దాదాపు ప్రతి ఇంట్లో ‘వాము’ కనిపిస్తుంది. వంటల రుచిని పెంచే ఈ దినుసు.. అనేక అనారోగ్య సమస్యలనూ తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. ఇందులో పీచుపదార్థంతోపాటు యాంటి ఆక్సిడెంట్లు, ఇతర నూనెలు, పోషకాలు అధికంగా లభిస్తాయి. భోజనం తర్వాత వాము తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
భోజనం చేసిన తర్వాత ఛాతీలో ఇబ్బందిగా, మంటగా ఉంటే.. కొన్ని వాము గింజలు నమిలితే చాలు. వీటిల్లో ఉండే క్షార గుణం.. పొట్టలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. కారం, మసాలా ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తిన్న తర్వాత.. వాము తింటే, పొట్టలో యాసిడ్ పీహెచ్ స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలూ తగ్గుముఖం పడుతాయి.
వాములో ఉండే ‘థైమోల్’ అనే సమ్మేళనం.. కడుపులో జీర్ణ రసాలు, పైత్య రసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమై.. పోషకాలు రక్తంలో కలవడానికి సాయం చేస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోదు. దాంతో, బరువు నియంత్రణలో ఉంటుంది.
వాములోని యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు.. నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా చూస్తాయి. దాంతో, ఇది నేచురల్ మౌత్ ఫ్రెష్నర్గానూ పనిచేస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. ఉల్లి, వెల్లుల్లి లాంటి గాఢమైన వాసన వచ్చే పదార్థాలు తిన్న తర్వాత.. టీ స్పూన్ వాము గింజలు నమిలితే వాసన పోతుంది.
శరీరంలో పేరుకున్న మలినాలను తొలగించే ఏజెంట్‌గానూ వాము పనిచేస్తుంది. దీంట్లోని సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. కడుపులో మలినాలను బయటికి పంపేస్తాయి.
వాములో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడుతున్నవారు.. భోజనం తర్వాత వాము తింటే మంచి ఫలితం కనిపిస్తుంది.