Janmashtami | కృష్ణతత్వం.. విశ్వవ్యాప్తమైంది. ప్రపంచానికి ‘గీత’ను కానుకగా అందించిన ఆ దేవదేవుణ్ని.. భూ మండలమంతా భక్తితో కొలుస్తున్నది. ఆ కన్నయ్య జన్మదిన వేడుకలను.. కన్నులపండువగా నిర్వహిస్తున్నది. ప్రాంతాలు-భాషలకు అతీతంగా.. ‘కృష్ణం వందే జగద్గురుం’ అని కీర్తిస్తున్నది. ఈ జన్మాష్టమి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడు కొలువైన ఆలయాలు, అక్కడ జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం. విశ్వవ్యాప్తమైన కృష్ణతత్వాన్ని గుండెల నిండా నింపుకొందాం!
ఉత్తర్‌ప్రదేశ్ బృందావనంలోని ఇస్కాన్ మందిరంలో.. కన్నయ్య జన్మాష్టమి వేడుకలు వైభవంగా సాగుతాయి. ‘కృష్ణ-బలరామ్ మందిర్’ అని కూడా పిలిచే ఈ ఆలయం.. పూర్తిగా పాలరాతితో నిర్మితమైంది. ఇక్కడ కృష్ణుడు, బలరాముడు, రాధా-శ్యామ్‌సుందర్ కొలువై.. భక్తులకు దర్శనమిస్తారు. ఈ గుడిలో నిర్వహించే జన్మాష్టమి సంబురాలు.. దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తాయి. కీర్తనలు, కృష్ణ లీల ప్రదర్శనలు, అభిషేక వేడుకలతో సందడిగా సాగుతాయి. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులతో.. ఈ ప్రాంతమంతా భక్తిభావంతో నిండిపోతుంది.
దుబాయ్‌లోని జెబెల్ అలీలో నిర్మించిన కృష్ణ మందిరం.. సాంప్రదాయ జన్మాష్టమి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మతాంతర సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. జన్మాష్టమిని భక్తి, సాంస్కృతికంగానే కాకుండా.. ఐక్యతకు చిరునామాగా మారుస్తుంది. ఇక్కడ నిర్వహించే జన్మాష్టమి వేడుకల్లో అన్ని మతాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. భజనలు, భక్తి పాటలతో ఆలయ ప్రాంగణంతోపాటు దుబాయ్ నగరాన్నీ మార్మోగిస్తారు.
సంక్లిష్టమైన హిందూ ఆలయ నిర్మాణ శైలికి ప్రతిరూపం.. లండన్‌లోని శ్రీ సనాతన్ హిందూ మందిర్. ఇక్కడ జన్మాష్టమి సందర్భంగా సంప్రదాయ హారతులు, ఉత్సాహభరితమైన భజనలతోపాటు లంగర్ (సహపంక్తి భోజనం) ప్రత్యేకంగా నిలుస్తాయి. రాధాకృష్ణుల వేషధారణలో తరలివచ్చే చిన్నారులు.. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ.
అమెరికాలోని స్పానిష్ ఫోర్క్ (ఉటా) నగరంలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఆలయం.. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. పర్వత సానువుల్లో రాజస్థానీ నిర్మాణశైలిలో ఈ ఆలయం రూపుదిద్దుకున్నది. ఇక్కడ నిర్వహించే జన్మాష్టమి వేడుకల్లో భిన్న సంస్కృతులకు చెందిన భక్తులు పాల్గొంటారు. రోజంతా వేద కథలు, కృష్ణుడి నేపథ్య నాటకాలు, కీర్తనలు ఆలపిస్తూ.. నందనందనుడిపై ఉన్న భక్తిని ఆనందంగా చాటుతారు.
స్విట్జర్లాండ్‌లోని ఇస్కాన్ మందిరం.. ఆల్ఫ్స్ పర్వత సానువుల్లోని ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరి కనిపిస్తుంది. ప్రకృతి రమణీయత నడుమ భక్తిని, కృష్ణతత్వాన్ని బోధిస్తుంది. ఇక్కడ జరిగే జన్మాష్టమి వేడుకల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. శ్రావ్యమైన కీర్తనలు, భగవద్గీత పఠనాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో భక్తిభావంలో మునిగిపోతారు. ఓవైపు మంచు కురుస్తున్నా.. రాత్రంతా భజనలతో జాగరణ చేస్తారు.