పిల్లల ఇష్టాలు తెలియనప్పుడు.. తల్లిదండ్రులుగా వాళ్లకు కావాల్సిన ప్రేమను అందివ్వలేరు. పిల్లల పెంపకం అంటే.. వేళకు భోజనం, మంచి దుస్తులు కొనివ్వడం, నాణ్యమైన విద్య అందివ్వడం ఇవే అనుకుంటారు చాలామంది. కానీ, పిల్లల అభిరుచులను గుర్తించి, అందులో వాళ్లను ప్రోత్సహించడమే నిజమైన పేరెంటింగ్.
ప్రతి మనిషికీ ఏదో ఒక పని పట్ల, వ్యాపకం పట్ల ఆసక్తి ఉంటుంది. ఈ ఇష్టం చిన్నప్పుడే మొదలవుతుంది. రెండుమూడేండ్ల వయసు నుంచి కొన్ని పనులు, విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కొందరు పాటలు పాడేందుకు ఇష్టపడతారు. మరికొందరు సంగీతం వినడానికి ఉత్సాహం కనబరుస్తారు. విన్న పాటలు మళ్లీ మళ్లీ పాడే ప్రయత్నం చేస్తుంటారు. పిల్లలు వారి ఇష్టాలను దాచుకోలేరు. తమ ఆసక్తులను అందరి ముందూ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. బొమ్మలు గీయడం అంటే ఆసక్తి ఉన్న పిల్లలు.. గంటల తరబడి అదే పని చేస్తుంటారు. పెన్సిల్స్, క్రేయాన్స్ కొనివ్వమని అడుగుతూ ఉంటారు.
ఇలా వారికి ఇష్టమైన పనిని కాలక్రమంలో అభిరుచిగా మార్చుకుంటారు. అయితే, చిన్నారుల్లో ఇలాంటి వైఖరిని గుర్తించడం తల్లిదండ్రుల బాధ్యత. ‘మావాడు భలేగా పాడుతున్నాడే’ అని సంబురపడటంతోనే సరిపెట్టకుండా, అందులో వారికి తగినంత ప్రోత్సాహం ఇవ్వడం తప్పనిసరి. ఆర్థికంగా అవకాశం ఉన్నట్లయితే, ప్రత్యేక శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేయాలి. చదువు విషయంలోనూ పిల్లలు తమ ఆసక్తికి తగ్గట్టు వ్యవహరిస్తుంటారు. స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు ముందు వేసుకొని హోమ్‌వర్క్ మొదలుపెడతారు. అయితే, చాలామంది చిన్నారులు ఒక హోమ్‌వర్క్ పూర్తి చేయగానే పుస్తకాలు పక్కన పెట్టి.. ఆడుకోవడమో, బొమ్మలు గీయడమో చేస్తుంటారు. వారికి నచ్చిన సబ్జెక్ట్ వర్క్ ముందుగా ఫినిష్ చేస్తారన్నమాట.
ఇష్టమైన వాటిపట్ల ఆసక్తి కనబరచడం పిల్లల మొదటి లక్షణం. ఆ పని చేసేందుకు ప్రయత్నించడం రెండో లక్షణం. ఆ పనికి సమయం కేటాయించడం మూడో లక్షణం. ఈ మూడూ లక్షణాల ఆధారంగా పిల్లలకు ఏది ఇష్టమో తల్లిదండ్రులు అర్థం చేసుకోవచ్చు.
బోరింగ్ సబ్జెక్టులు తాపీగా చేసుకుందాం లే అనుకుంటారు. మిగతా సబ్జెక్టులపై ఎందుకు ఆసక్తి ఉండటం లేదు? అందులో వారికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? తెలుసుకోవాలి. అంతేకాదు, చిన్నపిల్లలపై ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నచ్చిన టీచర్ చెప్పే సబ్జెక్టుల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తారు. మిగతా టీచర్ల సబ్జెక్టుల విషయంలో నిర్లిప్తంగా ఉంటారు. పిల్లలు ఏ సబ్జెక్టులపై అయిష్టత వ్యక్తం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించి, ఆయా టీచర్లను సంప్రదించడం మంచిది. తరగతిలోని మిగతా పిల్లలు కూడా ఆ సబ్జెక్టుల విషయంలో నిరాసక్తంగా ఉంటున్నారని మీ దృష్టికి వస్తే.. ప్రిన్సిపల్‌తో చర్చించడం ఉత్తమం. పిల్లల ఇష్టాలను, ఇక్కట్లను గమనించి తగిన పరిష్కారం సూచించడం చాలా అవసరమని గుర్తుంచుకోండి.