Rajamani | రాజమణి విధివంచిత. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథా శ్రమంలో పెరిగింది. ప్రేమించిన యువకుడితో పెండ్లి.. జీవితంపై కొత్త ఆశలను చిగురింప జేసింది. కానీ అది ఎంతోకాలం నిలువ లేదు. ఇటీవల పట్నం వరదల్లో భర్త సన్నీ కొట్టుకుపోయాడు. 11 రోజులైంది. భర్త జాడ కోసం రాజమణి ఎదురు చూస్తూనే ఉన్నది
సెప్టెంబర్ 14.. రాత్రి 7 గంటలు.. హైదరాబాద్‌లో వాన మొదలైంది.. కుండపోతగా మారింది.. ఇంటి నుంచి బయటికి వెళ్లిన భర్త రాకకోసం ఎదురుచూస్తున్నది రాజమణి. అనాథాశ్రమంలో పెరిగిన తనకు స్వర్గం రాసిస్తానని ప్రమాణం చేసి పెండ్లి చేసుకున్న దినేశ్‌కుమార్ (సన్నీ) మీదనే ఆమె ప్రాణాలన్నీ పెట్టుకున్నది. గంటలు గడుస్తున్నయ్.. భర్త నుంచి ఏ కబురు లేదు. మూడేండ్ల కొడుకును పట్టుకొని వీధి వాకిలి చూస్తూ భయం భయంగా ఎదురుచూడసాగింది రాజమణి. అర్ధరాత్రి.. ‘సన్నీ నాలాల పడ్డడు’ అని ఎవరో చెప్పారు. ఆ తర్వాత అతనేమయ్యాడో? ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.
అడిగితే ప్రభుత్వానికీ తెలియదు. నాలాలను ఉద్ధరించడానికే పుట్టుకొచ్చిన హైడ్రా తన భర్తను వెతికిస్తుందని కన్నీళ్లతో ఎదురు చూస్తున్నది.. పదకొండు రోజులుగా! ‘వెతుకుతున్నాం.. వెతుకుతున్నాం..’ అన్న మాటే తప్ప అవతలి నుంచి మరో సమాధానం లేదు. తన భర్త బతికే ఉంటాడన్న రాజమణి ఆశ నానాటికీ చచ్చిపోతున్నది. ప్రభుత్వాన్నీ, అధికారులనూ నిలదీయలేని ఈ అభాగ్యురాలు దేవుడిపైనే భారం వేసి.. తన సన్నీ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నది!
సారూ! నాది అనాథ బతుకు. అమ్మానాన్న నా చిన్నతనంలనే పోయినరు. మూడేండ్లుంటయ్ నాకప్పుడు. నేను, తమ్ముడు అనాథాశ్రమంల పెరిగినం. ఎవ్వలు లేని నా బతుకులకు సన్నీ అచ్చిండు. ఏమంత సదువుకోలే గని, నా కోసం కష్టపడుతుండె. అయిదేండ్ల కిందట మేం పెండ్లి చేసుకున్నం. మూడేండ్ల కిందట కొడుకు పుట్టిండు. ముషీరాబాద్‌ల ఉన్న వినోభానగర్‌లో ఓ చిన్న ఇంట్ల కిరాయికి ఉంటున్నం. మా అత్తామామ దగ్గర్లనే చిన్న ఇంట్ల కిరాయికుంటరు. సన్నీ దొరికిన పని చేస్తుంటడు. పెస్ట్ కంట్రోల్ పని, కేబుల్ పనులు, డీజే… ఇట్ల ఏ పనికి పిలిస్తే.. ఆడికి పోతడు. ఆయనికిప్పుడు పాతికేండ్లు ఉంటయ్. గీమధ్యనే రాపిడో కొడుతుండు. ఉన్నదాంట్ల సంతోషంగనే ఉన్నం. నా కోసం పాణం ఇచ్చేటోడు. నేను గిన బీపీవోల పనిచేస్తుండె! కొడుకును చూసుకునేటోళ్లు లేక.. ఏడాది నుంచి ఇంట్లనే ఉంటున్న.
పని లేని రోజు ఇంట్లనే ఉంటడు. బయటికి తిర్గనీకిపోడు. తాగుడు అలవాటు లేదు. పోయిన ఆదివారం (సెప్టెంబరు 14) నాడు పొద్దుట నుంచి నాతోనే ఇంట్ల ఉన్నడు. కొడుకుతోని చానా సేపు ఆడుకున్నడు. సాయంత్రం అయింది. వాళ్ల నాన్న మటన్ వండిండని తెలిసి.. అది తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ‘బైక్‌ల పెట్రోల్ అయిపోయింది. జేబుల పైసల్లేవ్. మమ్మీని అడుగుతా’ని మళ్లీ పోయిండు. అంతే.. ఏడున్నరకు వర్షం స్టార్టయింది. వాన తగ్గినంక వస్తడేమోని ఎదురుచూసినం. వాన తగ్గింది. ఎంతసేపైనా సన్నీ రాలే. రాత్రి ఎప్పటికో నాలాలో పడ్డడనే కబురొచ్చింది.
అత్త వాళ్లింటికాడ ఉన్నప్పుడే వాన షురువైంది. సన్నీ ఆడనే ఉన్నడు. ఇంతల వాళ్ల ఫ్రెండ్ ఇంటి నుంచి ఫోన్ వచ్చిందట. ‘ఇంట్లకి నీళ్లొస్తున్నయ్. బియ్యం నానిపోతయ్. సాయం పట్టనీకి వచ్చిపో’ అని పిలిచిండ్రట. నాలా పక్కన చిన్న చిన్న ఇండ్లు ఉన్నయ్. వానొచ్చినప్పుడల్లా ఇండ్లల్లకు నీళ్లొస్తయ్. దోస్తుకు సాయం చేయనీకి బైక్ వేసుకోని పోయిండు సన్నీ. నాలా గోడ పక్కన బండి పెట్టి, వాళ్లింట్ల ఆ బియ్యం బస్తాని వేరే గదిల పెట్టిండు. ఇంటికి రానీకి బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడే భూమి కదులుతుందంట. ఏందని అనుకున్నంతల్నే నేలంతా దొర్లిపోయింది. నాలాలో కూలిపోయింది.
ఆ వరదల నా సన్నీ కూడా పడ్డడట. వాళ్ల ఫ్రెండ్ మేనకోడలు గిన పడ్డదట. ఆమె చేతికి ఓ కట్టె తగిలింది. దాన్ని పట్టుకొని ఆగింది. నిలువులోతు వరదలో చిక్కుకున్న ఆమెను ఆక్కడున్నోళ్లు జుట్టు అందుకోని పైకి లాగినమని చెప్పినరు. మా ఆయన కేబుల్ పనికి పోయినప్పుడు.. చేతికి విండో గ్లాస్ కోస్కపోయింది. అప్పుడు చేతికి ఆపరేషన్ చేసిండ్రు. ఆ చెయ్యితోని బలంగా పట్టుకోనికి రాదు. కాబట్టి పట్టు దొరక్క నీళ్లల్ల కొట్టుకపోయుంటడు. ఆ రాత్రి అక్కడున్నోళ్లంత జమయ్యిర్రు. నాలాలోకి దిగి వెదికిండ్రు. ఎంత చూసినా ఏడ కండ్లవడలే. ఇదంతా రాత్రి తొమ్మిది గంటలప్పుడు జరిగింది. ఇగ ఎంతకీ దొరక్కపోయేసరికి వాళ్లు మా బావకు ఫోన్ చేసి ‘మీ తమ్ముడు నాలాల పడ్డడు’ అని చెప్పిండ్రు. అట్లనే పోలీసోళ్లకు చెప్పిండ్రు. ఈలోపే నాలా వరదల మా సన్నీ ఇంకా కిందికి కొట్కవోయిండు. నీళ్లల్ల కొట్కవోతుంటె ‘బచావ్.. బచావ్’ అని అరిచిండని బస్తీవాళ్లు చెప్పిండ్రు.
మా బావ, మరుదులు, బంధువులు, బస్తీవాళ్లు కలిసి ఆ రాత్రంతా ఎతికిండ్రు. నాలాలోకి దిగి రామ్‌నగర్ బాప్తిస్ట్ చర్చి వరకి దేవులాడిండ్రు. రాత్రి పూట సెల్‌ఫోన్ టార్చ్ లైట్లు వేసుకోని దేవులాడిండ్రు. పడ్డకాడికి అయిదు వందల మీటర్ల దూరంల బైక్ దొరికింది. అది తీయనీకి రాకుంటె.. ఆడనే వైర్లతోని కట్టేసిండ్రట. కానీ, మా ఆయన జాడ దొర్కలేదు. మున్సిపాలిటోళ్లు, హైడ్రా వాళ్లు అచ్చిండ్రు. ఆళ్లంతా పడ్డకాడ నుంచి కొద్దిదూరం వెతికిండ్రు. నీళ్లల్ల పడ్డోడు కిందికి పోకుండ ఉంటడా. కిందికిపోయి ఎత్కాలె కదా! ‘ఆడాడనే ఎతికిండ్రు’ అని మా వోళ్లు అన్నరు. వాళ్లు నాలాల కింది దాకా పోయుంటే జాడ పడేది. మల్ల పొద్దున వచ్చిండ్రు. మా వాళ్లు, గవర్నమెంటోళ్లు ఎతికిండ్రు. మంచిగ చూస్తే మా ఆయన దొర్కుతుండెనేమో!
వాన పాయె.. వరద తగ్గె.. పదకొండు రోజులైతాంది. నా సన్నీ జాడ లేకపాయె! మనిషిని కాపాడలేకపోతే పోతిరి. కనీసం జాడనైన దొరకబట్టాలె కదా? గవర్నమెంట్ ఆఫీసర్లు ఎత్కినం, ఎత్కుతున్నం అంటున్నరు. దొర్కలేదని చెప్తున్నరు. పడ్డకాడనే ఆడాడ ఎత్కి పోతున్నరు. వాళ్ల తమ్ముళ్లు, దోస్తులు గట్టిగ చూస్తున్నరు. మూసీలోకి పోయి చూసిండ్రు. జాడ లేదు. సూర్యపేట, నల్లగొండ జిల్లా పొయి దేవులాడిండ్రు. ఇంకా ఎత్కాలె! మా శక్తి ఎంత. ఎంతకని తిరుగుతం? ఏడన్నా ఒడ్డుకు చేరి బతికే ఉన్నడో? సర్కారోళ్లు ఆ దినమే గట్టిగ ఎత్కితే నా భర్త దొరుకు. సముద్రాల్ల, నదుల్ల కొట్కవోయినోళ్లను కాపాడుతున్నరు. చిన్న నాలాల పడ్డ మనిషిని ఆగం చేసిండ్రు. పదకొండు దినాలై.. ఆపీసర్లు ఇంటికొచ్చి చూసిపోతాండ్రు. కానీ, మా సన్నీ జాడ చెప్తలేరు. నా భర్త యాడున్నడో, ఎట్లున్నడో చెప్పండి సారూ! మీకు పుణ్యం ఉంటది!!
మాది పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్. మా నాన్నకు గుండెకు హోల్ ఉండెనట. దాంతోని సచ్చిపోయిండు. ఆ బాధతోనే కొన్ని దినాలకు అమ్మగిన సచ్చిపోయింది. అప్పుడు నాకు మూడేండ్లు. మా తమ్ముడు చానా చిన్నోడు. మా మేనత్త లాలాపేట (సికింద్రాబాద్)ల ఉన్న ఆశాకిరణ్ చిల్డ్రన్స్ హోమ్‌ల చేర్చింది. ఆ అనాథాశ్రమంలనే పెరిగిన. ఆడనే సదువుకున్న. రామ్‌నగర్‌ల ఉన్న సెయింట్ పాయిస్ కాలేజ్‌ల ఇంటర్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ద్వారా సన్నీ పరిచయమైండు. తను ఏడు వరకు చదివిండు. అప్పటికి జాబ్ చేస్తుండు. ఈ అబ్బాయిని లవ్ చేసిన. అయిదేండ్ల కింద పెండ్లి చేసుకున్నం. అనాథగా మిగిలిపోయిన నాకు ఓ తోడు దొరికిందనుకున్న. అమ్మానాన్నలు ఇచ్చిన ఆస్తులు లేవు. అత్తమామలకు ఇయ్యనీకి ఏ ఆస్తులూ లేవు. బైకు ఒక్కటే మాకున్న ఆస్తి. అది గూడ అప్పు జేసి కొన్నదే. ఏడాది ఈఎంఐలు కట్టినం. ఇంకో ఏడాది కిస్తులు మిగిలే ఉన్నయ్. ఎంత లేదన్నా సన్నీ రోజుకు అయిదారు వందలు సంపాదిస్తడు. అన్నీ అందులనే ఎల్లదీసుకునేది. నాకు అన్నీ అనుకున్న సన్నీ ఏమైండో! కొడుకు తప్ప నాకెవరూ లేరు. దేవుడు నన్ను మళ్లీ అనాథని చేసిండు.