మిలమిల మెరిసే ముత్యాల్లాంటి దంతాలు మెరుగైన ఆరోగ్యాన్ని సూచిస్తాయి. గారపట్టిన దంతాలు మన అలవాట్లకు, ఆరోగ్య సమస్యలకు అద్దం పడతాయి. వాటి సంరక్షణ చాలా ముఖ్యం. అయితే, కొన్ని పదార్థాలు దంతాలకు కీడు చేస్తే.. మరికొన్ని దంతక్షయాన్ని అడ్డుకుంటాయి. అవేంటో తెలుసుకుందాం..
పాలు: క్యాల్షియం సమృద్ధిగా ఉండే పాలు దంతాలు బలంగా ఉండటానికి, దెబ్బతిన్న పంటి కణజాలం మరమ్మతుకు దోహదపడతాయి. పాలలో ఉండే ఫాస్ఫరస్ పంటి ఎనామెల్కు మేలుచేస్తుంది. అంతేకాదు పాలు లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. వీటిలో ఉండే కేసిన్ అనే ప్రొటీన్ పంటి మీద పొరలా ఏర్పడి దంతక్షయం కాకుండా చూస్తుంది.
బ్లాక్ గ్రీన్ టీ: వీటిలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది దంతక్షయం కాకుండా, చిగుళ్ల మంట
తగ్గడానికి ఉపకరిస్తుంది.
పండ్లు: ఇవి సహజంగానే దంతాలను శుభ్రపరుస్తాయి. నోట్లో ఉండే కొన్ని రకాలైన హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సహకరిస్తాయి. పండ్లలో ఉండే పోషకాలు, యాంటి ఆక్సిడెంట్లు దంతాలు దెబ్బతినకుండా, క్యావిటీలు రాకుండా చూస్తాయి.
నీళ్లు: సరైన మోతాదులో ఫ్లోరైడ్ ఉన్న నీళ్లు తాగితే క్యావిటీల నివారణ జరుగుతుంది. పైగా పండ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం నీళ్లు తాగడం వల్ల శుభ్రమైపోతుంది. లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోరు పొడి బారకుండా ఉంటుంది.
పాలకూర: క్యాల్షియం, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చక్కెర లేని చూయింగ్ గమ్: ఇది కూడా నోట్లో లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. దంతాలపై పాచిని తగ్గించడంలో దోహదపడుతుంది.