ప్రకృతికి ప్రతిరూపం పార్వతీదేవి. ఆ తల్లి గారాలపట్టి వినాయకుడు.. ఏనుగుముఖంతో ఘనదైవమే కాదు వనదైవం అయ్యాడు. వనానికీ, జనానికీ, పర్యావరణానికీ మేలు చేసే గణపతి ఉత్సవాలు అందుకు విరుద్ధంగా చేసుకుంటుండటంతో వినాయక చవితి ఉద్దేశం నానాటికీ మరుగున పడుతున్నది. ప్రకృతి విధ్వంసకాలైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాల రంగులతో తయారుచేసిన వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం. కానీ, పండుగ లక్ష్యాన్ని గుర్తించి మట్టి వినాయకుడే మహా వినాయకుడన్న స్పృహ అందరిలో రావాలి. విత్తన గణపతి విశేష గణపతి అనే నిశ్చయానికి రావాలి.
ఆ మాటకొస్తే.. వినాయక చవితి పూర్తిగా ప్రకృతి పండుగ. స్వామి సేవలో వినియోగించే పత్రి, పువ్వులూ అన్నీ ప్రకృతి సిద్ధమైనవే. మరి వినాయకుడి ప్రతిమ విషయంలో ఎందుకు వికృత పోకడలు? ఈ వైఖరిని మార్చే ఉద్దేశంతో ఐదేండ్లుగా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విత్తన గణపతి ఉద్యమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నది. ఏటా వేలాది విత్తన గణపతులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నది. విత్తనాన్ని తనలో దాచుకున్న వినాయకుడు నవరాత్రులూ పూజలు అందుకొని.. ఆపై పదిరోజుల్లో మొక్కగా మొలుస్తాడు.
చెట్టుగా పెరుగుతాడు. వృక్షమై శతాబ్దాలు నిలిచి ఉంటాడు. పర్యావరణ హితంతోపాటు ఇటు పచ్చదనం పెంచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తున్నది. ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజిద్దాం. పర్యావరణ సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుదాం. చవితి వేడుకను హరిత హారానికి వేదిక చేద్దాం.
– జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు