రకరకాల డిజైన్లు చూసి మరీ నగలను ఎంచుకుంటారు మహిళలు. ఆ హంగులేవీ లేక పోయినా.. సాదాసీదా తీగలనూ అందమైన ఆభరణాలుగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, రాగి వంటి లోహాలను సన్నని తీగలుగా సాగదీసి వాటితో జువెలరీకి ప్రాణం పోస్తున్నారు.
లోహపు తీగలను ఉంగరాలు, బ్రేస్లెట్లు, కంఠాభరణాలు, చెవిరింగులు.. ఎలా అయినా మలుచుకోవచ్చు. సన్నని దారాల్లా ఉంటేనేం వీటికి దృఢత్వం ఎక్కువ. తీగల నగలు చాలాకాలం నుంచీ ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని మంగళసూత్రాల కోసం ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ తీగలకు రాళ్లు, రత్నాలు, ముత్యాలు, పగడాలు, కుందన్ల వంటి అదనపు సొగసులు అద్దుతున్నారు. నిరాడంబరత, సౌకర్యం.. వీటి ప్రత్యేకత. ధర కూడా తక్కువే. ఖరీదైన ఆభరణాలు కొనలేనివారికి ఇతర లోహాలతో చేసినవీ అందుబాటులో ఉన్నాయి.
సృజనాత్మకత, ఆసక్తి ఉంటే.. తీగలను తెచ్చుకుని ఇంట్లోనే నచ్చిన ఆభరణాలను డిజైన్ చేసుకోవచ్చు.
అదనపు హంగుల కోసం పూసలు, ముత్యాలు జత చేసుకోవచ్చు. ఆ వన్నె వన్నెల తీగల సొగసులతో మల్లె తీగలా మెరిసిపోవచ్చు.