మన కళ్లముందున్న యువతరం చూసేందుకు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించినా… అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. భారత్‌లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారిలో నెలకొన్న ఈ ప్రమాదంపై 2025లో ఎయిమ్స్-ఐసీఎంఆర్ కలిసి చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాల్లో 42.6 శాతం గుండె సంబంధిత సమస్యలే కారణమని ఈ పరిశోధన వెల్లడించింది. చాలామంది యువకులు తాము ఆరోగ్యంగా ఉన్నామని, తమకు ఎలాంటి లక్షణాలు లేవని భావిస్తుంటారు.
బయటికి ఆరోగ్యంగా కనిపించడం అంటే గుండె సంపూర్ణంగా పనిచేస్తున్నదని అర్థం కాదు. చాలా సందర్భాలలో ముప్పు కారకాలను ప్రాథమిక దశలో గుర్తించకపోవడమే ప్రమాదాలకు దారితీస్తున్నది. మన గుండెలో తెలియని చర్యలు అనేకం జరుగుతుంటాయి. అందులో ఒకటే ఈ ఏఎస్సీవీడీ. ధమనుల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ‘అథెరోస్ల్కెరోటిక్ కార్డియోవాసులర్ డిసీజ్’ (ఏఎస్సీవీడీ) అంటారు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. 50 శాతం కంటే తకువ బ్లాకేజీలు ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు.
70 శాతం దాటితేనే విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా గుండె నొప్పి లక్షణాలు బయటపడతాయి. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న యువకుడిలో ఒకసారిగా ఈ కొవ్వు నిల్వలు చిట్లిపోతే అది తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగానే యువతలో ఈ ముప్పు పెరుగుతున్నది. వాటిల్లో… ధూమపానం, ఈ-సిగరెట్లు, మాదకద్రవ్యాల వాడకం, విపరీతమైన ఒత్తిడి ప్రధానమైనవి. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, జంక్ ఫుడ్, మితిమీరిన మద్యపానం లాంటి చెడు అలవాట్లు మన గుండెకు చిల్లులు పెడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం, సకాలంలో ఆరోగ్య పరీక్షలు.. ఇవే మీ గుండెను భద్రంగా ఉంచే
ఆయుధాలు