నడక.. అత్యుత్తమ వ్యాయామం. ఉదయం, సాయంత్రమే కాదు.. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం చాలామందికి అలవాటు. ఇది ఆరోగ్యకరం కూడా! అయితే, కొందరిలో ఈ అలవాటు.. మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రాత్రి భోజనం తర్వాత నడకకు వెళ్లొద్దని చెబుతున్నారు.
హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు రాత్రి భోజనం తర్వాత నడవడం మంచిది కాదు. సాధారణంగా ఆహారం తిన్న తర్వాత శరీరంలోని రక్తంలో ఎక్కువ భాగం జీర్ణవ్యవస్థ వైపు మళ్లుతుంది. అలాంటి సమయంలో వాకింగ్ చేస్తే.. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక రాత్రిపూట చల్లటి వాతావరణం.. సమస్యను మరింత జటిలం చేస్తుంది. మైకం, అలసటతోపాటు ఛాతినొప్పి లాంటి సమస్యలకు దారితీస్తుంది.
ఎసిడిటీ సమస్యతో ఇబ్బందిపడే వాళ్లు రాత్రి భోజనం తర్వాత వాకింగ్‌కు వెళ్లొద్దు. ఆహారం తిన్న వెంటనే నడక సాగిస్తే.. పొట్టలోని ఆమ్లాలు పైకి (గొంతులోకి) వస్తాయి. ఫలితంగా ఛాతిలో మంట, దగ్గుతోపాటు గొంతినొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది.
లోబీపీ (తక్కువ రక్తపోటు) బాధితులు కూడా ఈ అలవాటుకు దూరంగా ఉండాలి. ఆహారం తిన్న తర్వాత రక్తపోటు తగ్గుతుంది. అలాంటప్పుడు నడక ప్రారంభిస్తే.. సమస్య మరింత ముదురుతుంది. మైకం కమ్మినట్టు అనిపించడంతోపాటు మూర్ఛ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
చక్కెర వ్యాధిగ్రస్తుల్లోనూ రాత్రిపూట నడక ఇబ్బందికరమే! రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉన్నా.. లేదా ఇన్సులిన్ తీసుకున్న వెంటనే ఆహారం తిన్నా.. నడవడం మంచిదికాదు. ఈ అలవాటు రక్తంలో చక్కెర స్థాయులను మరింత తగ్గిస్తుంది. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.