ఆదిమ మూలాల ఆవాహన
శిగమూగే శతాబ్దాల చీకటి పొరల నుంచి
దరువేస్తూ లేచింది గుడిసె వెనుకటి చరిత్ర!
పుట్టమన్ను బొమ్మకు మేకపోతు నెత్తుటి తర్పణం
చర్మనాదంపై పలికిన చైతన్య రాగం…ఆ అమ్మ
నాభి నుంచి తన్నుకొచ్చే నల్లని పాటతో
రేతిరి జాగారంలో వెలిగిన ఆఖరి దీపం ఆమె
ప్రకృతి నైవేద్యం పచ్చని తోరణం
ఐదువేళ్ల ప్రాణపూజలో పంచభూతాల సాక్ష్యం
పసుపు, కుంకుమల పొద్దుపొడుపుల దృశ్యం.
వేపమండల గాలిలో, బోనాల కదలికలో,
తాటికమ్మల పందిరి కింద తడిసిన శైశవంలో
తొలి నాగరికత అద్దం పట్టి
సృష్టికి బొట్టుపెట్టి చూపించిన ఆదిమ రూపం ఆమె
దిష్టిచుక్కల విశ్వరూపం
లోపలి అల్పబుద్ధిని, గుండెల్లోని గుబులును
కళ్లారబోసిన దిష్టి కింద..గుమ్మడికాయంత భయాన్ని
కడుపులోంచి కక్కించే క్రాంతి స్వరూపం!
అమ్మోరి ముఖమై, అరిచే శక్తుల దడుపును తరిమే
గుడిగంటల లయబద్ధ తాండవమామె.
పాదాలకు గజ్జెకట్టి, పల్లెను జాతర చేసి
ఉద్వేగాల ఉప్పెనలో ఊగిసలాడిన ఉత్సవమామె!
నాగరిక మృగం తెగిన పేగుబంధం
కానీ…ఇప్పుడు సిమెంటు అడవుల ‘నాగరికం మెకం’
అమ్మను పొట్టనబెట్టుకుని అట్టహాసం చేస్తోంది
కాలం గీసిన గీతల్లో, కాలిబాటల చీలికల్లో
కన్నతల్లి అడుగుల జాడ తప్పిపోయింది
వడ్డించిన విస్తరి ముడిచిన చందాన
సంబురం ముగిసి నిశ్శబ్దం మిగిలిన విధాన
ఆరిపోయిన ఆఖరి పాటలా…
ఇప్పుడు మిగిలింది ఆత్మలేని అనాథ బాల్యం
సంధికాలపు శూన్యంలో, సాంస్కృతిక అగమ్యంలో
దిక్కుతోచక తిరుగుతున్న పంజరపు పక్షులం మనం.
పునరుజ్జీవన పిలుపు (కొత్తనొప్పుల జన్మ)
ఇవ్వడం తప్ప తీసుకోవడం ఎరుగనిది మట్టి,
తీసుకోవడం తప్ప ఇవ్వడం
చేతగానిది ఈనాటి నెరజాణతనం!
యంత్రాల చప్పుడును చీల్చుకుంటూ
మట్టిగర్భం నుంచి సరికొత్త ప్రసవ వేదనలు మొదలవ్వాలి.
అంతరించిపోతున్న ఆ అమ్మోరి చూపును
మన కంటిపాపల్లో దాచి…
మళ్లీ కొత్తగా కనాలి… సృష్టిని మళ్లీ గెలవాలి!
– దుర్గాప్రసాద్ ఆదానం 9390453582