Vijaya Dashami | శక్తి ప్రాముఖ్యాన్ని తెలిపే పండుగ దసరా. అతివలంతా ముచ్చటగా ఆడే బతుకమ్మ ఉత్సవాలు.. స్త్రీ శక్తి సాధించిన విజయానికి వంతపాడుతాయి. ఈ ఆధ్యాత్మిక శోభకు మూలకారణం జగన్మాత. చెడు చేతిలో చితికిపోయిన మంచిని గెలిపించడానికి మహాశక్తి అనేకానేక రూపాలు దాల్చి.. అసుర సంహారం చేసింది. మంచిని నిలిపింది. సమస్త లోకాలకూ విజయాన్ని అందించింది. విజయదశమి అమ్మ పండుగ. ఆ తల్లిని ఆరాధించే పండుగ.
అన్ని పండుగల్లాగే విజయదశమి కూడా ఐహిక, పారమార్థిక, సామాజిక అంశాలతో ముడిపడిన పండుగే. ఆధ్యాత్మిక సాధనలు మొదలుకొని లౌకికమైన ప్రయోజనాలనిచ్చే ఏ కొత్త పనికైనా శ్రీకారం చుట్టడానికి దసరా రోజులు ప్రశస్తమైనవి. అందుకే దసరాను శుభారంభాల పండుగగా పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమి నాటి సాయం సంధ్యలో తారకలు దర్శనమిచ్చే సమయానికి ఖగోళ శాస్త్ర రీత్యా విజయం అని పేరు. ఆ సమయంలో ప్రారంభించే ఎంత పెద్ద పని అయినా గొప్ప విజయాన్ని సాధిస్తుందని నమ్ముతారు. పూర్వకాలంలో చక్రవర్తుల జైత్రయాత్రలకు ప్రారంభ శుభ ఘడియగా దీన్ని భావించే వారు. జమ్మి చెట్టుకు పూజ చేసి, ప్రదక్షిణ చేసి రాజులు, దేవతలు జైత్రయాత్ర మొదలు పెట్టేవారని చెబుతారు. ఈ రకంగా అటు పారమార్థికంగా, ఇటు భౌతికమైన విజయ పరంపరలకు విజయదశమి గొప్ప శుభ సందర్భంగా భావిస్తారు.
విజయదశమిని జరిపే విధానాన్ని ధర్మసింధు ‘అత్రాపరాజితా పూజనం సీమోల్లంఘనం శమీపూజనం!’ అంటూ వివరించింది. విజయదశమినాడు అపరాజితా పూజ, సీమోల్లంఘనం, శమీపూజ చేయాలి. దసరా నాటి సాయంత్రం గ్రామ ప్రజలంతా ఊరి పొలిమేర దాటి ఈశాన్య దిక్కున ఉన్న శమీ వృక్షాన్ని పూజిస్తారు. శమీ పత్రాలను కొన్ని ప్రాంతాల్లో బంగారం అని పిలుస్తారు. సీమోల్లంఘనం శమీ పూజ ముందైనా, తర్వాతైనా చేయొచ్చు.
రామరావణ యుద్ధానికి, దసరాకు అవినాభావ సంబంధం ఉన్నట్లుగా చెబుతారు. ఆశ్వయుజమాసం దక్షిణాయనంలో వస్తుంది. అది దేవతలకు నిద్రా సమయం. అదే సమయంలో అమ్మవారు యోగనిద్రలో ఉంటారు. అప్పుడే రామరావణ యుద్ధం జరుగుతుంది. రావణున్ని రాముడు ఎన్నిసార్లు బాణంతో కొట్టినా మళ్లీ సజీవుడవుతుంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు నిద్రలో ఉన్న అమ్మవారిని ప్రార్థించగా ఆమె మేల్కొంది. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఆమె రాముడిని అనుగ్రహించింది. ఆ రోజు నుంచి సరిగ్గా పదో రోజు అంటే దశమి నాడు శ్రీరాముడు విజయం సాధించాడని ఒక కథనం. అప్పటి నుంచి ఆశ్వయుజ మాసంలో దేవీ ఆరాధన ప్రారంభమైందని చెబుతారు. ఇప్పటికీ భారతదేశంలో అనేక ప్రాంతాలతో పాటు కొన్ని దేశాల్లో కూడా రామలీల ఉత్సవం జరిపి విజయదశమినాడు రావణవధ చేస్తారు.