నాన్న యక్షగానం చేస్తుంటే ఆ పాటలను కైకట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపద సాహిత్యాన్ని సోపతి చేసుకుంది. చేను చెలకల సాక్షిగా బాణీ కట్టుకున్న తన పాటలను ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది చుంచు నాగవ్వ. ‘తిరుపతి రెడ్డి’ అంటూ తన స్వరాన్ని పరిచయం చేసి, ‘మోహన లాలి’ పాటను మారుమోగించింది. ప్రస్తుతం మంగ్లీతో జతకట్టి పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నది. జానపద కళాకారిణిగా తెలంగాణ భాష, సంస్కృతులను తన పాటల్లో పదిలం చేస్తున్న నాగవ్వను జిందగీ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నాది పెద్దబాల శిక్ష చదువు. మా బాపు యక్షగానం వింటూ పెరిగిన. జగిత్యాల జిల్లా అంబారిపేట మా ఊరు. ఆ చుట్టుపక్కల ఊళ్లందరికీ మా బాపు తెలుసు. ఆయన తీర్పులు చెప్పుట్ల నేర్పరి. ఊళ్ల పంచాయితీ అయితే బాపును పిలిచేటోళ్లు. ఆయన ఫైసలా చేస్తే వంక పెట్టేటోళ్లు ఉండకపోయేది. న్యాయం అంటే న్యాయమే అనేటోడు. ఇక బాపు పాడుతుంటే అందరూ చెవులు నిక్కబెట్టి వినేటోళ్లు. ఆయన గాత్రం అమృతమే! ఆయన పాటలు ఎప్పటికీ యాదికుండేలా వాటిని తిరిగి పాడుకునేటోళ్లం. అట్ల చిన్నప్పటి నుంచి పాటమ్మను సోపతి చేసుకున్నా. ఇంటికాడి అరుగుమీద కూసున్నప్పుడు ఉప్పసోలే.. చేనుకాడ పనిచేసేటప్పుడు అలసట రాకుండా పాటలు పాడుకునేదాన్ని. బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు కైగట్టి పాడేదాన్ని. లగ్గం చేసుకొని అత్తగారిల్లు గుల్లకోటకు అచ్చినాంక కూడా పాటను ఇడ్సిపెట్టలే! మా ఇంటాయాన కూడా భజన పాటలు పాడతడు. నేను పాట పాడినప్పుడల్లా ‘నీ గొంతు మంచిగుందె’ అంటడు.
నేను పాటలు మంచిగ పాడుతునని మా ఊరోళ్లు, ఇంట్లోళ్లు బాగ మెచ్చుకునేది. మొదట్లో నా పాటలు జనాల్లోకి రావాలనే ఆలోచన లేకుండె. నా కొడుకులిద్దరు కలిసి ‘సీఎంఎస్ చానెల్’ పెట్టి జానపదాలు మంచిగ పాడేటోళ్లతోని పాటలు పాడిస్తుండ్రి. మొదట్లో నా పాటలను కూడా వాళ్లతోనే పాడించేది. అనుకోకుండా ఒకరోజు నాకు కూడా పాడే అవకాశమిచ్చిన్రు. నా తొలి పాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చినా. నా గొంతును చాలామంది ఆదరించిర్రు. మైక్ పట్టుకోవడం కూడా రాని నేను ఆ పాటను ఒక్కసారికే పాడిన. ఆ తర్వాతకి ‘మోహనలాలి’ పాటతో జనాలకు మరింత దగ్గరైన. ఇక ఎనుకకు తిరిగి చూస్కోలె. ఇప్పటిదాంక ఇరవై పాటలు పాడుంట. నేను పాడిన పాటలకు బాణీ నాదే!
స్టూడియోకు పొయ్యి పాటలు పాడుతున్నప్పుడే.. నా కుటుంబ సభ్యుల సహకారంతో ఇతర అవకాశాల కోసం ప్రయత్నించిన. ఆ సమయంలోనే వనిత టీవీలో ‘సారంగదరియా షో’ సెలెక్షన్లు జరుగుతున్నయని ఎరుకైంది. నా చిన్నకొడుకు తిరుపతి నా పాటను రికార్డు చేసి పంపిండు. అందులో సెలెక్ట్ అయిన. మూడు ఎపిసోడ్లలో పాల్గొన్న. ఆ తరువాత ఎలిమినేట్ అయినా కూడా న్యాయనిర్ణేతలుగా ఉన్న సినిమా పాటలు రాసే కాసర్లశ్యామ్, సంగీతం చేసే భీమ్స్ నా గొంతు బాగుందని మెచ్చుకున్నరు. అవకాశాలు ఉంటే చెబుతామన్నరు. అన్న మాట నిలబెట్టుకున్నరు. వెంకటేశ్, సల్మాన్‌ఖాన్ నటించిన హిందీ సిన్మా ‘కిసీకా భాయ్ కిసీ కీ జాన్’లోని బతుకమ్మ పాటను భీమ్స్ నాతో పాడించిండు. కాసర్ల శ్యామ్ జానపద గాయని మంగ్లీని పరిచయం చేసిండు. మంగ్లీతో దోస్తీ అయినాంక నా పాట ‘కొప్పులోని పువ్వమ్మ…బాయికాడి బతుకమ్మ’ విడుదలైంది. అది లక్షల మందిని చేరుకుంది.
ఈ మధ్య విడుదల చేసిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాట మస్తు హిట్టయ్యింది. రెండున్నరేళ్లనుంచి పాడాలని అనుకున్న పాటకు గిప్పుడు మోక్షం వచ్చిందన్నట్టు. మంగ్లీతోని కలిసి పాడిన. ఆమెతో కలిసి పాడాలనే ఇన్నాళ్లు ఆగిన. ఆ పాట ప్రోమో విడుదలైన సంది మా చుట్టు పక్కల ఊళ్లల్లో ఉండే ట్రాక్టర్లలో, ఆటోల్లో అదే పాట ఇనవడ్తుంది. నా పాట నేనే వింటుంటే మస్తు సంతోషమైతున్నది. నా కొడుకులొచ్చి ఇప్పటివరకు నేను పాడిన పాటను లక్షమందికిపైగా విన్నరని చెప్పినప్పుడు కండ్లల్ల నీళ్లాగలే! నాకు పాట అలవాటు చేసిన మా బాపు యాదికొచ్చిండు. నా చిన్నకొడుకు తిరుపతి పట్నంల ఉంటడు. మంచి అవకాశాలొచ్చినప్పుడు నన్ను పట్నం తీస్కవోతడు. నా పాటను ఈ తరానికి తగ్గట్టుగా కొత్తగ తయారు చేస్తడు. నా కుటుంబం దన్నుగ నిలవడంతోనే.. నా పాటలు జీవం పోసుకుంటున్నయి.
నా మొదటి పాట రికార్డ్ అయి జనాల్లోకి పోయినాంక.. చాలా చాన్స్‌లు వచ్చినట్టే వచ్చి పోయినయి. రాత్రి ఫోన్ చేసి ‘రేపు ఉదయమే హైదరాబాద్‌కు రమ్మని’ చెప్పేటోళ్లు. నాకు ఊకె పట్నం పోవుడు కష్టమనిపిస్తుండె. అవకాశాల కోసం ఊరినిడిచిపెట్టి పట్నం పోవడం ఇష్టం లేకనే గ్రామంలోనే ఉంటున్న. ఇప్పటికే సినిమాలను జనపదాలు ఏలుతున్నయి. మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా నా పాటలకు ప్రాణం పోస్తా.
-రాజు పిల్లనగోయిన