సరిహద్దుల్లో కలకలం.. ఆ పల్లెలో కదనోత్సాహం. అలాగని ఆ గ్రామం ఎల్వోసీ సమీపంలో ఉందనుకుంటే
పొరపాటు. మన తెలంగాణలో.. పచ్చటి పొలాల మధ్య.. నిశ్చింతగా ఉన్న గ్రామం అది. కానీ, ఈ గడ్డన పుట్టిన
యోధులు రక్షణ రేఖ వెంబడి లక్ష్మణ రేఖగా నిలబడ్డారు మరి! ఒకరు కాదు ఇద్దరు కాదు.. పద్నాలుగు మంది
జవాన్లకు జన్మనిచ్చిన గ్రామం మామిడిపల్లి. ‘జై జవాన్.. జై కిసాన్..’ ఇదే ఆ పల్లె నినాదం. పల్లె పొలిమేరలో
వ్యవసాయం చేస్తూ కనిపిస్తారు పెద్దలు. యువకులేమో దేశ సరిహద్దులో.. రాకెట్ లాంచర్లు
భుజాన ధరించి గస్తీ కాస్తుంటారు. పొలిమేరలో మీసం మెలేస్తున్న మామిడిపల్లి కథ ఇది..
దేశ రక్షణకు అందరూ ముందుకు రావాలని చాలామంది పిలుపునిస్తారు. కానీ, ఆ రక్షకుడు తమ ఇంట్లో పుట్టకుంటే బాగుంటుందని భావిస్తారు. ఆయుష్షు గీత ఎంత బలంగా ఉన్నా.. యుద్ధంలో ఏ ప్రమాదం ఎట్నుంచి ముంచుకొస్తుందో తెలియదు. అందుకే, నరనరాల్లో దేశభక్తి ఉన్నా.. జవాన్ జాబ్ అంటే నూటికో కోటికో ఒకరు మాత్రమే ధైర్యం చేస్తారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామం పద్నాలుగు మంది సైనికులకు అడ్డా! ఊరు విడిచి దేశసేవకు అంకితం కావాలన్న ఆశయం 2001లో ఈ పల్లెలో పురుడు పోసుకుంది. అప్పట్నుంచి 14 మంది యువకులు ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళాల్లోకి వెళ్లారు. దేశ సేవలో తరిస్తున్నారు. అందుకే అడవి మామిడిపల్లి గ్రామాన్ని జైహింద్ మామిడిపల్లి, ఆర్మీ మామిడిపల్లి అని పిలుస్తుంటారు.
ఆర్మీ మామిడిపల్లి ఊళ్లో అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ‘ఉక్కు నరాలు.. ఇనుప కండరాలు ఉన్న యువకులు భారతదేశానికి కావాలి’ అన్న వివేకానందుడి మాటలు ఈ గ్రామ యువతకు అచ్చంగా సరిపోతాయి. ఆ మాటలే స్ఫూర్తిగా నూనూగు మీసాలు రాగానే.. ఆర్మీలో చేరడమే తొలి ప్రాధాన్యంగా పెట్టుకుంటారు ఇక్కడి పిల్లలు. అందుకోసం కఠోర సాధనలు చేస్తారు. కండలు పెంచి యోధుల్లా తయారవుతారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం… అనుక్షణం తమలో దేశభక్తిని నూరిపోస్తూ ఉంటుందని చెబుతారు మామిడిపల్లి యువకులు. మన్యం వీరుడు అల్లూరి విగ్రహం పోరాట స్ఫూర్తిని ఇస్తుందంటారు. ఇలా దేశభక్తికి ఆనవాలుగా నిలవడమే కాదు.. వీరత్వానికి చేవ్రాలుగా కీర్తి గడించింది ఆర్మీ మామిడిపల్లి.
ఇప్పటికే ఆర్మీలో పదిహేనేండ్ల పాటు సేవలు అందించి రిటైర్ అయిన జవాన్లు ఐదారుగురు మామిడిపల్లిలో కనిపిస్తారు. సరిహద్దు పరిస్థితులను గ్రామస్తులతో పంచుకుంటూ ఉంటారు. తాము ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను యువతకు వివరిస్తుంటారు. సైనికుల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తుంటారు. యుద్ధంలో మనదే పైచేయి అవుతుందనీ, పాకిస్థాన్‌కు అంత సీన్ లేదని చెబుతారు హవల్దార్‌గా పనిచేసిన వంజరి రవీందర్.
‘పాకిస్థాన్‌ది అంతా మేకపోతు గాంభీర్యమే. మనదేశాన్ని ఎదుర్కొనే సత్తా పాక్‌కు లేదు. అయితే, సరిహద్దుల్లో.. మనం టీవీలో చూస్తున్న దానికి, పేపర్లో చదువుతున్న దానికి చాలారెట్లు భీకర వాతావరణం ఉంటుంది. పరిస్థితులు అంచనాలకు అందకుండా మారిపోతుంటాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. నేను జవాన్ నుంచి హవల్దార్ దాకా పనిచేశాను. నేను విధుల్లో ఉన్నరోజుల్లో నిత్యం ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది. దేశం కోసం సదా సిద్ధంగా ఉండేవాళ్లం’ అని గుర్తు చేసుకున్నారు మాజీ జవాన్ వంజరి రవీందర్. ‘ఆర్మీ ఆపరేషన్స్‌లో పాల్గొన్న సైనికులకు ఆందోళన ఉండదు.
దేశం కోసం పోరాడుతున్నామని గర్వంగా ఉంటారు. అలాంటి అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తారు. మా మామిడిపల్లి బిడ్డలు వెన్ను చూపకుండా పోరాడతారు. ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాక్ కథ వారంలో ముగుస్తుంది అనడంలో సందేహం లేదు’ అంటారాయన. ‘భారత్ వైపు చూడాలంటేనే వణికిపోయేలా పాక్‌కు బుద్ధి చెప్పే సత్తా మన సైనికులకు ఉంది’ అన్నారు మాజీ ఆర్మీ జవాన్ కేతావత్ రవీందర్. మొత్తంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. మామిడిపల్లి మళ్లీ మీసం మెలేస్తున్నది. సరిహద్దులో ఉన్న తమ బిడ్డలు.. క్షేమంగా ఉంటారనీ, దేశానికి విజయం చేకూరుస్తారని బలంగా చెబుతున్నారు.
సాధారణంగా ఇంటర్, డిగ్రీ చదివే సమయంలో సినిమాలు, షికార్లు అంటూ టైం పాస్ చేయడం చూస్తుంటాం. ఈ గ్రామ యువకులు మాత్రం అర్హత రాగానే.. ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసి పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. ఆర్మీ జాబ్ కొట్టలేకపోతే పోలీసు ఉద్యోగంపై గురి పెడతారు. పోలీసు శాఖలో పదుల సంఖ్యలో ఉన్నారు ఇక్కడివాళ్లు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ సత్తా చాటుతున్నారు. అలా దేశసేవలో, సమాజ అభ్యున్నతిలో ముందున్న మామిడిపల్లి స్ఫూర్తి కేంద్రం అనడంలో సందేహం లేదు.
-జూపల్లి రమేష్, పోతన్న నీరడి శ్రీనివాస్