ఉదయపు వ్యాయామానికి ముందు.. పండ్లు తినడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లతోపాటు గ్లూకోజ్-ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని శరీరం వెంటనే గ్రహిస్తుంది. వ్యాయామానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అందుకే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం కంటే.. ఏదైనా పండు తిని వెళ్లడం మంచిదని అంటున్నారు. పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో కలిసి కండరాలకు అవసరమైన గ్లూకోజ్‌ను అందిస్తాయి.
దీనివల్ల జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు త్వరగా అలసిపోకుండా ఉంటారు. ఇక వ్యాయామం చేసేటప్పుడు చెమట ద్వారా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల.. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అరటిపండు లాంటి వాటిలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది వ్యాయామం చేసే సమయంలో కండరాలు పట్టేయకుండా కాపాడుతుంది.
ఇక శక్తికోసం ఎక్కువ ఆహారం తిని జిమ్‌కు వెళ్తే.. కడుపు ఉబ్బరం, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అదే.. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. వర్కవుట్స్ చేయడానికి 30-45 నిమిషాల ముందు పండ్లు తీసుకున్నా.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖాళీ కడుపుతో కఠినమైన వ్యాయామాలు చేస్తే, శరీరం శక్తి కోసం కండరాలలోని ప్రొటీన్‌ను వాడుకుంటుంది. అదే.. పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. తద్వారా కండరాలు దెబ్బతినకుండా ఉంటాయి.