Manasi Girishchandra Joshiకృషి ఉంటే మనుషులు రుషులే కాదు, విజేతలూ అవుతారు. ఆ మాట అక్షరాలా నిజమని నిరూపించింది.. పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ మానసి గిరీశ్ జోషి. ఘోర ప్రమాదం తాలూకు విషాదం నుంచి బయటపడి.. ఒంటికాలితోనే పతకాలపంట పండించిందామె.
అహ్మదాబాద్‌కు చెందిన మానసికి బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. ఇంటి ఆవరణలోని మైదానంలో రోజూ తండ్రితో కలిసి ప్రాక్టీస్ చేసేది. ప్రతిసారీ మానసిదే విజయం. తను ఇంజినీరింగ్ చదివింది. భారత్ పెట్రోలియంలో మంచి ఉద్యోగమూ వచ్చింది. కొలువులో చేరిన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదం ఆమె కాలిని బలితీసుకుంది. స్కూటర్ మీద వెళ్తుండగా, అదుపుతప్పిన లారీ ఆమె పైకి దూసుకొచ్చింది. రెండు టైర్లూ ఎడమ కాలి పైనుంచి వెళ్లిపోయాయి. ఛిద్రమైపోయిన కాలిని పూర్తిగా తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అప్పటి వరకూ మైదానంలో చురుకుగా కదిలిన పాదం.. శాశ్వతంగా తన ఉనికిని కోల్పోయింది. మానసి కోలుకోవడానికే రెండు నెలలు పట్టింది. ఆ తర్వాత కూడా ఎటూ కదల్లేని పరిస్థితి. భవిష్యత్తు అంధకారంలా అనిపించింది. ఆ నిస్పృహ కూడా తాత్కాలికమే. నిరాశావాదంలో కూరుకుపోయినంతకాలం ఒక కాలు పోయిందే అన్న బాధ
వెంటాడేది. ఆశావాదం వైపు అడుగులు వేయగానే.. మరోకాలు ఉందికదా! అన్న నమ్మకం పెరిగింది. పారా బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుకునే ప్రయత్నం ప్రారంభించింది మానసి.
కృత్రిమ కాలికి ఎన్నో పరిమితులు. దానికి అలవాటు పడటానికే చాలా సమయం పడుతుంది. ఇక ఆటలంటే మాటలా? ఆ అడ్డుంకులన్నీ అధిగమించింది మానసి. హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ ఆమె జీవితంలో ఓ మైలురాయి. జాతీయ చీఫ్ కోచ్ గోపి సారథ్యంలో కఠోర సాధన ప్రారంభించింది. ఇంగ్లాండ్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రజతం, మహిళల పారా ఏషియన్ చాంపియన్‌షిప్ సింగిల్స్-డబుల్స్ విభాగంలో కాంస్యం, పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్ విభాగంలో కాంస్యం, తాజాగా మార్చి 13న జరిగిన స్పానిష్ పారా బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం.. ఇలా ఎన్నో ఘన విజయాలు ఆమె సంకల్ప బలానికి సాక్షి సంతకాలుగా నిలిచాయి. త్వరలో మరిన్ని పతకాలు వరించబోతున్నాయి.
– అనేకాళ్ల వెంకటరమణారెడ్డి
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”