సొంత గూడు లేక, అద్దె ఇంటిలో తలదాచుకునే కుటుంబాల బాధలు చెప్పనలవి కానివి. అద్దె ఇంట్లో ఉన్న మనిషి చనిపోతే, వారి బాధలు వర్ణనాతీతం. దొడ్డ మనసున్న ఓనర్ ఉంటే ఫర్వాలేదు! కానీ, మానవత్వం మరిచిపోయేవారితోనే సమస్య! మృతదేహాన్ని గడపలోకి కాదు సరికదా, వాకిట్లోకి తీసుకొస్తామన్నా ఒప్పుకోరు. అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని భీష్మించే యజమానులూ ఉంటారు. ఇలాంటి కష్టకాలంలో కిరాయిదారుల కన్నీళ్లు తుడుస్తూ మానవత్వం చాటుకుంటున్నారు గుర్రాల సరోజనమ్మ. మనిషి పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబానికి పెద్దమ్మగా అండగా ఉంటారు. పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు చేయిస్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సరోజనమ్మ కథ చదివితే మానవత్వానికి చిరునామా అంటే ఏంటో తెలుస్తుంది.
ఈ కాలంలో సగటు మనిషి ఆస్తిని రెట్టింపు చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నాడు. కానీ, బోధన్ పట్టణానికి చెందిన సరోజనమ్మ ఇందుకు పూర్తి భిన్నం. ఉన్న ఆస్తినంతా పది మందికి పంచిపెడుతున్న ఈమె దాతృత్వానికి కొలమానం లేదంటే కాదనగలమా?! ఎనిమిది పదుల వయసులో సమాజ హితం కోసం పాటు పడుతున్న సరోజనమ్మ సేవానిరతి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నది. కోట్లు కూడబెట్టిన సంపన్నులు ఎందరో చేయలేని పనులను తాను చేస్తూ సామాన్యులకు ఉపకారం చేస్తున్న ఆమె దయాగుణం నిరుపమానం. ఉద్యోగ విరమణ అనంతరం చేతికొస్తున్న పింఛన్‌తో శేష జీవితం గడుపుతున్న సరోజనమ్మ.. మిగిలిన ఆస్తినంతా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులను చేతపట్టి ముందుకు నడిపిస్తున్న ఆ ఆదర్శమూర్తి దాతృత్వానికి చిరునామాగా మారారు.
సరోజనమ్మ సేవల్లో మరుపురానిది ధర్మస్థలం నిర్మాణం. ఈ నిర్మాణం విలువైన ఆదర్శాలకు నిలువెత్తు రూపం. సమాజంలో కిరాయి ఇంట్లో ఉండే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారికి ఊరట కలిగించే అంశం కూడా. ఎవరైనా కాలం చేస్తే ఇంటి యజమానులు మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. చాలాచోట్ల ఇలాంటి హేయమైన పరిస్థితులు మనం కళ్లారా చూస్తున్నవే. బంధువులెవరైనా దూరప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటే ఆ శవాన్ని భద్రపర్చడం కూడా పేద కుటుంబాలకు భారమే. ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదనే తన చేతిలో ఉన్న నగదుతో ధర్మస్థలం పేరుతో శాశ్వత భవనాన్ని సరోజనమ్మ నిర్మించారు.
ఇందులో సొంతిల్లు లేని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించుకునేలా గదులను నిర్మించారు. మృతదేహాన్ని భద్రపర్చేలా ఫ్రీజర్‌ను సైతం ఏర్పాటుచేశారు. తద్వారా పేదలకు గెంటివేతల సమస్యలేవీ ఉండే ఆస్కారమే లేకుండా చూశారు. ధర్మస్థలం నిర్మాణం కోసం తన సొంత డబ్బును పెద్దమొత్తంలో వెచ్చించారామె. ఇప్పటివరకు ఇలాంటి నిర్మాణాలను ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన దాఖలాలే లేవు. అందులో ఓ సామాన్యురాలు, రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ ఈ కార్యక్రమం చేపట్టడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మస్థలం వల్ల చాలామందికి ప్రయోజనం చేకూరుతున్నది.
సరోజనమ్మ 1963 నుంచి 28 ఏండ్లపాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. యాభై ఏండ్ల క్రితం అక్షరాస్యత అంతగా లేని సమయంలో ఉద్యమం మాదిరిగా పిల్లలకు పాఠాలు చెబుతూ విద్యాబుద్ధులు నేర్పించారు. 1990లో రిటైర్మెంట్ తర్వాత కూడా వయోజనుల అక్షరాస్యత కోసం పాటుపడ్డారు. బడి ఈడు పిల్లలంతా పనులు వదిలేసి పాఠశాల మెట్లు ఎక్కేలా కృషిచేశారు. తనకెందుకులే అని భావించకుండా సమాజంలో మార్పు కోసం సరోజనమ్మ మొదటినుంచీ పాటుపడి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు.
ఎనిమిదేండ్ల క్రితం సరోజనమ్మ భర్త వెంకట్రావు కాలం చేశారు. ఈ దంపతులకు సంతానం లేదు. దీంతో సరోజనమ్మ తాను నివాసం ఉంటున్న ఇంటిని తెలంగాణ ఆల్ పింఛనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్‌కు విరాళంగా ఇచ్చారు. సుమారు 200 గజాల స్థలంలోని విలువైన ఈ ఇంటిని మహిళల అవసరాల కోసం కేటాయించి గొప్ప మనసును చాటుకున్నారామె. బోధన్ పట్టణంలోని సరోజనమ్మ ఇల్లు ఉన్నచోట గజం ధర రూ.50 వేల వరకు పలుకుతున్నది. చాలా ఖరీదైన భూమిని ప్రజలకు అంకితం చేశారు. తన సర్వీసులో రిటైర్డ్ మహిళా ఉద్యోగినులు పడిన వెతలను చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె చెబుతున్నారు. అంతేకాదు బోధన్ సమీపంలో రెంజల్ మండలం కందకుర్తిలో గోదావరి ఒడ్డున ఉన్న ఓ ఆశ్రమంలోని గోశాలకు రూ.2.50 లక్షలు విరాళం ఇచ్చారు.
తన జీవితంలో ఎదురైన ఘటనల ఆధారంగానే ఈ సేవలకు శ్రీకారం చుట్టానని చెప్తున్న సరోజనమ్మ ‘సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తుండటం వల్ల మానసికంగా సంతృప్తిని, వెలకట్టలేని ఆనందాన్ని పొందుతున్నాను’ అని కూడా అంటున్నారు. ‘పోయేటప్పుడు ఏ మనిషైనా ఏదీ తీసుకెళ్లలేడు. ఉన్నదంతా ఇక్కడే విడిచి పెట్టాల్సిందే. మనిషిగా బతికున్నంత కాలం మనం చేసే సేవలే మనల్ని చిరస్థాయిగా నిలబెడతాయన్నదే తన నమ్మకం’ అంటున్న ఈ మానవతావాది స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో మానవత్వం వికసించాలని కోరుకుందాం.
– జూపల్లి రమేశ్
– నీరడి శ్రీనివాస్