కొందరు చిన్న విషయాలకే అతిగా స్పందిస్తుంటారు. లేనిపోని విషయాల గురించి అతిగా ఆలోచిస్తుంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు దిగాలుగా ఉంటారు. వీరి మానసిక ప్రవర్తనకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. మిగతా సంగతులు పక్కన పెడితే.. ఇలా మానసికంగా కుంగి పోవడానికి విటమిన్ డి లోపం కారణమని చెబుతున్నారు పరిశోధకులు. శరీరంపై ఎండ పడకపోవడం వల్ల విటమిన్ డి లోపం తలెత్తుతుంది. ఇలా విటమిన్ డి సరిపడా లేనివాళ్లు చిన్న సమస్యకు కూడా ఎక్కువగా స్పందిస్తారట. అంతేకాదు, భావోద్వేగాలను ఆపుకోలేరని, మానసికంగా కుంగిపోతారని హెచ్చరిస్తున్నారు.
అందుకు కారణం, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్లపై విటమిన్ డి ప్రభావం అధికంగా ఉంటుంది. అది శరీరానికి సరిపడా లభించకపోతే… ఎముకల పటుత్వాన్ని మాత్రమే కాదు, మనోబలాన్ని కూడా హరించి వేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినోదం కోసం గంటల తరబడి స్క్రీన్‌కి అతుక్కుపోయి ఇంటికే పరిమితం కాకుండా.. రోజూ కాస్త ఎండలో విహరించాలని సలహా ఇస్తున్నారు. రోజూ నీరెండలో నడక కొనసాగించండి. కుదిరితే ఆటలు ఆడండి. ఇలా చేయడం వల్ల మానసికంగా ఉల్లాసంగా మారడమే కాకుండా, శారీరక ఆరోగ్యమూ మెరుగవుతుంది.