ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎందరో అధిక బరువుతో సతమతమవుతున్నారు. పెరిగిన బరువును తలుచుకొని చాలామంది బాధపడుతుంటారు. వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, సరైన రీతిలో బరువు తగ్గకపోతే మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
బరువు తగ్గాలనుకునేవారు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. ఉదయం నిద్ర నుంచి లేవగానే గ్లాసు నీరు తాగితే మంచిదని నిపుణుల మాట. దీనిద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటికి వెళ్లిపోవడానికి నీరు అవసరం. ఒక గ్లాసు వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే మరీ మంచిది.
బద్ధకించకుండా క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. పొట్ట కొవ్వు తగ్గడానికి యోగా, జాగింగ్ సరైన ఎంపికలు. రెగ్యులర్‌గా కసరత్తులు చేయడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
బరువు తగ్గడం కోసం చాలామంది ఆహారాన్ని నియంత్రిస్తుంటారు. కఠోర ఉపవాసాలు పాటిస్తుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం మాట అటుంచితే.. కండరాలు బలహీనం అవుతాయి. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కండరాలు బలంగా ఉంటూ, బరువు తగ్గాలంటే ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆహారంలోని ప్రొటీన్ కంటెంట్ పొట్టను ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గొచ్చు.
నిద్ర నుంచి లేవగానే ఫోన్‌కు అతుక్కుపోకుండా.. పది నిమిషాలు ధ్యానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు తలెత్తినప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ధ్యానంతో ఒత్తిడి తగ్గుతుంది. దీంతో కార్టిసోల్ అదుపులో ఉండి.. బరువు నియంత్రణలో ఉంటుంది.