ఈ ఆసనం వేయడం కొంత కష్టమే అయినా, ఫలితం మాత్రం విశేషం. గర్భిణులు వైద్యుల సలహా తీసుకుని, నిపుణుల పర్యవేక్షణలోనే ప్రయత్నించాలి. అసౌకర్యంగా అనిపిస్తే ఆపేయడం మేలు.
ముందుగా సమస్థితిలో కూర్చోవాలి. రెండు కాళ్లనూ ముందుకు చాచాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. రెండు చేతులను నుడుము వెనుక భాగంలో నేలకు ఆనించి సపోర్ట్‌గా ఉంచాలి.
ఇప్పుడు, నిదానంగా శ్వాస తీసుకుంటూ.. రెండుకాళ్లనూ మోకాలు దగ్గర వంచి, పాదాలను దగ్గరగా తీసుకోవాలి. పాదం పూర్తిగా నేలకు ఆనేలా జాగ్రత్తపడాలి.
నిదానంగా శ్వాస తీసుకుంటూ చిత్రంలో చూపినట్టు.. నడుము భాగాన్ని పైకెత్తాలి. అదే సమయంలో రెండు మోకాళ్ల మధ్య ఎడం ఉండేలా చూసుకోవాలి. చేతుల మధ్య, కాళ్ల మధ్య ఒకే దూరం ఉండేలా జాగ్రత్తపడాలి. శరీరం బరువు చేతులపై, కాళ్లపై సమంగా పడేలా చూసుకోవాలి. మన శరీరం నేలకు సమాంతరంగా ఉండాలి.
ఈ సమయంలో శ్వాసక్రియ నిదానంగా కొనసాగిస్తూ ఉండాలి. ఈ ఆసన స్థితిలో పది నుంచి ఇరవై సెకండ్లు ఉండాలి. ఈ సమయంలో చూపు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండాలి. నిదానంగా ఊపిరి వదులుతూ.. యథాస్థితికి రావాలి.
ప్రయోజనాలు
భుజాలు, మోచేతులు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. మెడ బలంగా అవుతుంది. శ్వాసక్రియ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు అవుతుంది.