా! మానవ హక్కుల కమిషన్‌కు నా గోడు వినిపిస్తా! స్టేషన్లో ఉన్న నా భర్తతో ఫోన్లో మాట్లాడించడానికి ఓ పోలీసు రెండువేలు లంచం అడిగిండు. అన్ని పైసల్లేవంటే.. వెయ్యి రూపాయలు ఇస్తే మాట్లాడించిండు. ఇంత అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నడు.’
– పాత్లావత్ జ్యోతి, ప్రవీణ్ భార్య
– రవికుమార్ తోటపల్లి ,
– జి.భాస్కర్