పండుగ పూట అందరూ ఆనందంగా ఉంటే.. ఆడవాళ్లు మాత్రం అనారోగ్యానికి గురవుతున్నారట. ముఖ్యంగా, జీర్ణ సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారట. అయితే, ఎక్కువగా తినడమో, ఉపవాసాలు ఉండటమో.. ఇందుకు కారణం కాదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి.. రెండూ కలిసి మహిళల్లో జీర్ణ సమస్యలను పెంచుతున్నాయట.
యూగవ్-ఓషి హెల్త్ ఇటీవల నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 76 శాతం మంది.. పండుగలు, పర్వదినాల సమయంలో తమ జీర్ణక్రియ తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. పండుగ ప్రణాళిక, ప్రయాణాలు, షాపింగ్, వంటలు, ఇంటి పనులు పెరగడం, ఆతిథ్యం ఇవ్వడం వంటి పనులన్నిటినీ మహిళలే చూసుకుంటారు. అవన్నీ ఆడవాళ్లపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి పనులను పర్యవేక్షించడంలో పురుషుల వాటా కేవలం 8 శాతం మాత్రమేనట. అలా.. పండుగ బాధ్యతలు తీసుకునే మహిళల్లో ఒత్తిడి పెరిగినప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. మరికొందరిలో వేగవంతం అవుతుంది.
ఈ రెండు సమస్యలూ కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు, గుండెల్లో మంటకు దారితీస్తాయి. అంతేకాకుండా.. హార్మోన్ల సమస్యలు కూడా మహిళల్లో జీర్ణ సంబంధ సమస్యలకు కారణం అవుతున్నాయి. ఊపిరి సలపని పనులు, బిజీగా ఉండటం వల్ల తిండి, నీళ్లు తీసుకోకపోవడం, పిండి వంటలు చేసే క్రమంలో కాలుష్యానికి ఎక్కువగా గురవడం లాంటివీ వారిలో అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయట. వీటితోపాటు పండుగ ప్రయాణాలు, రోజువారీ పనుల్లో అంతరాయాల వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నట్లు 52 శాతం మంది వెల్లడించారు. మరో 42 శాతం మంది.. ఆర్థిక ఒత్తిడిని అతిపెద్ద సమస్యగా చెబుతున్నారు. మామూలుగా డబ్బు విషయాలు మగవాళ్లే చూసుకుంటున్నా.. బడ్జెట్, ఇంటి అలంకరణ, షాపింగ్, ఇతర పండుగ ఖర్చుల విషయాల్లో మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒత్తిళ్లే వారిని అనారోగ్యం పాలు చేస్తున్నాయని అధ్యయనకారులు చెబుతున్నారు.