మహిళల్లో హృద్రోగ బాధితులు పెరుగుతున్నారు. ప్రారంభంలోనే లక్షణాలు బయటపడుతున్నా.. వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అయితే.. మహిళల్లో గుండె జబ్బుల ముప్పును ముందుగానే పసిగట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో స్పందిస్తే.. ఆకస్మిక మరణాల నుంచి బయటపడొచ్చనీ అంటున్నారు.
కడుపులో అసౌకర్యం: చాలామంది మహిళలు గుండెజబ్బు లక్షణాలను జీర్ణ సమస్యలుగా పొరబడుతుంటారు. వికారంగా ఉండటం, వాంతులు, ఛాతీలో మంటను గ్యాస్, అల్సర్‌గా భావిస్తారు. అయితే, ఇలా కడుపులో అసౌకర్యంగా ఉండటం కూడా గుండె సమస్యకు సంకేతమే!
చల్లని చెమటలు: ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా.. కొందరిలో అకస్మాత్తుగా చల్లని చెమటలు పడుతుంటాయి. కానీ, చాలామంది దీనిని వేడి ఆవిర్లు, ఆందోళనతో వచ్చే చెమటగా భావిస్తుంటారు. గుండెపోటు వచ్చేముందు చల్లని చెమటలు పడుతుంటాయి.
శరీర భాగాల్లో నొప్పి: గుండెనొప్పి ఎప్పుడూ ఛాతీలోనే రాదు. మహిళల్లో ఎక్కువగా మెడ, దవడ, వీపు పైభాగంలో, భుజాలలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ, చాలామంది కండరాల ఒత్తిడిగా భావిస్తుంటారు. చికిత్సలో నిర్లక్ష్యం చేస్తుంటారు.
శ్వాస ఆడకపోవడం: తేలికపాటి శ్రమ చేసినా.. కొందరిలో శ్వాస ఆడదు. ఈ సమస్యను ఆందోళన, శ్వాసకోశ సమస్యగా పొరపాటు పడుతుంటారు. వైద్య సేవలకు నిరాకరిస్తారు. ఇదికూడా గుండె సమస్యకు సంకేతమే!
తలతిరగడం: బలహీనంగా ఉండటం, తల తిరగడం, స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం కూడా గుండె సమస్యను సూచిస్తుంది. సరిగ్గా తినకపోయినా ఇలాంటి సమస్యలే కనిపిస్తాయని అనుకుంటారు.
కాళ్లలో వాపులు: కాళ్లు, చీలమండలు, పాదాలలో వాపు వస్తే.. మధుమేహం, గాయాలుగా భావిస్తారు. కానీ, గుండె రక్తాన్ని సమర్థంగా పంప్ చేయకపోయినా.. ఇలా కాళ్లలో వాపు వస్తుంది.
అలసట: కొందరు చీటికీమాటికీ అలసిపోతుంటారు. దాన్ని నిస్సత్తువగా పొరబడుతుంటారు. కానీ, తగినంత విశ్రాంతి దొరికినా శరీరం అలసిపోతున్నదంటే.. అంతర్లీనంగా మీ గుండె సమస్యల్లో ఉన్నట్లే! అలాంటివారు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిందే!