బుధవారం 03 మార్చి 2021
Zindagi - Feb 03, 2021 , 01:08:40

మానవత్వపు..మొక్కు!

మానవత్వపు..మొక్కు!

కేశాలు దేవుడికే ఎందుకివ్వాలి? క్లేశాల్లో ఉన్నవారికీ ఇవ్వవచ్చు! క్యాన్సర్‌ చికిత్సలో భాగమైన కీమో థెరపీ కారణంగా జుట్టు కోల్పోయినవారికి కానుకగా అందించవచ్చు. అంతర్జాతీయంగా ‘హెయిర్‌ డొనేషన్‌'   ఉద్యమరూపం ధరిస్తున్నది.జనగామ జిల్లా ఇప్పగూడం గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్లు కూడా ఈ సత్కార్యానికి సాయం అందించారు. 

(ఫిబ్రవరి 4 ‘క్యాన్సర్‌ డే’ సందర్భంగా..)

టీవీలో హెయిర్‌ ఆయిల్‌ ప్రకటన వచ్చిన ప్రతిసారీ ఆ చిన్నారి.. తల్లివైపూ, ఆ యాడ్‌వైపూమార్చి మార్చి చూస్తుంది ఆశగా.బిడ్డ మనసు అమ్మకు తెలియదా? కానీ, పట్టించుకోనట్టు కనిపిస్తుంది.తప్పదు నటించాల్సిందే..కూతురు బతికినంత కాలం! ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది.క్యాన్సర్‌ వచ్చినందుకు కాదు,కీమో థెరపీ కారణంగా తన జుట్టంతా ఊడిపోయినందుకు.

ఔషధాలూ చికిత్సలూ మహా అయితే క్యాన్సర్‌ రోగిని బతికిస్తాయి. కృత్రిమంగా అమర్చినవే కావచ్చు,  కేశాలు మాత్రం బతుకుమీద ఆశను చిగురింపజేస్తాయి. కాబట్టే, కేశదానం మహాదానమని అంటున్నారు. క్యాన్సర్‌ రోగులకోసం తమ జట్టును ఇవ్వడానికి ఎంతోమంది ముందుకొస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదో ఉద్యమమై విస్తరిస్తున్నది. అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి అడుగులేస్తున్నాయి. అయితే, అన్ని వెంట్రుకలూ దానానికి పనికిరావు. ఆ కేశాలు పన్నెండు నుంచి పదిహేను అంగుళాల పొడవు ఉండాలని చెబుతారు నిపుణులు. ఒక విగ్‌ తయారు కావాలంటే, కనీసం అరడజను మంది దాతల సాయం అవసరం. తెల్ల వెంట్రుకలు  పనికిరావని చాలామంది భావిస్తారు. ఇది అపోహే. కీమో థెరపీ కారణంగా జుట్టు పోగొట్టుకున్న నడివయసు రోగులకు వాటిని అమర్చుతారు. తడిసి నేలపాలైన జుట్టు మాత్రం ఎందుకూ ఉపయోగ

పడదు. చుండ్రు లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా  కేశదానం చేయకూడదు.   ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ, ఒక వాట్సాప్‌ స్టేటస్‌ మాత్రం ఓ మంచి ఆలోచనకు స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లీ కూతుళ్లు గ్రామస్తులు తమను చూసి ఏమనుకుంటారో అని ఆలోచించలేదు. అద్దంలో అందంగా కనిపించమేమో అని భయపడలేదు, నమ్మకాల గురించీ చింతించలేదు. ‘కనిపించని దేవుడికి మొక్కుల పేరుతో ఇస్తుంటాం. కనిపించే మనుషుల కోసం ఈ మాత్రం చేయలేమా?’ అన్న నిర్ణయానికొచ్చారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడం గ్రామానికి చెందిన పోగు రోజా, ఆమె కూతురు వరాలి  ఈమధ్యే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేశదానానికి సిద్ధపడ్డారు.

ముంబైకి చెందిన ఓ స్నేహితురాలు తాను క్యాన్సర్‌ బాధితులకు శిరోజాలు ఇచ్చినట్లు వాట్సాప్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వార్త రోజాను ఆలోచింపజేసింది. తన జుట్టు కూడా ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది. బాల్యం నుంచీ జడ అంటే ఎక్కడ లేని మమకారం ఆమెకు. ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వారానికి రెండుమూడు సార్లు కుంకుడు కాయలు పెట్టి తలంటుకుంటుంది. ఆ కేశ సౌందర్యానికి బంధుమిత్రుల నుంచి ప్రశంసలూ వస్తుంటాయి. కానీ, హెయిర్‌ డొనేషన్‌ గురించి తెలిసినప్పటి నుంచీ తన ఆస్తిగా భావించిన జుట్టును క్యాన్సర్‌ బాధితులకు ఇవ్వాలన్న సంకల్పం బలపడింది. నెట్‌లో సెర్చ్‌ చేసింది. భర్తతో చర్చించింది.  అందరూ ప్రోత్సహించారు. ఆమె నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఓ క్యాన్సర్‌ రోగికి విగ్‌ తయారు చేయడానికి  తమ జుట్టును ఇచ్చేశారు రోజా, వరాలి.


‘కష్టాల్లో ఉన్నవారికి నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన ముందు నుంచీ ఉండేది. కానీ, ఆర్థిక సాయం చేసేంత స్థోమత నాకు లేదు. శిరోజాలు కూడా దానం చేయవచ్చని, ఓ స్నేహితురాలి ద్వారా ఈమధ్యే తెలిసింది. హీరోయిన్‌ సోనాలీ బింద్రే క్యాన్సర్‌ కారణంగా జుట్టు కోల్పోయిన ఫొటో పేపర్లలో చూశాను. చాలా బాధ అనిపించింది. ఎంతోమంది జుట్టుతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోతారు. అలాంటివారిలో నా జుట్టు స్థయిర్యాన్ని నింపుతుందంటే, అంతకన్నా ఏం కావాలి? నా నిర్ణయాన్ని మా ఆయన ప్రదీప్‌కూడా  ఒప్పుకొన్నారు. ముందుగా ఆయనకు థ్యాంక్స్‌ చెప్పాలి. నా కూతురు కూడా ఇస్తానంటూ ముందుకొచ్చింది. ఈ రూపంలో  సేవ చేసే అవకాశం రావడం  అదృష్టంగా భావిస్తున్నా’ అని చెబుతారు రోజా. ఓరోజు, తల్లీకూతుళ్లు వీధిలో వెళ్తుంటే..ఎవరో అడిగారు  ‘మొక్కా?’ అని. 

‘అవును..’ స్థిరంగా జవాబిచ్చారు ఇద్దరూ! ‘..కనిపించే దైవానికి. తోటి మనిషికి’ మనసులోనే అనుకున్నారు. 

ఎంత దూరమైనా వస్తా!

  నా పేరు శివ. హైదరాబాద్‌లో ఉంటాను. డిప్లొమా ఇన్‌ హెయిర్‌ సైన్స్‌ చేశాను. ఓ ప్రముఖ సెలూన్‌లో పనిచేశాను. క్యాన్సర్‌ రోగులకు నా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతో ‘హెయిర్‌ డొనేషన్‌ ఫర్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌' కార్యక్రమాన్ని ప్రారంభించాను. కేశదాతల నుంచి శిరోజాలను సేకరించి, ట్రస్ట్‌లకు పంపుతాను. ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖులు తమ జుట్టును ఇచ్చారు. తాజాగా, ఓ మారుమూల గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్లు ముందుకు రావడం సంతోషంగా ఉంది. జుట్టును దానంగా ఇవ్వాలనుకునేవారు, క్యాన్సర్‌ వ్యాధితో జుట్టు కోల్పోయి విగ్‌ ధరించాలనుకునేవారు 96664 06586 నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు. ఎక్కడున్నా వచ్చి సేవలు అందిస్తాను. 

- శివ (కేశదాన ఉద్యమకారుడు)

క్యాన్సర్‌ రోగులకు కేశదానం

అదో పాఠశాల.తలకు దస్తీ చుట్టుకొని బిక్కుబిక్కుమంటూ.. తరగతి గదివైపు నడిచింది ఓ విద్యార్థిని. స్నేహితులు ఎగతాళి చేస్తారేమే అన్న భయం. టీచర్లు తిడతారేమో అన్న అనుమానం.అంతలోనే.. చప్పట్ల వర్షం! ‘వెల్‌ కమ్‌ టు హెయిర్‌ డొనార్‌'బ్లాక్‌ బోర్డుమీద రంగురంగుల అక్షరాలు.ధైర్యంగా దస్తీ తీసేసింది!

- చిలగాని విజయ్‌ కుమార్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌

VIDEOS

logo